...
...
Next Story

Sonam Wangchuk : షాకింగ్! నిరాహార దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్​చుక్​పై దాడికి యత్నం!

Sonam Wangchuk attacked : దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు దాడికి యత్నించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు చేశారు.

Published on: Jul 18, 2026, 05:58:29 IST
Advertisement

దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌పై దాడికి ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నిరసనను అణచివేయడానికి కొందరు దుండగులు వాంగ్‌చుక్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే.. శుక్రవారం అర్థరాత్రి సంచలన ఆరోపణ చేశారు.

నిరాహార దీక్షలో సోనమ్ వాంగ్​చుక్.. (PTI)
నిరాహార దీక్షలో సోనమ్ వాంగ్​చుక్.. (PTI)

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో ఒక పోస్ట్ పెట్టారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన జరుగుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాంగ్‌చుక్‌పైకి ఒక వస్తువును బలంగా విసిరారని దిప్కే పేర్కొన్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి సోనమ్ వాంగ్‌చుక్ ఎలాంటి గాయాలు కాకుండా తృటిలో సురక్షితంగా తప్పించుకున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు స్పష్టం చేశారు.

ముందే సమాచారం ఇచ్చిన 'పోలీస్ ఇన్సైడర్'!

సోనమ్ వాంగ్​చుక్​పై దాడి యత్నం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని అభిజీత్ దిప్కే ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ శాంతియుత ఆందోళనను చెదరగొట్టడానికి, ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించడానికి కొందరు వ్యక్తులను పంపుతున్నారనే ముందస్తు సమాచారం తనకు అందిందని ఆయన వెల్లడించారు.

"ఈ నిరసనను భగ్నం చేయడానికి కొందరిని పంపుతున్నట్లు పోలీసు శాఖలోని ఒక అధికారి నాకు ముందే సమాచారం ఇచ్చారు," అని దిప్కే తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొనడం గమనార్హం.

నీట్ పరీక్షల వివాదంపై కేంద్ర తీరును నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జూన్ 28 నుంచి సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటికే ఆ దీక్ష సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని సీజేపీ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. ఆయన బరువు వేగంగా తగ్గడంతో పాటు బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు కూడా ఆందోళనకరంగా పడిపోయాయని వైద్యులు తెలిపారు.

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే పలువురు ప్రతిపక్ష రాజకీయ నేతలు జంతర్ మంతర్ వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఆయనను దీక్ష విరమించాలని కోరినప్పటికీ, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేదే లేదని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.

కాగా, ఈ ఆందోళనను మరింత ఉధృతం చేయడంలో భాగంగా జులై 20వ తేదీన పార్లమెంటు వైపు శాంతియుత ప్రదర్శన నిర్వహించనున్నట్లు సీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు దిల్లీకి తరలివెళుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks