ఇది ప్రజాస్వామ్య విజయం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్ హర్షం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. వీధుల నుంచి ప్రజలు నేరుగా సాధించుకున్న ఈ విజయం శాంతియుత పోరాటానికి నిదర్శనమని, భయాన్ని వీడి పోరాడిన దేశ యువతకు ఆయన అభినందనలు తెలిపారు.
నీట్-యూజీ (NEET-UG) పరీక్షల లీకేజీ వివాదంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేస్తూ, దీనిని "ప్రజాస్వామ్య విజయం"గా అభివర్ణించారు. ప్రజల శాంతి, సహనం, నిరంతర శ్రమకు దక్కిన ఫలితమిదని కొనియాడారు.

సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో సోనమ్ వాంగ్‌చుక్ స్పందిస్తూ.. "ఇది ప్రజాస్వామ్య విజయం.. వీధుల నుంచి నేరుగా సాధించిన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇది శాంతి, సహనానికి దక్కిన విజయం. భయాన్ని వీడి దేశం నలుమూలల నుంచి గళం విప్పిన సిజెపి (CJP), జెన్ జెడ్ (Gen Z) యువతకు, పౌరులందరికీ అభినందనలు. జవాబుదారీతనం సాధించాం, ఇక విద్యా వ్యవస్థలో సంస్కరణల వైపు అడుగులు వేయాలి" అని పేర్కొన్నారు.
జంతర్ మంతర్ వద్ద మిన్నంటిన సంబరాలు
పరీక్షల అక్రమాలపై వారాల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఆందోళనల నడుమ ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోకుండా ఉండేందుకే తాను తప్పుకుంటున్నట్లు ప్రధాని మోదీకి పంపిన లేఖలో ప్రధాన్ స్పష్టం చేశారు.
ఈ వార్త తెలియగానే జంతర్ మంతర్ నిరసన వేదిక వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఫోన్ ద్వారా రాజీనామా సమాచారం అందుకున్న CJP అధినేత అభిజీత్ దీప్కే నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. "మనం అనుకున్నది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దేశం రాజ్యాంగబద్ధంగా నడుస్తోందనడానికి ఇది పెద్ద నిదర్శనం. అయితే ఈ పోరాటంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని స్పష్టం చేశారు.
సీజేఐ సూర్య కాంత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
నిరసన వేదిక నుంచి CJP అధినేత అభిజీత్ దిప్కే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మమ్మల్ని బొద్దింకలు అని పిలిచినందుకు సీజేఐ సూర్య కాంత్‌కు ధన్యవాదాలు. ఆయన ఆ మాట అనకపోయి ఉంటే నేను భారత్‌కు వచ్చేవాడిని కాదు, ఈ ఉద్యమం కూడా ప్రారంభమయ్యేది కాదు" అని దిప్కే పేర్కొన్నారు.
మే 15న సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ హోదాకు సంబంధించిన విచారణ సందర్భంగా, "ఉద్యోగాలు లేక, వృత్తిలో సరైన స్థానం సాధించలేక కొందరు యువకులు బొద్దింకల్లా తయారవుతున్నారు" అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నకిలీ లా డిగ్రీలు ఉన్నవారిని ఉద్దేశించే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, సాధారణ నిరుద్యోగ యువతను కాదని సీజేఐ స్పష్టత ఇచ్చినప్పటికీ, ఆ పదమే ప్రాతిపదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరుతో ఈ యువజన ఉద్యమం పురుడుపోసుకుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


