Mutual funds : మ్యూచువల్​ ఫండ్ ఏయూఎం ఎక్కువ ఉంటే.. రిటర్నులు తగ్గిపోతాయా?

Mutual fund AUM : హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ ఏయూఎం ఇటీవలే రూ. లక్ష కోట్లను దాటింది. మరి ఫండ్​ ఏయూఎం పెరిగితే రిటర్నులు తగ్గిపోతాయా? ఈ  అంశంపై నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 9, 2026, 16:20:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) తాజాగా రూ. లక్ష కోట్ల మైలురాయిని విజయవంతంగా దాటింది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ పథకంగా ఇది నిలిచింది.

మ్యూచువల్​ ఫండ్స్​ గురించి ఈ విషయం మీకు తెలుసా?
మ్యూచువల్​ ఫండ్స్​ గురించి ఈ విషయం మీకు తెలుసా?

అయితే ఈ భారీ మైలురాయి చూశాక మ్యూచువల్ ఫండ్ మదుపర్లలో ఒకటే సందేహం మొదలైంది. ఫండ్ పరిమాణం అతిగా పెరిగితే బలమైన రాబడులను అందించడంలో వెనుకబడుతుందా? కేవలం సైజు పెద్దదిగా ఉందనే కారణంతో మంచి ఫండ్స్‌ను వదిలేయవచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రముఖ వెల్త్ మేనేజర్లు, ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్టులు స్పష్టతనిచ్చారు.

మ్యూచువల్ ఫండ్ సైజు పెరిగితే రిటర్న్స్ తగ్గిపోతాయా?

కేవలం ఫండ్ సైజు పెద్దదిగా ఉందని మ్యూచువల్ ఫండ్స్‌ను దూరం పెట్టకూడదని ఆనంద్ రాథీ వెల్త్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భరత్ రాథోడ్ స్పష్టం చేశారు. ఫండ్ పరిమాణం ఒక్కటే దాని పనితీరును నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు.

“ఒకేలాంటి ఏయూఎం ఉన్న ఫండ్లు కూడా పూర్తిగా భిన్నమైన ఫలితాలను ఇస్తుంటాయి,” అని భరత్ రాథోడ్ తెలిపారు. లార్జ్-క్యాప్ కేటగిరీని ఉదాహరణగా చూపిస్తూ.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ తన కేటగిరీలోనే అత్యంత పెద్దదిగా ఉన్నప్పటికీ, 2025లో అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. అదే సమయంలో మరో పెద్ద ఫండ్ అయిన యాక్సిస్ లార్జ్ క్యాప్ ఫండ్ మాత్రం ఆశించిన స్థాయిలో రాబడులు ఇవ్వలేకపోయిందని ఆయన వివరించారు.

దీన్ని బట్టి చూస్తే కేవలం కార్పస్ సైజు కంటే పోర్ట్‌ఫోలియోలో తీసుకునే నిర్ణయాలే రాబడులను నడిపించే ప్రధాన ఇంధనమని అర్థమవుతోంది. దీర్ఘకాలంలో ఆల్ఫా రిటర్న్స్ సంపాదించడానికి భారీ ఏయూఎం ఎప్పుడూ అడ్డుకాదని ఆయన భరోసా ఇచ్చారు. మిడ్-క్యాప్ కేటగిరీలలో ఫండ్ మేనేజర్లు తమ నిధులను ఇతర మార్కెట్ క్యాప్ సెగ్మెంట్లలో కూడా మళ్లించడానికి తగినంత వెసులుబాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

లిక్విడిటీ సమస్యలు ఎక్కడ వస్తాయి?

జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ శ్రీరామ్ బీకేఆర్ మాట్లాడుతూ.. మార్కెట్లో తగినంత డెప్త్ లేదా లిక్విడిటీ లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఫండ్ పరిమాణం సమస్యగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

“ఒక స్కీమ్ టార్గెట్ చేసే మార్కెట్లో తగినంత లిక్విడిటీ లేనప్పుడు, ఆ ఫండ్ ఏయూఎం విపరీతంగా పెరిగితే నిధులను సరైన రీతిలో సర్దుబాటు చేయడం కష్టమవుతుంది,” అని శ్రీరామ్ స్పష్టం చేశారు. అయితే పెట్టుబడులను స్వీకరించే తగినంత లోతు మార్కెట్లో ఉన్నట్లయితే, భారీ కార్పస్ పెద్ద సమస్యగా మరాదని ఆయన అభిప్రాయపడ్డారు.

గత మూడు, ఐదేళ్ల కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 10 ఫండ్స్‌ను పరిశీలిస్తే.. ఏయూఎం పరిమాణానికి, తక్కువ పనితీరుకు మధ్య ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని డేటా స్పష్టం చేస్తోందని ఆయన వెల్లడించారు.

మదుపర్లు వేటిని పరిశీలించాలి?

ఫండ్ సైజును చూసి కంగారుపడే బదులు ఇతర కీలక అంశాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

షార్ప్, సోర్టినో రేషియోలు వంటి రిస్క్-అడ్జెస్టెడ్ రాబడి నిష్పత్తులను, మార్కెట్ సైకిల్స్‌లో స్థిరంగా ఆల్ఫా సృష్టించే సామర్థ్యాన్ని పరిశీలించాలని భరత్ రాథోడ్ సూచించారు.

తోటి ఫండ్స్‌తో పోలిస్తే పనితీరులో స్థిరత్వం, రాబడుల నాణ్యత, పోర్ట్‌ఫోలియో బలాన్ని పరిశీలించాలని శ్రీరామ్ పేర్కొన్నారు. అంతేకాకుండా బెంచ్‌మార్క్‌తో పోలిస్తే పోర్ట్‌ఫోలియో ఎంత మేర రాబడులు ఇస్తోందో తెలిపే ఇన్ఫర్మేషన్ రేషియోను కూడా మదుపర్లు తనిఖీ చేయాలని ఆయన సలహా ఇచ్చారు.

ఫండ్ పరిమాణం పెరిగిపోయిందని భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకస్మికంగా పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

“ఫండ్ ఎంత పెద్దదిగా ఉందనేదాని కంటే, దాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనేదే మదుపర్లు గమనించాలి,” అని భరత్ రాథోడ్ తెలిపారు. అలాగే ఫండ్ చారిత్రక స్థిరత్వం, బెంచ్‌మార్క్‌ను అధిగమించే సామర్థ్యం, రిస్క్ ప్రొఫైల్‌కు సరిపోతుందా లేదా అనేది బేరీజు వేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.

మొత్తంమీద చూస్తే, లక్ష కోట్ల ఏయూఎం అనేది గమనించదగ్గ విషయమే అయినప్పటికీ, కేవలం ఆ ఒక్క కారణంతో ఫండ్ నుంచి తప్పుకోవడం లేదా దూరంగా ఉండటం సరికాదని నిపుణులు తేల్చిచెబుతున్నారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More