Kia CNG cars : కియా నుంచి బిగ్ అప్‌డేట్- రెండు ఫ్యామిలీ ఎంపీవీల్లో సీఎన్జీ వేరియంట్లు.. లాంచ్ త్వరలోనే!
భారత మార్కెట్లోకి ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వాహనాలను తెచ్చేందుకు కియా సిద్ధమైంది. కారెన్స్, కారెన్స్ క్లావిస్ ఎంపీవీల్లో 1.5 లీటర్ ఇంజిన్, 60 లీటర్ల సీఎన్జీ ట్యాంక్ ఆప్షన్లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆ వివరాలు..
సోరెంటో ఎస్‌యూవీ ఆవిష్కరణ వేదికగా కుటుంబ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన కారెన్స్, కారెన్స్ క్లావిస్ ఎంపీవీల్లో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వేరియంట్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయంతో భారత సీఎన్జీ విభాగంలోకి కియా తొలిసారిగా అడుగుపెడుతోంది.
ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ టెక్నాలజీతో లభించే భద్రత..
ఇంతకుముందు కొన్ని ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే సీఎన్జీ కిట్లను అమర్చేవారు. అయితే ఆఫ్టర్ మార్కెట్ లేదా డీలర్ స్థాయి ఫిట్టింగ్‌లతో పోలిస్తే, కంపెనీలోనే తయారుచేసే ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వ్యవహార శైలి ముమ్మాటికీ నమ్మకమైనది. ఇంధన పైప్‌లైన్లు, సిస్టమ్ కాలిబ్రేషన్, సేఫ్టీ కంట్రోల్స్ అన్నీ ప్లాంట్ ఉత్పత్తి దశలోనే జరుగుతాయి కాబట్టి భద్రతకు ఏమాత్రం ఢోకా ఉండదు.
కియా కారెన్స్, కారెన్స్ క్లావిస్ ఎంపీవీల్లో 60 లీటర్ల సామర్థ్యం ఉన్న సీఎన్జీ ట్యాంక్‌ను బూట్ స్పేస్‌లో అమర్చారు. ఎంపీవీ కార్లను ఎక్కువగా కుటుంబ సమేతంగా ప్రయాణించేందుకు ఉపయోగిస్తారు కాబట్టి, డ్రైవింగ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఇందులో భాగంగా స్పెర్ వీల్‌ను కారు కింద భాగంలో అమర్చడం విశేషం. దీనివల్ల లగేజీ స్థలానికి పెద్దగా ఇబ్బంది కలగదు.
ఇంజిన్ సామర్థ్యం, పవర్ అవుట్‌పుట్..
ఈ రెండు కొత్త వేరియంట్లలోనూ 1.5 లీటర్, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారు. సీఎన్జీ మోడ్‌లో నడుస్తున్నప్పుడు ఈ ఇంజిన్ 93 హెచ్‌పీ పవర్, 123 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే ఇది 22 హెచ్‌పీ పవర్, 21 ఎన్ఎమ్ టార్క్ తక్కువ. సీఎన్జీ కంబషన్ ప్రక్రియ.. పెట్రోల్‌తో పోలిస్తే భిన్నంగా ఉండటం వల్ల సాధారణంగానే పవర్ అవుట్‌పుట్‌లో కొంత తగ్గుదల కనిపిస్తుంది.
ప్రస్తుతానికైతే ఈ కియా కారెన్స్ సీఎన్జీ, కారెన్స్ క్లావిస్ సీఎన్జీకి సంబంధించిన అధికారిక మైలేజ్ గణాంకాలను సంస్థ వెల్లడించలేదు. అయితే రోజువారీ ప్రయాణాల్లో పర్ఫార్మెన్స్ తగ్గకుండా ఇంజిన్‌ను సరికొత్తగా ట్యూన్ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ సీఎన్జీ మోడళ్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అదనపు బరువుకు తగ్గట్టుగా ఛాసిస్‌లో మార్పులు..
సీఎన్జీ ట్యాంక్ వల్ల ఎంపీవీల వెనుక భాగంలో బరువు పెరుగుతుంది. ప్రయాణంలో స్థిరత్వం, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ దెబ్బతినకుండా ఉండేందుకు కియా ఇంజనీర్లు సస్పెన్షన్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా రీ-ట్యూన్ చేశారు. దానితోపాటు ముందు చక్రాలకు అప్‌గ్రేడెడ్ డిస్క్ బ్రేకులను అమర్చారు. దీనివల్ల కారు ఎంత బరువుతో ఉన్నా సురక్షితంగా ప్రయాణించవచ్చు.
ధర, లాంచ్ అప్డేట్స్..
ప్రస్తుతం కియా కారెన్స్ క్లావిస్ ప్రారంభ ధర రూ. 11.27 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వర్షన్లలో ఇప్పటికే లభిస్తున్న ఈ మోడల్లోకి సీఎన్జీ రాకతో వినియోగదారులకు మైలేజ్ పరంగా మరింత ఆదా కానుంది. ధరలు, వేరియంట్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
2026 దీపావళి పండగ సీజన్ నాటికి ఈ కొత్త సీఎన్జీ మోడళ్లు భారత రహదారులపై పరుగులు తీసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను సంస్థ వెల్లడించాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


