ప్రధాని మోదీ గురించి ఆత్మకథ ‘బిలాంగింగ్’లో సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తన సంబంధాలు, నెహ్రూపై మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆర్‌ఎస్ఎస్ ప్రభావం, ఢిల్లీ రాజకీయాధికార వర్గంపై అసంతృప్తిని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్’లో వెల్లడించారు. వ్యక్తిగత జీవితం, క్యాన్సర్‌పై పోరాటం నాటి విశేషాలను పంచుకున్నారు.

Published on: Nov 10, 2026, 10:27:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

దశాబ్దానికి పైగా దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఎదురెదురు నిలిచినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగతంగా అత్యంత పరిమితమైన సంబంధాలు మాత్రమే ఉన్నాయని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ వెల్లడించారు. మంగళవారం విపణిలోకి వస్తున్న తన 544 పేజీల ఆత్మకథ ‘బిలాంగింగ్’ (Belonging) లో ఆమె అనేక కీలక అంశాలను బహిర్గతం చేశారు.

మోదీ వైఖరి, ఆర్‌ఎస్ఎస్ ప్రభావం.. ఆత్మకథ ‘బిలాంగింగ్’లో సోనియా వ్యాఖ్యలు
మోదీ వైఖరి, ఆర్‌ఎస్ఎస్ ప్రభావం.. ఆత్మకథ ‘బిలాంగింగ్’లో సోనియా వ్యాఖ్యలు

కంటి చూపు కలపడానికీ ఇష్టపడరు

స్పీకర్ ఛాంబర్ వంటి అధికారిక, అర్ధ-అధికారిక వేదికలపై మాత్రమే తాము కలుసుకుంటామని సోనియా పేర్కొన్నారు. ఎదురెదురుగా వచ్చినప్పుడు కేవలం నమస్కారం మాత్రమే చేసుకుంటామని తెలిపారు. "గతంలో వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన రాజకీయ నాయకులు కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. కానీ ప్రస్తుత వాతావరణం దానికి పూర్తి భిన్నంగా ఉంది. మోదీ నేరుగా కంటి చూపు కలపడానికి కూడా ఇష్టపడరు" అని ఆమె రాసుకొచ్చారు.

సిద్ధాంత విభేదాలే తప్ప వ్యక్తిగతం కాదు

తమ ఇద్దరి భావజాలాలు, ప్రపంచాన్ని చూసే దృక్పథాలు పూర్తి వేర్వేరని 79 ఏళ్ల సోనియా గాంధీ స్పష్టం చేశారు. "ఆయన తన భావజాలానికి అనుగుణంగా భారతదేశాన్ని నిలబెట్టేందుకు పోరాడుతుంటే, నేను ఆధిపత్య పోకడలకు వ్యతిరేకంగా, లౌకికవాదం, సామాజిక న్యాయం, అందరినీ కలుపుపోయే భారతీయత కోసం పోరాడాను. ఇది సిద్ధాంతపరమైన పోరాటమే తప్ప వ్యక్తిగత వైరం కాదు" అని ఆమె వివరించారు.

ఢిల్లీ రాజకీయాధిపత్యంపై ఒకే విధమైన అసంతృప్తి

ఇరు పార్టీల సిద్ధాంతాలు వేరైనా, కొన్ని విషయాల్లో మోదీ దృక్పథంతో తనకు ఏకీభావం ఉందన్నారు. ఢిల్లీలోని రాజకీయాధికార వర్గాల వైఖరిపై మోదీకి ఉన్న అసంతృప్తిని తాను కూడా అర్థం చేసుకోగలిగానని తెలిపారు. "ఢిల్లీలోని డ్రాయింగ్ రూమ్‌లలో జరిగే రాజకీయ చర్చలు భారతీయ వాస్తవాలకు ఎంతో దూరంగా ఉన్నాయనిపించి, నేను కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డాను" అని ఆమె వెల్లడించారు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి, ఆర్‌ఎస్ఎస్ (RSS) ద్వారా స్వశక్తితో పైకొచ్చిన నాయకుడిగా మోదీ ప్రయాణాన్ని ఆమె గుర్తించారు.

నెహ్రూపై వ్యాఖ్యలు.. ఆర్‌ఎస్ఎస్ ప్రభావమే

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ చేసే తీవ్ర విమర్శలకు ఆయన ఆర్‌ఎస్ఎస్‌లో పొందిన శిక్షణ, సిద్ధాంత ప్రభావమే ప్రధాన కారణమని సోనియా విశ్లేషించారు.

వ్యక్తిగత జీవితం.. క్యాన్సర్‌పై సుదీర్ఘ పోరాటం

ఇటలీలో తన జన్మవృత్తాంతం, బ్రిటన్ జీవితం, రాజీవ్ గాంధీతో పరిచయం నుంచి భారత రాజకీయాల్లో అధికారాన్ని చేపట్టడం వరకు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఈ పుస్తకంలో వివరించారు. పెళ్లికి ముందే భారతదేశానికి వెళ్లేందుకు మొదట్లో నిరాకరించిన తన తండ్రిని రాజీవ్ ఎలా ఒప్పించారో వివరించారు. ఆ వివాహ వేడుకకు తన తండ్రి హాజరుకాకపోవడాన్ని కూడా ప్రస్తావించారు.

అత్తగా ఇందిరా గాంధీ చూపించిన ఆప్యాయత, తొలి సంతానాన్ని కోల్పోయిన నాటి తీవ్ర విషాదం, మిలాన్‌లో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ చేసిన సుదీర్ఘ పోరాటం వంటి అనేక ఆసక్తికర, వ్యక్తిగత ఘట్టాలను సోనియా గాంధీ ఈ ఆత్మకథలో పాఠకులతో పంచుకున్నారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More