Southwest Monsoon : మాన్​సూన్ ఈజ్ బ్యాక్! దేశవ్యాప్తంగా ఇక దంచికొట్టనున్న వర్షాలు..

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

Published on: Jul 19, 2026, 09:08:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న నైరుతి రుతుపవనాలు మరోసారి దేశవ్యాప్తంగా పుంజుకోనున్నాయి. ఈ మేరకు కేరళ నుంచి హిమాలయాల వరకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక సూచనలు, అలర్ట్​లు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుపానులు, కొండచరియలు విరిగిపడటం, అకాల వరదలు వచ్చే ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

ముంబైలో నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్... (HT_PRINT)
ముంబైలో నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్... (HT_PRINT)

ముఖ్యంగా పర్వత ప్రాంత రాష్ట్రాలపై రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారి రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీనితో ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు ప్రతిష్టాత్మకమైన అమర్‌నాథ్, వైష్ణోదేవి యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు.

జమ్ముకశ్మీర్, పర్వత ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సాధారణ జీవనం అతలాకుతలమైంది. దీంతో వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగరాల్లోని ప్రధాన ప్రాంతాలు జలమయం కాగా, నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రానున్న రోజుల్లో కాశ్మీర్ లోయతో పాటు జమ్ము రీజియన్‌లోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పొరుగు రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లోనూ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కిన్నౌర్ ప్రాంతంలో సంభవించిన మేఘ విస్ఫోటనం వల్ల ఐటీబీపీ క్యాంప్ సమీపంలోని స్థానిక వాగు ఉధృతంగా ప్రవహించింది. కొండలపై నుంచి భారీగా బురద, పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకురావడంతో సాంగ్లా-చిత్కుల్ రహదారి తీవ్రంగా దెబ్బతింది.

"రాష్ట్రవ్యాప్తంగా జులై 24 వరకు రుతుపవనాలు చాలా చురుగ్గా ఉంటాయి. జులై 20న చంబా, కాంగ్రా, మండి, సిర్మౌర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశాం. జులై 21న కులూ జిల్లా కూడా రెడ్ అలర్ట్ పరిధిలోకి వస్తుంది," అని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త సందీప్ కుమార్ శర్మ పేర్కొన్నారు.

నదులు, వాగుల ఉధృతి పెరుగుతున్నందున ప్రజలు వాటికి దూరంగా ఉండాలని, ప్రభుత్వ ప్రయాణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తరాఖండ్, బెంగాల్‌లో అతి భారీ వర్షాలు..

హిమాలయ పరిసర ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ రెడ్ కలర్ వార్నింగ్ ఇచ్చింది. వీటితో పాటు దిల్లీ, హరియాణా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, ఒడిశా, ఈశాన్య భారత ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

జాతీయ రాజధాని దిల్లీలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రత 35 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనీస ఉష్ణోగ్రత 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ సంస్థ స్పష్టం చేసింది.

పంజాబ్​లో ఇలా..

భానుడి భగభగలతో ఇబ్బంది పడుతున్న పంజాబ్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. దాదాపు పది రోజుల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటాయని వివరించింది. ఆదివారం నుంచి పంజాబ్ వ్యాప్తంగా వాతావరణం మారిపోయి, విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో పిడుగుల హెచ్చరిక!

దక్షిణాది రాష్ట్రాలపై కూడా రుతుపవనాల ప్రభావం బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, అలాగే తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో బలమైన గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

ఇక మహారాష్ట్ర, మరాఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తూర్పు రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More