ప్రముఖ డైరక్టర్​, ఆయన భార్య దారుణ హత్య- చంపింది కుమారుడే!

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాబ్ రైనర్, ఆయన భార్య దారుణ హత్యకు గురయ్యారు. లాస్​ ఏంజెల్స్​లోని వారి నివాసంలో మృతదేహాలు కనిపించాయి. ఈ కేసులో వారి కుమారుడు నిక్​ రైనర్​పై హత్యాయత్నం ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published on: Dec 15, 2025, 09:55:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హాలీవుడ్​ ప్రముఖ డైరక్టర్​ రాబ్ రైనర్, ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్ దారుణ హత్యకు గురయ్యారు. లాస్​ ఏంజిల్స్ బ్రెంట్​వుడ్​లోని నివాసంలో ఇద్దరు రక్తపుమడుగులో కనిపించారు. వారి శరీరాలపై అనేక కత్తిపోట్లు కనిపించాయి. సొంత కుమారుడు నిక్​ రైడర్​ వారిని చంపినట్టు అమెరికా వార్తా సంస్థలు సోర్స్​లను ఉటకిస్తూ కథనాలను ప్రచురిస్తున్నాయి.

హాలీవుడ్​ డైరక్టర్​ రాబ్​ రైనర్​ దారుణ హత్య! (AFP)
హాలీవుడ్​ డైరక్టర్​ రాబ్​ రైనర్​ దారుణ హత్య! (AFP)

ఈ బ్రెంట్‌వుడ్ ప్రాంతం నగర పశ్చిమ భాగంలో ఉంటుంది. హాలీవుడ్​కి చెందిన అనేక మంది ప్రముఖల లగ్జరీ నివాసాలు ఇక్కడ ఉంటాయి. కాగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) తర్వాత వైద్య సహాయం కోసం వచ్చిన కాల్‌కు స్పందించినట్లు లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇంటి లోపల 78 ఏళ్ల వ్యక్తి, 68 ఏళ్ల మహిళ మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

లాస్ ఏంజిల్స్ పోలీసు విభాగం కెప్టెన్ మైక్ బ్ల్యాండ్ మాట్లాడుతూ.. రైనర్ నివాసంలో జరిగిన ఈ ఘటనపై రాబరీ హోమిసైడ్​ డివిజన్​ డిటెక్టివ్‌లు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

ఎవరు ఈ నిక్ రైనర్?

నిక్ రైనర్.. రాబ్ రైనర్ కుమారుడు. 2010ల మధ్యలో వచ్చిన 'బీయింగ్ చార్లీ' అనే సెమీ-ఆటోబయోగ్రాఫికల్ చిత్రానికి సహ రచయితగా నిక్ అందరి దృష్టిని ఆకర్షించారు.

నిక్ తన మాదక ద్రవ్యాల బానిసత్వం, పునరావాస కేంద్రాల్లో అనుభవాల ఆధారంగా ఈ కథను రాశారు. ఈ చిత్రానికి ఆయన తండ్రి దర్శకత్వం వహించారు.

టీనేజ్ నుంచే మాదక ద్రవ్యాల వ్యసనంతో పోరాడుతున్న విషయాన్ని నిక్ రైనర్​ గతంలో పలుమార్లు బహిరంగంగా చెప్పారు.

2016లో 'పీపుల్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, నిక్ తన పదహారేళ్ల వయస్సులో ప్రారంభమైన మాదక ద్రవ్యాల వినియోగం గురించి వివరించారు. అది తనని చాలా ప్రభావితం చేసిందని, నిరాశ్రయుడిని చేసిందని చెప్పారు.

సుమారు 15 సంవత్సరాల వయస్సు నుంచి అనేకసార్లు పునరావాస కేంద్రాల్లో చేరినట్లు నిక్ చెప్పారు. అయితే ఆయన వ్యసనం తీవ్రమైనప్పుడు, కుటుంబం నుంచి పూర్తిగా దూరమై, వివిధ రాష్ట్రాల్లో రోడ్లపై ఎక్కువ కాలం గడిపినట్లు ఆయన అంగీకరించారు.

రాబ్​- మిచెల్​ రైడర్ల హంతకుడు నిక్​యేనా? ఒకవేళ మీడియా కథనాలే నిజమైతే తల్లిదండ్రులను అతను ఎందుకు హత్య చేశాడు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

రాబ్​ రైడర్​ ఎవరు?

రాబ్ రైనర్ ఒక ప్రసిద్ధ నటుడు, దర్శకుడు, సామాజిక కార్యకర్త! 'ఆల్ ఇన్ ది ఫ్యామిలీ' సిరీస్‌తో నటుడిగా, 'వెన్ హ్యారీ మెట్ శాలీ'తో దర్శకుడిగా హాలీవుడ్‌లో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. హాస్యనటుడు, రచయిత కార్ల్ రైనర్ కుమారుడు ఈ రాబ్​ రైనర్​.

1970లలో వచ్చిన సీబీఎస్​ సిట్‌కామ్ 'ఆల్ ఇన్ ది ఫ్యామిలీ' లో మైక్ మీట్‌హెడ్ స్టివిక్ పాత్రతో ఆయన ప్రసిద్ధి చెందారు.

రాబ్ రైనర్ నటుడిగా 'స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్' (1993), 'బుల్లెట్స్ ఓవర్ బ్రాడ్‌వే' (1994), 'ఎడ్​టీవీ' (1999), 'ఎవ్రీవన్'స్ హీరో' (2006), 'ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్' వంటి ముఖ్యమైన చిత్రాల్లో పనిచేశారు.

రాబ్​ రైనర్​ ఫొటో.. (REUTERS)
రాబ్​ రైనర్​ ఫొటో.. (REUTERS)

అయితే, రాబ్​ రైనర్​ హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంది మాత్రం దర్శకత్వంతోనే!

1984లో వచ్చిన హెవీ మెటల్ మాక్యుమెంటరీ 'దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్' తో దర్శకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది.

80వ దశకంలో, ఆయన 'వెన్ హ్యారీ మెట్ శాలీ', 'ది ప్రిన్సెస్ బ్రైడ్', 'స్టాండ్ బై మీ' వంటి విజయవంతమైన చిత్రాలతో హాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న చిత్రనిర్మాతల్లో ఒకరిగా స్థిరపడ్డారు.

90వ దశకాన్ని 'మిజరీ' తో ప్రారంభించి, 'ఎ ఫ్యూ గుడ్ మెన్' వరకు ఆయన దర్శకత్వ విజయాలు కొనసాగాయి. ఈ సినిమాకు ఆయన ఆస్కార్ నామినేషన్ కూడా అందుకున్నారు!

రాబ్ రైనర్ భార్య మిచెల్..

80వ దశకం చివర్లో 'వెన్ హ్యారీ మెట్ శాలీ' సినిమా సెట్స్‌లో రాబ్ రైనర్ ఫోటోగ్రాఫర్ అయిన మిచెల్ సింగర్‌ను కలుసుకున్నారు. వారు 1989లో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు చాలా సంవత్సరాలుగా లాస్ ఏంజిల్స్‌లోని బ్రెంట్‌వుడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More