Simple Wave : 243 కి.మీ రేంజ్​ ఇచ్చే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- 'వేవ్​' కొనొచ్చా? ఫస్ట్ డ్రైవ్​ రివ్యూ..

పర్ఫార్మెన్స్ స్కూటర్లతో ఆకట్టుకున్న 'సింపుల్ ఎనర్జీ' సంస్థ.. ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోకి 'సింపుల్ వేవ్'తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన రైడింగ్ రేంజ్, స్టైలిష్ డిజైన్‌తో వచ్చిన ఈ సింపుల్​ వేవ్​ ఎలక్ట్రిక్ స్కూటర్​ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూను ఇక్కడ చూసేయండి..

Published on: Sep 8, 2026, 16:30:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్​ కొనాలని భావించే సాధారణ వాహనదారుడు రోజువారీ అవసరాలకు కోరుకునేది చాలా సింపుల్: సులువైన కంట్రోల్స్, సరసమైన ధర, మంచి రేంజ్, సౌకర్యవంతమైన ప్రయాణం. ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ ఆధారిత స్కూటర్లపైనే దృష్టి పెట్టిన ‘సింపుల్ ఎనర్జీ’ సంస్థ.. ఇప్పుడు సామాన్య కుటుంబాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ‘సింపుల్ వేవ్’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మరి ఈ స్కూటర్ ఫ్యామిలీ కస్టమర్ల అంచనాలను అందుకుంటుందా? హెచ్​టీ ఆటో టీమ్ నిర్వహించిన టెస్ట్ డ్రైవ్​లో తెలిసిన ఆసక్తికర విషయాలు ఇవే..

సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..
సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ..

సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- డిజైన్ ఎలా ఉంది?

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్​కి అట్రాక్టివ్ డిజైన్‌తో ఉంది. పదునైన కట్స్‌తో కాకుండా, డాల్ఫిన్ నుంచి స్ఫూర్తి పొంది గుండ్రటి వంపులతో క్లాసిక్, మోడర్న్ లుక్‌ ఇచ్చారు.

ఇందులో అందించిన ప్రతి చిన్న డిజైన్ ఎలిమెంట్ చాలా తెలివిగా రూపొందించారు:

రియర్ వ్యూ మిర్రర్లు: స్కూటర్ లుక్‌కి తగ్గట్టుగా లోపలికి వంగిన డిజైన్‌తో ఉన్నాయి. అయితే, 5 అడుగుల 8 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు వెనుక వ్యూ సరిగ్గా కనిపించకపోవడం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది.

సువిశాల సీటు, బూట్ స్పేస్: వెనుక వైపు గ్రాబ్ రైల్‌ను కాస్త వెనక్కి నెట్టడం వల్ల ఏకంగా 920ఎంఎం పొడవైన సీటు లభించింది. ఇద్దరు వ్యక్తులు హాయిగా కూర్చోవచ్చు. సీటు కింద ఇచ్చే స్టోరేజ్ స్పేస్ పెద్దదిగా ఉంది, రాత్రి వేళల్లో ఉపయోగపడేలా లైటింగ్ సదుపాయం కూడా ఇచ్చారు. అయితే టైప్-ఏ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం కాస్త పాతకాలపు ఆలోచనలా అనిపిస్తుంది.

సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- రైడింగ్ ఎక్స్​పీరియెన్స్ ఎలా ఉంది?

కుటుంబ సమేతంగా ప్రయాణించే వారికి సస్పెన్షన్, సీటింగ్ సౌకర్యం చాలా ముఖ్యం. అందుకే ఈ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సస్పెన్షన్‌ను ఇండియన్ రోడ్లకు తగ్గట్టుగా సాఫ్ట్‌గా ట్యూన్ చేశారు. గుంతల రోడ్లపై కూడా ప్రయాణం చాలా స్మూత్‌గా సాగుతుంది. రైడింగ్ పొజిషన్, హ్యాండిల్‌బార్ అమరిక చాలా సహజంగా ఉంటాయి.

అయితే, సీట్ కుషన్ బాగానే ఉన్నప్పటికీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రైడర్ కాస్త ముందు వైపునకు జారినట్లు అనిపిస్తుంది. కానీ మూలల్లో స్కూటర్ చాలా స్థిరంగా, భయం లేకుండా తిరుగుతుంది.

సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?

ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 6.4 kW PMSM మోటార్‌తో పనిచేస్తుంది. టాప్ వేరియంట్ అయిన వేవ్ ప్లస్ కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు.

ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి:

స్పోర్ట్ మోడ్: వేగవంతమైన పికప్ ఇస్తుంది.

ఈకో ఎక్స్ మోడ్: స్పీడ్ తగ్గించి ఎక్కువ రేంజ్ ఇస్తుంది.

రైడ్ మోడ్: రోజువారీ వాడకానికి, రేంజ్, స్పీడ్ సమతుల్యతకు ఇది బెస్ట్ ఆప్షన్.

ఘాట్ రోడ్లు లేదా ఎత్తుపల్లాల ప్రయాణంలో ఈ-స్కూటర్ ఎక్కడా వెనకడగు వేయదు. ఇందులో బెల్ట్ డ్రైవ్ కాకుండా చైన్ డ్రైవ్‌ను ఉపయోగించారు. ‘హష్ డ్రైవ్’ టెక్నాలజీ వల్ల టాప్ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు కూడా చైన్ శబ్దం రాకపోవడం విశేషం.

సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- రేంజ్ విశేషాలేంటి?

వేవ్+ (5 kWh బ్యాటరీ): సింగిల్ ఛార్జ్‌పై 243 కి.మీల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

వేవ్ (3.7 kWh బ్యాటరీ): 171 కి.మీ రేంజ్ ఇస్తుంది.

వేవ్ ఎస్ (2.2 kWh / 2.7 kWh బ్యాటరీ): రూ. 132 కి.మీల వరకు రేంజ్ ఆఫర్ చేస్తుంది.

సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- బ్రేకింగ్ సెటప్ ఎలా ఉంది?

బ్రేకింగ్ పరంగా కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) బాగానే పనిచేస్తున్నప్పటికీ, కుడి వైపున ఉండే ఫ్రంట్ బ్రేక్ లివర్ అంచనా వేసినంత కాన్ఫిడెన్స్ ఇవ్వదు. బ్రేకింగ్ ఫీల్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. ఇక రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆన్ అయినప్పుడు, ఆఫ్ అయినప్పుడు ఒక రకమైన విచిత్రమైన శబ్దం రావడం కొద్దిసేపటి తర్వాత చిరాకు కలిగిస్తుంది.

సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్- నెగిటివ్ అదేనా?

ఇందులోని 7 ఇంచుల ప్రకాశవంతమైన టీఎఫ్​టీ డిస్‌ప్లే మెనూను నావిగేట్ చేయడం చాలా సులభం. నావిగేషన్, మ్యూజిక్, కాల్ కంట్రోల్స్, ఓటీఏ అప్‌డేట్స్, రివర్స్ మోడ్, హోల్డ్ అసిస్ట్ వంటి బోలెడు ఆధునిక ఫీచర్లను అందించారు.

కానీ, రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు వెచ్చించేటప్పుడు డాష్‌బోర్డ్ చుట్టూ వాడిన ప్లాస్టిక్ క్వాలిటీ చాలా చౌకబారుగా అనిపిస్తుంది! ఇది కస్టమర్లను నిరాశపరిచే అంశం. అలాగే ఫ్యామిలీ స్కూటర్‌కు సెంటర్ స్టాండ్ ఇవ్వకపోవడం మరొక లోపం.

సింపుల్​ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- కొనొచ్చా? వద్దా?

సింపుల్ ఎనర్జీ చేసిన ఈ తొలి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. డిజైన్, సీటింగ్, స్టోరేజ్, రైడింగ్ మోడ్‌లు దీనికి ప్లస్ పాయింట్లు. అయితే ఫ్రంట్ బ్రేక్స్ పనితీరు, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, రీజెన్ నాయిస్ వంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దితే ఇది మార్కెట్లో బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్‌గా నిలుస్తుంది. హెచ్​టీ ఆటో టీమ్ ప్రకారం.. ప్రస్తుతానికైతే ఈ సింపుల్​ వేవ్​కి ఇంకాస్త ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More