గిల్ ఇక్కడ తప్పు చేస్తున్నావ్ అని చెప్పిన విరాట్ కోహ్లి.. కొత్త కెప్టెన్‌తో చాలాసేపు మాట్లాడిన మాజీ కెప్టెన్ రోహిత్

ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల నుంచి మంచి మద్దతు లభిస్తుండటం విశేషం.

Published on: Oct 17, 2025, 18:51:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆస్ట్రేలియాతో జరగబోయే అత్యంత ఆసక్తికరమైన వన్డే సిరీస్‌కు భారత్ తమ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఆప్టస్ స్టేడియంలో జరిగిన రెండో ప్రాక్టీస్ సెషన్‌లో జట్టు దృష్టి మొత్తం విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మపైనే నిలిచింది. నెట్స్‌లోనూ, వెలుపల కూడా వీరి చుట్టూనే ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి.

గిల్ ఇక్కడ తప్పు చేస్తున్నావ్ అని చెప్పిన విరాట్ కోహ్లి.. కొత్త కెప్టెన్‌తో చాలాసేపు మాట్లాడిన మాజీ కెప్టెన్ రోహిత్ (PTI)
గిల్ ఇక్కడ తప్పు చేస్తున్నావ్ అని చెప్పిన విరాట్ కోహ్లి.. కొత్త కెప్టెన్‌తో చాలాసేపు మాట్లాడిన మాజీ కెప్టెన్ రోహిత్ (PTI)

అటు శ్రేయస్ అయ్యర్ తనదైన దూకుడుతో నెట్స్‌లో చెలరేగిపోగా, శుభ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో గిల్ సంభాషణలు చాలా ప్రత్యేకంగా అనిపించాయి. యువ భారత కెప్టెన్ వివిధ రకాల బౌలింగ్‌ను ఎక్కువ సమయం ఎదుర్కొన్నాడు. ఈ సందర్భంగా, కొన్ని షాట్ల ఎంపికపై కోహ్లీని పదేపదే సలహా అడగడం కనిపించింది.

కోహ్లీ సూచనలు.. పాటించిన గిల్

ఎప్పుడూ చాలా పకడ్బందీగా ఉండే విరాట్ కోహ్లీ.. గిల్‌కు ఫుట్‌వర్క్, షాట్ ఎంపికపై అనేకసార్లు సూచనలు చేశాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఏకాగ్రతతో సాగింది. గిల్.. కోహ్లీ చెప్పిన సలహాలను శ్రద్ధగా విన్నాడు. కోహ్లీ తన బంతుల మధ్యలో గిల్ కు సైగలు చేస్తూ, టెక్నిక్స్ చెబుతూ కనిపించాడు. యాంగిల్స్, బ్యాక్‌లిఫ్ట్ టైమింగ్, ఫాలో-త్రూ గురించి గిల్‌తో చర్చించాడు. గిల్ చేస్తున్న పొరపాట్లపైనా కోహ్లి సూచనలు చేశాడు.

రోహిత్‌తో వ్యూహాత్మక చర్చ

నెట్ సెషన్ ముగిసిన తర్వాత గిల్ తన ప్యాడ్లు తీసివేసి.. మాజీ కెప్టెన్, భారత ప్రపంచకప్ గెలిచిన సారథి రోహిత్ శర్మ వద్దకు వెళ్లి చాలాసేపు మాట్లాడాడు. ఈ ఇద్దరూ ఆప్టస్ స్టేడియంలోని పిచ్ స్క్వేర్ వద్ద నిలబడి, సెంటర్ వైపు చూపిస్తూ ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లు, షాట్ల ఎంపిక గురించి చర్చించారు. ఇది రాబోయే సిరీస్ కోసం వ్యూహాత్మక ప్రణాళికగా భావించవచ్చు.

గత దశాబ్దాన్ని శాసించిన ఇద్దరు దిగ్గజాలతో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లోతుగా చర్చించడం అక్కడ ఉన్నవారికి ప్రత్యేకంగా అనిపించింది. ఆ తరువాత గిల్ తన మెంటార్ గౌతమ్ గంభీర్‌తో కూడా క్లుప్తంగా మాట్లాడాడు. అనంతరం రోహిత్, కోహ్లీలతో కలిసి మళ్లీ గ్రూప్‌లో చేరాడు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా ఈ ముగ్గురితో కలవడంతో... నలుగురూ నవ్వులు, సరదా కబుర్లతో గడిపారు.

రోహిత్ శర్మ సైలెంట్‌గా..

కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ టీమ్ లో అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ మాత్రం చాలా నిశ్శబ్దంగా తన సెషన్ పూర్తి చేశాడు. అతను ఫిట్‌నెస్ డ్రిల్స్, క్యాచ్ ప్రాక్టీస్‌తో పాటు త్రోడౌన్‌లను ఎదుర్కొన్నాడు. అంతకుముందు కెప్టెన్ పాత్రలో కేంద్ర బిందువుగా ఉన్న రోహిత్.. ఇప్పుడు గిల్ జట్టులో సీనియర్ బ్యాటర్ గా మారాడు.

మరోవైపు ఈ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్న కేఎల్ రాహుల్ నెట్స్‌కు వచ్చి స్పిన్, పేస్ బౌలింగ్‌ను శ్రద్ధగా ఎదుర్కొన్నాడు. మిడిలార్డర్ భారం మోయనున్న రాహుల్ బ్యాటింగ్ చాలా పదునుగా కనిపించింది.

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈ ఆదివారం ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. తదుపరి మ్యాచ్‌లు అక్టోబర్ 23, 25 తేదీల్లో జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More