Sonam Raghuvanshi : హనీమూన్ ట్రిప్‌లో భర్త దారుణ హత్య- సోనమ్ బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ!
Meghalaya honeymoon murder case : హనీమూన్ ట్రిప్‌లో భర్తను దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్‌ను రద్దు చేసి, ఆమెను తిరిగి జైలుకు పంపేందుకు సుప్రీంకోర్టు ప్రస్తుతానికి నిరాకరించింది. ఇందుకు కారణాలను వివరిస్తూ, కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఆమె అప్పటికే జైలు నుంచి విడుదలైనందున, ప్రస్తుతానికి ఆ బెయిల్ ఆర్డర్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.

కేసు నేపథ్యం: హనీమూన్ పేరిట ఘోరం..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 29ఏళ్ల వ్యాపారవేత్త రాజా రఘువంశీకి, సోనమ్‌కు మే 2025లో వివాహం జరిగింది. అనంతరం హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయకు వెళ్లారు. మే 23న నోంగ్రియట్లోని ఒక హోమ్‌స్టే నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత ఈ దంపతులు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత సోహ్రాలోని ప్రసిద్ధ 'వైసావ్‌డాంగ్ జలపాతం' సమీపంలో ఉన్న ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. భర్తను చంపేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన సోనమ్‌ను మేఘాలయ పోలీసులు కొన్ని రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు.
సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ముందే ప్లాన్ వేసి, మరో ముగ్గురు సహచరుల సహాయంతో భర్తపై దాడి చేసి, హత్య చేయించిందని పోలీసులు దాదాపు 700 పేజీల ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
టైపోగ్రాఫికల్ తప్పిదమే వరమైందా?
శుక్రవారం జరిగిన విచారణలో మేఘాలయ ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఇది అత్యంత ఘోరమైన, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని కోర్టుకు వివరించారు. పోలీసుల అరెస్ట్ పత్రాల్లో జరిగిన ఒక చిన్న టైపోగ్రాఫికల్ (అక్షర దోషం) పొరపాటు ఆధారంగా హైకోర్టు నిందితురాలికి బెయిల్ ఇచ్చిందని ఆయన అన్నారు. భారతీయ న్యాయ సంహిత లో హత్యకు సంబంధించిన సెక్షన్ 103కి బదులుగా, పొరపాటున సెక్షన్ 403 అని టైప్ చేశారని.. కేవలం ఈ సాంకేతిక లోపం వల్లే ఆమెకు బెయిల్ లభించిందని తెలిపారు. అంతకుముందు మూడుసార్లు ఆమె బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయని మెహతా గుర్తుచేశారు.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు..
ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. "ప్రాథమికంగా హైకోర్టు ఈ కేసును డీల్ చేసిన విధానంపై మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అయితే, ఒక నిందితురాలు బెయిల్‌పై విడుదలైన తర్వాత, మళ్లీ వెనక్కి జైలుకు పంపే విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. నేరం ఎంత తీవ్రమైనదైనా, చట్టం ముందు నేరం నిరూపితమయ్యే వరకు నిందితులను అమాయకులుగానే భావించాల్సి ఉంటుంది," అని బెంచ్ వ్యాఖ్యానించింది.
పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం..
అంతకుముందు జూన్ 29న మేఘాలయ హైకోర్టు జస్టిస్ డబ్ల్యూ. డింగ్డో.. సోనమ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. పోలీసులు అరెస్ట్ కారణాలను నిందితురాలికి సరిగ్గా వివరించలేదని, చట్టపరమైన సెక్షన్లను తప్పుగా నమోదు చేయడమే కాకుండా.. అమెడ్ ఫోర్సెస్ (సాయుధ బలగాల) నుంచి పారిపోయిన వ్యక్తిగా సోనమ్‌పై అసంబద్ధమైన ఆరోపణలు పత్రాల్లో చేర్చారని హైకోర్టు తప్పుపట్టింది. ఇది పోలీసుల ‘అనాలోచిత తీరుకు’ నిదర్శనమని పేర్కొంటూ బెయిల్ ఇచ్చింది.
ప్రస్తుతం సోనమ్ రఘువంశీ షిల్లాంగ్‌లో ఉన్నట్లు ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై 9కి వాయిదా వేసింది. సోనమ్ తన సమాధానాన్ని దాఖలు చేసిన తర్వాత, ఈ కేసు విచారణను వేగవంతం చేసేలా తగిన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


