సేఫ్టీలో సున్నా.. భారత్‌లో తయారైన ఈ హ్యుందాయ్ కారుకు జీరో స్టార్ రేటింగ్!
భారత్‌లో తయారై ఆఫ్రికాలో విక్రయానికి ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10కి సంబంధించిన గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ఫలితాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఈ కారుకు జీరో స్టార్ రేటింగ్ లభించింది! దాదాపు అన్ని విభాగాల్లో కారు విఫలమైంది.
భారతదేశంలో తయారై ఆఫ్రికా మార్కెట్ల కోసం ఉద్దేశించిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారు.. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో అత్యంత పేలవమైన 'జీరో స్టార్' రేటింగ్‌ను పొందింది! ఈ హ్యాచ్‌బ్యాక్ కారు వయోజనుల రక్షణ విషయంలో సున్నా స్టార్లను, పిల్లల రక్షణ విషయంలో మూడు స్టార్లను మాత్రమే సాధించింది.

హ్యుందాయ్ ఐ10- క్రాష్ టెస్ట్ వివరాలు..
పాయింట్ల పరంగా చూస్తే, వయోజనుల భద్రత కోసం కేటాయించిన 34 పాయింట్లకు గాను ఈ కారు కేవలం 0 పాయింట్లు మాత్రమే నమోదు చేసింది. ఇక పిల్లల భద్రత కోసం కేటాయించిన 49 పాయింట్లకు గాను 28.57 పాయింట్లు సాధించింది.
కారు పిల్లల భద్రతలో కొంతవరకు మెరుగైన ఫలితాలు చూపించినప్పటికీ, వయోజనుల రక్షణ మాత్రం చాలా దారుణంగా ఉందని గ్లోబల్ ఎన్‌సీఏపీ పేర్కొంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాంతక గాయాలయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని టెస్ట్ నివేదిక హెచ్చరించింది.
హ్యుందాయ్ ఐ10- ప్రమాద పరీక్షల్లో ఏం వెల్లడైంది?
ఫ్రెంటల్ ఇంపాక్ట్ టెస్ట్: ఈ పరీక్ష నివేదిక ప్రకారం, డ్రైవర్ ఛాతీ రక్షణ చాలా బలహీనంగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమని వెల్లడైంది.
సైడ్ ఇంపాక్ట్ టెస్ట్: ఈ పరీక్షలో ఛాతీ రక్షణ స్థాయి 'అధిక ప్రమాదకరం'గా రేట్ అయ్యింది. అంటే, యాక్సిడెంట్ జరిగితే కోలుకోలేని గాయాలయ్యే తీవ్ర ప్రమాదం ఉందని, అనుమతించదగిన గరిష్ట గాయాల పరిమితిని దాటిందని గ్లోబల్ ఎన్‌సీఏపీ స్పష్టం చేసింది.
ఈ కారణాల వల్ల, వయోజనుల రక్షణకు గాను గ్లోబల్ ఎన్‌సీఏపీ ఈ కారుకు సున్నా పాయింట్లను కేటాయించింది.
కారు నిర్మాణంలో లోపాలు..
క్రాష్ టెస్ట్ నివేదిక ప్రకారం.. ఫ్రెంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కారు బాడీషెల్, ఫుట్‌వెల్ ప్రాంతం అస్థిరంగా ఉన్నాయని, అంటే మరింత లోడ్‌ను తట్టుకోలేవని తేలింది.
ముఖ్యంగా, ఆఫ్రికా-స్పెక్ గ్రాండ్ ఐ10 మోడల్‌లో సైడ్ బాడీ లేదా హెడ్ ఎయిర్‌బ్యాగ్‌లు సాధారణ ఫీచర్‌గా లేవు.
సీట్‌బెల్ట్ రిమైండర్‌లను కేవలం డ్రైవర్‌కు మాత్రమే అందించారు. అలాగే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) వంటి ముఖ్యమైన భద్రతా పరికరాలు కూడా ఈ మోడల్‌లో ప్రామాణికంగా లేవు.
గ్లోబల్ ఎన్‌సీఏపీ సీఈఓ వ్యాఖ్యలు..
ఈ ఫలితాలపై గ్లోబల్ ఎన్‌క్యాప్ సీఈఓ రిచర్డ్ వుడ్స్ మాట్లాడుతూ.. "తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో భద్రతా ప్రమాణాల విషయంలో ద్వంద్వ నీతి కొనసాగడం ఆమోదయోగ్యం కాదు. ఆఫ్రికాలో వాహన భద్రతను అందరిముందు పెట్టడం గ్లోబల్ ఎన్‌సీఏపీ ప్రాధాన్యత. వినియోగదారులు ప్రపంచంలో ఎక్కడ నివసించినా, వారికి సురక్షితమైన వాహనాలు అందుబాటులో ఉండాలి," అని అన్నారు.
ఇండియా-స్పెక్ మోడల్‌తో తేడాలు: భద్రతలో మెరుగేనా?
క్రాష్ టెస్ట్ చేసిన వాహనాన్ని భారతదేశంలో తయారు చేసి ఆఫ్రికా మార్కెట్లకు పంపారు. అయితే, దీనికి భిన్నంగా, భారతదేశం కోసం తయారు చేసిన హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌లో మరింత మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అవి..
డ్రైవర్, ప్యాసింజర్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు.
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్.
ముందు కూర్చునే ఇద్దరికీ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు.
నియోస్ కారు యొక్క టాప్ వేరియంట్లలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (వీఎస్ఎం), హిల్-స్టార్ట్ అసిస్ట్ వంటి అదనపు భద్రతా ఫీచర్లు కూడా అందిస్తున్నారు. అయినప్పటికీ, పిల్లల సీట్ల కోసం ఉపయోగించే ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్‌లు మాత్రం కేవలం అత్యంత ఖరీదైన టాప్-స్పెక్ ట్రిమ్ లెవల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


