400 కి.మీ రేంజ్‌తో ఎలక్ట్రిక్ ఎంపీవీ- లగ్జరీకి కేరాఫ్ అడ్రెస్ ఈ హ్యుందాయ్ స్టారియా..
హ్యుందాయ్ మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వెహికల్ 'స్టారియా'ఎంపీవీని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించింది. అదిరిపోయే డిజైన్, అడుగడుగునా లగ్జరీ ఫీల్‌ని తీసుకొచ్చే ఇంటీరియర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ దీని ప్రత్యేకతలు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ ఈవీ పోర్ట్‌ఫోలియోని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. తాజాగా 2026 బ్రస్సెల్స్ మోటార్ షోలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన ప్రతిష్టాత్మక 'స్టారియా ఎలక్ట్రిక్' లగ్జరీ ఎంపీవీని ప్రపంచానికి పరిచయం చేసింది. పర్యావరణ హితంతో పాటు ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ వాహనాన్ని రూపొందించారు. 2026 ప్రథమార్ధంలో కొరియా, ఐరోపా మార్కెట్లలో ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్ స్టారియా ఎలక్ట్రిక్ ఎంపీవీ- డిజైన్:
స్టారియా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను హ్యుందాయ్ 'ఇన్‌సైడ్ అవుట్' ఫిలాసఫీతో డిజైన్ చేసింది. అంటే లోపల ప్రయాణికులకు ఉండే సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ బయటి రూపురేఖలను తీర్చిదిద్దింది. దీని ఏరోడైనమిక్ బాడీ, ముందు భాగంలో ఉండే హారిజంటల్ లైట్ స్ట్రిప్ దీనికి ఒక ఆధునిక లుక్‌ను ఇస్తున్నాయి. పెద్ద పెద్ద గ్లాస్ విండోల వల్ల లోపల కూర్చున్న వారికి బయటి ప్రపంచం స్పష్టంగా కనిపిస్తుంది. విశాలమైన స్లైడింగ్ డోర్లు, పెద్ద రేర్ హ్యాచ్ డోర్ వల్ల సామాన్లు సర్దుకోవడం లేదా ప్రయాణికులు ఎక్కడం ఎంతో సులభమవుతుంది.
హ్యుందాయ్ స్టారియా ఎలక్ట్రిక్ ఎంపీవీ- ఫీచర్లు: విలాసానికి కేరాఫ్ అడ్రెస్!
ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ లోపలి భాగం ఒక లగ్జరీ హోటల్ రూమ్‌ను తలపిస్తుంది! రెండు 12.3 ఇంచ్ డిస్ప్లేలతో కూడిన డాష్‌బోర్డ్ కారుకు టెక్నాలజీ టచ్ ఇస్తుంది. ఇందులో ఓటీఏ అప్‌డేట్స్ కలిగిన నెక్ట్స్ జనరేషన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.
ప్రస్తుతానికి ఈ ఎంపీవీ రెండు రకాల సీటింగ్ ఆప్షన్లలో రానుంది:
7-సీటర్ లగ్జరీ: కాలు చాపుకుని కూర్చునేంత విశాలమైన సీట్లు, 435 లీటర్ల బూట్ స్పేస్.
9-సీటర్ వ్యాగన్: పెద్ద కుటుంబాలకు లేదా షటిల్ సర్వీసులకు అనుకూలం. సీట్లను మడతపెడితే ఏకంగా 1,303 లీటర్ల వరకు కార్గో సామర్థ్యం లభిస్తుంది.
హ్యుందాయ్ స్టారియా ఎలక్ట్రిక్- బ్యాటరీ, పర్ఫార్మెన్స్..
హ్యుందాయ్ స్టారియా ఎలక్ట్రిక్‌లో 84 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 160 కేడబ్ల్యూ (సుమారు 215 బీహెచ్పీ) పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ హ్యుందాయ్ స్టారియా ఎలక్ట్రిక్‌లో 400 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్టీపీ ప్రమాణాల ప్రకారం) వరకు ప్రయాణించవచ్చు.
ఇక ఛార్జింగ్ విషయానికొస్తే, ఇందులో 800-వోల్ట్ ఆర్కిటెక్చర్ ఉంది. దీనివల్ల అల్ట్రా ఫాస్ట్ డీసీ ఛార్జర్ వాడితే కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీ 10 నుంచి 80 శాతానికి చేరుకుంటుంది. ఇంట్లో ఛార్జ్ చేసుకోవడానికి 11 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ సదుపాయం కూడా ఉంది.
హ్యుందాయ్ స్టారియా ఎలక్ట్రిక్ ఎంపీవీ- ఇండియా లాంచ్ ఎప్పుడు?
2025 ఆటో ఎక్స్పో వేదికగా స్టారియా ఐసీఈ వర్షెన్‌ని భారతీయులకు పరిచయం చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. కానీ ఈ ఎంపీవీ ఎలక్ట్రిక్ వర్షెన్ ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా? అనే విషయంపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఇండియాలో ఈ సెగ్మెంట్‌కి మార్కెట్ పెరుగుతున్న తరుణంలో ఈ మోడల్ మన దేశంలో కూడా అడుగుపెట్టే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తం మీద చూసుకుంటే.. ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్‌లో స్టారియా ఎలక్ట్రిక్ ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేయబోతోందని చెప్పడంలో సందేహం లేదు.














