సీజేపీ ఆశలు వదులుకుంది, ఆందోళన విరమించాలనుకుంది: సోనమ్ వాంగ్‌చుక్

జూలై 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోలీసులు జరిపిన లాఠీచార్జ్ తర్వాత సీజేపీ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారని, ఆందోళనను విరమించుకోవాలని భావించారని సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ వెల్లడించారు. యువత మళ్లీ తరలిరావడంతోనే ఉద్యమం కొనసాగిందన్నారు.

Published on: Aug 31, 2026, 14:51:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 20న పోలీసులు జరిపిన లాఠీచార్జ్, నిర్బంధాల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నాయకత్వం తీవ్రంగా నిరాశ చెందిందని, ఇక ఉద్యమానికి ఆశలు లేవని భావించి ఆందోళన విరమించేందుకు సిద్ధపడిందని సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన విషయాలు వెల్లడించారు. 'పీజీఎక్స్' పాడ్‌కాస్ట్‌లో నిరూపమ్ గుప్తాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆనాటి పరిణామాలను వివరంగా పంచుకున్నారు.

జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలో ఉద్రిక్తత
జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలో ఉద్రిక్తత

"ఇక ఆశలు లేవు.. ఇళ్లకు వెళ్ళిపోదాం"

జూలై 20న పోలీసుల చర్యతో వేదిక ధ్వంసమై, జనం ఒక్కసారిగా చెల్లాచెదరవడంతో సీజేపీ నేతలు తీవ్రమైన మానసిక నైరాశ్యంలోకి జారుకున్నారని వాంగ్‌చుక్ తెలిపారు. "అందరూ వెళ్లిపోయారు, మన వేదిక కూడా కూలిపోయింది, ఇక ఎలాంటి ఆశా లేదు" అని పార్టీ నాయకత్వం తనతో చెప్పినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. నిరసనకారులు అప్పటికి అలసిపోయారని, కాసేపు విశ్రాంతి తీసుకుని ఇళ్లకు వెళ్లాలని, రేపటి సంగతి తర్వాత చూద్దామని సూచిస్తూ ఒక ప్రకటన సిద్ధం చేయమని నాడు తనను కోరారని ఆయన వివరించారు. వారు కోరినట్లే తాను ఆ వార్తను రాసిచ్చినప్పటికీ, దాన్ని బయటకు విడుదల చేయలేదని వెల్లడించారు.

ఉద్యమానికి ఊపిరి ఊదిన యువత

ఆ రోజు రాత్రికి లక్షలాది మంది వెనుదిరగడంతో ఉద్యమం ముగిసిపోయిందనే నాయకులు భావించారని వాంగ్‌చుక్ తెలిపారు. "మళ్లీ ఎప్పుడైనా ప్రారంభమైతే అవుతుంది, లేకపోతే లేదు" అనే పరిస్థితి నెలకొందన్నారు. అయితే, తర్వాతి రోజే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోలీసులు లాఠీచార్జ్ చేసినా వెరవకుండా మరుసటి రోజు ఉదయాన్నే యువత పెద్ద సంఖ్యలో జంతర్ మంతర్‌కు చేరుకోవడం సీజేపీ నాయకత్వంలో కొత్త ఆశలను చిగురింపజేసిందని చెప్పారు.

"ఆ యువత నిజంగా అద్భుతం చేశారు. దెబ్బలు తిన్నా, భయపడకుండా తిరిగి వచ్చి ఉద్యమానికి ఊపిరి ఊదారు" అని వాంగ్‌చుక్ ప్రశంసించారు. జనం రాకను బట్టే నేతల మనోధైర్యం మారుతుంటుందని, జనం లేక పడిపోయిన నేతల ధైర్యాన్ని యువతే మళ్లీ పెంచారని ఆయన కొనియాడారు.

ప్రభుత్వంతో చర్చలు.. కాంగ్రెస్ స్పందన

కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ప్రారంభం కావడానికి ముందు సీజేపీ ఆందోళనను ఎలా ముగించాలా అని రకరకాల మార్గాలను అన్వేషించిందని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. ముందుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి, పార్లమెంట్‌లో తనచేత నిరాహార దీక్ష విరమింపజేయాలని యోచించినట్లు తెలిపారు. అయితే, రాహుల్ బృందం నుంచి సానుకూల స్పందన రాలేదని చెప్పారు.

ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు రంగంలోకి దిగారు. జూలై 21 రాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆసుపత్రిలో ఉన్న వాంగ్‌చుక్‌ను కలసి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా, బాధితులకు పరిహారం, దీక్ష చేసిన విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా రక్షణ వంటి కీలక షరతులను ఆయన ప్రభుత్వం ముందుంచారు.

పరిమిత విజయం లభించింది

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జంతర్ మంతర్‌కు మళ్లీ భారీగా జనం వస్తున్నారనే విషయం తనకు తెలియదని వాంగ్‌చుక్ తెలిపారు. పట్టువదలకుండా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ కోరిన డిమాండ్‌కు తాను మద్దతు తెలిపానని చెప్పారు. రాజీనామా వల్ల విద్యా వ్యవస్థలో వెంటనే పెద్ద మార్పు రాకపోయినా, ప్రభుత్వ జవాబుదారీతనానికి అది ఒక నిదర్శనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోరాటం వల్ల ప్రభుత్వం దిగివచ్చి జవాబుదారీతనానికి అంగీకరించిందని, అయితే విద్యావ్యవస్థలో రావాల్సిన పూర్తిస్థాయి సంస్కరణల పరంగా ఇది ఒక పరిమిత విజయమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More