Monsoon 2026 : కేరళలోకి నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? ఇప్పట్లో చెప్పలేం అంటున్న ఐఎండీ!
Monsoon 2026 forecast : దేశవ్యాప్తంగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ వారాంతానికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..
Monsoon 2026 arrival in India : వేసవి తాపంతో అల్లాడుతున్న భారతీయులకు ఊరటనిచ్చే వార్త. 2026 నైరుతి రుతుపవనాల ప్రస్థానం ప్రారంభం కానుంది. ఈ వారాంతం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల మీదుగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.
బలపడుతున్న అల్పపీడనం..
ఐఎండీ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రుతుపవనాల రాకకు మార్గం సుగమం అవుతుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
అయితే, కేరళను రుతుపవనాలు ఎప్పుడు తాకుతాయనే దానిపై ఐఎండీ ఇప్పుడే స్పష్టత ఇవ్వలేకపోతోంది.
"కేరళలో రుతుపవనాల రాకపై మే 15వ తేదీన అధికారికంగా అంచనా వేస్తాము," అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర తెలిపారు.
సాధారణంగా ప్రతియేటా జూన్ 1కి అటు, ఇటుగా రుతుపవనాలు కేరళను తాకుతాయి. అక్కడి నుంచి జులై 15 నాటికి దేశమంతటా విస్తరిస్తాయి.
ఈ ఏడాది 'ఎల్ నినో' ప్రభావం?
ఈ ఏడాది వర్షపాతంపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మే-జూన్-జులై కాలంలో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటమే దీనికి కారణం.
సాధారణంగా ఎల్ నినో ప్రభావం ఉంటే వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు రుతుపవనాలు బలహీనంగా ఉంటాయి.
అదే సమయంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా (92 శాతం) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ గతంలోనే అంచనా వేసింది.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఈ ఏప్రిల్‌లో 21°సీ గా నమోదయ్యాయి. ఇది చరిత్రలోనే రెండో అత్యధిక ఉష్ణోగ్రత.
ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు!
రుతుపవనాల రాక వార్త విన్పిస్తున్నప్పటికీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య భారత దేశంలో రాబోయే 5-7 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు, దక్షిణ భారత్‌లోని కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో రాబోయే 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాతావరణ రంగంలో ‘ఏఐ’ విప్లవం..
వాతావరణ అంచనాలను మరింత ఖచ్చితంగా అందించేందుకు కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ మంగళవారం రెండు కొత్త ఏఐ ఆధారిత ఉత్పత్తులను లాంచ్ చేసింది. అవి..
ఏఐ ఆధారిత రుతుపవనాల అంచనా: దేశంలోని వివిధ ప్రాంతాలకు రుతుపవనాలు ఎప్పుడు చేరుతాయనేది ఇది ముందే తెలియజేస్తుంది.
హై-రిజల్యూషన్ రెయిన్‌ఫాల్ ఫోర్కాస్ట్: పైలట్ ప్రాజెక్ట్‌గా ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన వర్షపాత అంచనాలను అందించే వ్యవస్థను ప్రారంభించారు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ప్రశ్న: నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను ఎప్పుడు తాకవచ్చు?
సమాధానం: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో, ఈ వారాంతం నాటికి రుతుపవనాలు అండమాన్ సముద్రం మరియు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
2. ప్రశ్న: ఈ ఏడాది వర్షపాతంపై 'ఎల్ నినో' ప్రభావం ఎలా ఉండబోతోంది?
సమాధానం: ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈసారి సాధారణం కంటే తక్కువగా (92 శాతం) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వేసవి తీవ్రత పెరిగి రుతుపవనాలు కొంత బలహీనపడవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


