కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీలో కొత్త వేరియంట్- తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు..
కియా ఇండియా తన పాపులర్ ఎంపీవీ 'కారెన్స్ క్లావిస్'లో కొత్త హెచ్‌టీఈ (ఈఎక్స్) వేరియంట్‌ను పరిచయం చేసింది. సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ ఎంపీవీ ఫ్యామిలీస్ కోసం బెస్ట్ ఛాయిస్‌గా మారింది.
భారత ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కియా ఇండియా.. తాజాగా తన కారెన్స్ క్లావిస్ ఎంపీవీ (ఐసీఈ) లైనప్‌లో సరికొత్త 'హెచ్‌టీఈ (ఈఎక్స్)' వేరియంట్‌ను విడుదల చేసింది. వినియోగదారుల అవసరాలను, మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త ట్రిమ్.. సరసమైన ధరలోనే అత్యాధునిక ఫీచర్లను అందిస్తోంది.

కియా కారెన్స్ క్లావిస్ కొత్త వేరియంట్- ధరలు..
కొత్తగా వచ్చిన హెచ్‌టీఈ (ఈఎక్స్) వేరియంట్ ధరలను పరిశీలిస్తే, జీ1.5 పెట్రోల్ మోడల్ రూ. 12,54,900 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం జీ1.5 టర్బో-పెట్రోల్ వేరియంట్‌ను రూ. 13,41,900కు, డీ1.5 డీజిల్ వేరియంట్‌ను రూ. 14,52,900కు కియా అందుబాటులోకి తెచ్చింది.
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫ్యామిలీ ఎంపీవీని కోరుకునే వారికి ఈ వేరియంట్ ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పవచ్చు.
కస్టమర్ల కోరిక మేరకు కొత్త మార్పులు..
వినియోగదారుల ఫీడ్‌బ్యాక్, మారుతున్న మార్కెట్ అభిరుచులకు అనుగుణంగా కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీలో కొత్త వేరియంట్‌ను సంస్థ తీసుకొచ్చింది. కేవలం 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభించే ఈ హెచ్‌టీఈ (ఈఎక్స్), అన్ని రకాల ఇంజిన్ ఆప్షన్లలోనూ (పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్) అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా, కారెన్స్ క్లావిస్ జీ1.5 పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లో 'సన్‌రూఫ్' ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.
"మా కస్టమర్లు ఏమనుకుంటున్నారు, వారు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని నిశితంగా గమనించిన తర్వాతే ఈ కారెన్స్ క్లావిస్ హెచ్‌టీఈ (ఈఎక్స్)ని తీసుకొచ్చాము. కస్టమర్లు ఎప్పటి నుంచో అడుగుతున్న స్కైలైట్ సన్‌రూఫ్ ఫీచర్‌ను మొదటిసారిగా జీ1.5 పవర్‌ట్రెయిన్‌లో ప్రవేశపెట్టాం. ఈ కొత్త ఫీచర్లు కుటుంబంతో ప్రయాణించే వారికి మరింత సౌకర్యాన్ని ఇస్తాయి. కస్టమర్ల అభీష్టానికి ప్రాధాన్యతనిస్తూ భారత మార్కెట్‌లో కియాను మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం," అని కియా ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కియా కారెన్స్ క్లావిస్ హెచ్‌టీఈ (ఈఎక్స్)- ప్రీమియం ఫీచర్ల సందడి..
ప్రస్తుతం ఉన్న కియా కారెన్స్ క్లావిస్ హెచ్‌టీఈ (ఓ) వేరియంట్ పైన ఈ కొత్త హెచ్‌టీఈ (ఈఎక్స్) ఉంటుంది. కేవలం ధరకే పరిమితం కాకుండా, కారు లోపల లగ్జరీ అనుభూతిని ఇచ్చేలా పలు ఫీచర్లను ఇందులో చేర్చారు:
స్కైలైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్: ఇది కారు లోపల విశాలమైన అనుభూతిని ఇస్తుంది.
ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్: వాతావరణానికి అనుగుణంగా ఏసీని సెట్ చేస్తుంది.
ఎల్ఈడీ డిజైన్: వెలుపల ఎల్ఈడీ డీఆర్ఎల్స్, లోపల ఎల్ఈడీ క్యాబిన్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.
సౌకర్యం: డ్రైవర్ వైపు ఆటో అప్/డౌన్ పవర్ విండో వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి.
డిజైన్, టెక్నాలజీ, ప్రాక్టికాలిటీని కలగలిపి కస్టమర్ల ఆశయాలకు అనుగుణంగా కారెన్స్ క్లావిస్ లైనప్‌ను కియా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది. తాజా వేరియంట్ లాంచ్‌తో ఎంపీవీ విభాగంలో కియా తన పట్టును మరింత పెంచుకోనుంది.

E-Paper












