దక్షిణాఫ్రికా వీధుల్లో విచక్షణారహితంగా కాల్పులు- 9 మంది మృతి!

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ సమీపంలో కాల్పుల మోత మోగింది. దుండగులు జరిపిన ఈ కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరుపేద ప్రాంతమైన బెక్కర్స్‌దాల్‌లో ఈ ఘోరం జరిగింది. ఈ నెలలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Published on: Dec 21, 2025, 11:08:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దక్షిణాఫ్రికాలో గన్ కల్చర్ మరోసారి పెను విషాదాన్ని సృష్టించింది. జోహన్నెస్‌బర్గ్ శివార్లలోని ఒక టౌన్‌షిప్‌లో గుర్తుతెలియని దుండగులు ఆదివారం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశంలో ఇలాంటి సామూహిక మారణకాండ జరగడం ఈ నెలలోనే ఇది రెండోసారి! ఫలితంగా స్థానికులు తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నారు.

దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్​లో కాల్పుల ఘటన.. (REUTERS)
దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్​లో కాల్పుల ఘటన.. (REUTERS)

దక్షిణాఫ్రికాలో కాల్పులు- వీధుల్లో వెళుతున్న వారిపై విచక్షణారహితంగా..

నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డ్ మైనింగ్ ఏరియా బెక్కర్స్‌దాల్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఈ ఘోరం జరిగింది. సుమారు పన్నెండు మంది దుండగులు రెండు వాహనాల్లో వచ్చి బార్‌లో ఉన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తెలుస్తుంది.

దక్షిణాఫ్రికా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పది అని పోలీసులు తొలుత వెల్లడించారు. ఆ తర్వాత ఆ సంఖ్యను తొమ్మిదికి మార్చారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో బార్ వెలుపల వేచి ఉన్న ఒక ఆన్‌లైన్ క్యాబ్ డ్రైవర్ కూడా ఉన్నట్లు ప్రావిన్షియల్ పోలీస్ కమిషనర్ మేజర్ జనరల్ ఫ్రెడ్ కెకానా తెలిపారు. కాల్పులు జరిపి పారిపోతున్న సమయంలోనూ దుండగులు రోడ్డుపై కనిపిస్తున్న వారిపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించారు.

ప్రస్తుతం పోలీసులు ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సుమారు 6.3 కోట్ల జనాభా ఉన్న దక్షిణాఫ్రికాలో నేరాలు, హత్యల రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది! నిత్యం జరుగుతున్న ఇలాంటి దాడులు సామాన్య ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పారిశ్రామిక దేశమైన దక్షిణాఫ్రికా ప్రస్తుతం నేరగాళ్ల గుప్పిట్లో చిక్కుకుందని ఈ ఘటనలు సూచిస్తున్నాయి. ముఠా తగాదాలు, అక్రమ వ్యాపారాల మధ్య పోటీ ఇక్కడి శాంతిభద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటు నమోదవుతున్న దేశాల్లో ఇదీ ఒకటి.

ఈ నెలలో రెండో ఘటన!

దక్షిణాఫ్రికా వీధులు నెత్తురోడటం ఈ నెలలో ఇది రెండోసారి! డిసెంబర్ 6న ప్రిటోరియా సమీపంలోని ఒక హాస్టల్‌పై జరిగిన దాడిలో మూడేళ్ల పసికందుతో పాటు 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ ఘటన కూడా అక్రమంగా మద్యం విక్రయించే చోటే జరగడం గమనార్హం.

భయంకరమైన గణాంకాలు..

పోలీసు గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దక్షిణాఫ్రికాలో ప్రతిరోజూ సగటున 63 మంది హత్యకు గురయ్యారు! చిన్న చిన్న గొడవలు, దొంగతనాలు, ముఠా హింసే ఈ చావులకు ప్రధాన కారణాలు.

గత సెప్టెంబర్ 2024లో ఈస్టర్న్ కేప్ ప్రావిన్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన 18 మందిని కాల్చి చంపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో చట్టవిరుద్ధమైన ఆయుధాలు చెలామణిలో ఉండటమే ఈ రక్తపాతానికి మూలకారణంగా మారుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More