Rains in India : రుతుపవనాల ఉగ్రరూపం- దేశవ్యాప్తంగా భారీ వర్షాలు! పెరుగుతున్న మృతుల సంఖ్య..
Weather today : నైరుతి రుతుపవనాల ఉధృతితో భారత దేశం తడిసిముద్దవుతోంది. దిల్లీ, యూపీ, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, రహదారులు జలమయమై జనజీవనం పూర్తిగా స్తంభించింది.
భారతదేశాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నుంచి కురుస్తున్న భీభత్సపు వానలకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. వరద ఉధృతికి రహదారులు నదులను తలపిస్తుండగా, భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. పలు నగరాల్లోని నివాస ప్రాంతాలు మోకాళ్లోతు నీటిలో మునిగిపోవడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. రహదారులు, జాతీయ రహదారులపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది.

ఈ విపత్కర పరిస్థితుల నుంచి సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి రెస్క్యూ బృందాలు వివిధ రాష్ట్రాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
దేశ రాజధానిలో బీభత్సం.. రోహిణిలో భవనం కూలి ముగ్గురు మృతి
దేశ రాజధాని దిల్లీని ముంచెత్తిన భారీ వర్షం రికార్డు స్థాయి నష్టాన్ని మిగిల్చింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 160 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
అయితే ఈ భారీ వర్షం కారణంగా వాయు కాలుష్యం తగ్గిపోయి 2023 సెప్టెంబర్ తర్వాత అత్యంత స్వచ్ఛమైన గాలి నమోదైనప్పటికీ, నగర మౌలిక వసతులు మాత్రం కుప్పకూలాయి. దిల్లీలోని రోహిణి పరిసరాల్లో ఒక భవనం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. వికాస్ మార్గ్, తూర్పు దిల్లీ, న్యూదిల్లీ రైల్వే స్టేషన్ పరిసరాలు, ద్వారక వంటి కీలక ప్రాంతాలు నీట మునిగాయి. అలీపూర్ వద్ద రోడ్డుపై నిలిచిన వరద నీటిలో లారీలు, కార్లు సగం వరకు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నగరంలో వందలాది చెట్లు కూలి కార్లపై పడ్డాయి. ఘాజీపూర్ సరిహద్దులో జాతీయ రహదారి-9పై మైళ్ల పొడవునా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దిల్లీ పరిసర ప్రాంతాలైన నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలోనూ ఇదే పరిస్థితి ఉంది. గురుగ్రామ్‌లోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ బాల్కనీ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘజియాబాద్‌లో ఒక రోడ్డు రోడ్డు కుంగిపోయి పక్కనే ఉన్న గొయ్యిలో కార్లు పడిపోయాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన ఘజియాబాద్ అధికార యంత్రాంగం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
గుజరాత్, యూపీల్లో భారీగా మృతుల సంఖ్య!
గుజరాత్‌లోని సూరత్ నగరాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. గురువారం వాన నీరు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, సహాయక చర్యల్లో మరో ఆరు మృతదేహాలు లభ్యమవడంతో ఒక్క సూరత్‌లోనే గత కొన్ని రోజుల్లో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది! ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వయంగా సూరత్‌లో పర్యటించి సహాయక చర్యలను సమీక్షించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాట్లు, గోడలు కూలిన ఘటనల్లో ఏడుగురు మరణించారు. సంత్ కబీర్ నగర్, కుషీనగర్ జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు బలికాగా, బులంద్‌షహర్, శామ్లీ జిల్లాల్లో భారీ వర్షాలకు గోడలు కూలి నిరుపేదల గుడిసెలపై పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘజియాబాద్‌లో మూడేళ్ల చిన్నారి పల్లవి తన ఇంటి బయట ఉన్న ఓపెన్ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయి మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ యూపీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
కొండచరియల విలయం.. నదుల్లో పెరిగిన నీటిమట్టం!
హిమాలయ పర్వత ప్రాంత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు కొండచరియలు విరిగిపడటంతో వణికిపోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో వరదలు ఇళ్లను, పంటలను తుడిచిపెట్టాయి. కేంద్ర బృందం ఇక్కడి నష్టాన్ని అంచనా వేయడానికి పర్యటిస్తోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమవడమే కాకుండా, నదిలో వరద ఉధృతి పెరగడంతో వందేళ్ల నాటి ఒక ఇనుప వంతెన పూర్తిగా నీట మునిగింది. దీనివల్ల లిప్పా గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఉత్తరాఖండ్‌లో కొండచరియల కారణంగా 9 రాష్ట్ర రహదారులతో పాటు మొత్తం 107 మార్గాల్లో రవాణా నిలిచిపోయింది. డెహ్రాడూన్ సహా నాలుగు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు.
కేరళలో వాయనాడ్ విషాదం.. దేశవ్యాప్తంగా అదనపు వర్షపాతం!
దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కూడా వర్షాల తీవ్రత తగ్గడం లేదు. వాయనాడ్‌లో సంభవించిన కొండచరియల విపత్తులో గురువారం మరో మూడు మృతదేహాలు లభ్యం కావడంతో మరణాల సంఖ్య ఆరుకు పెరిగింది. ఇంకా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరోవైపు మలప్పురం, కోజికోడ్, వాయనాడ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, జులై మొదటి వారంలోనే దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జులై తొలి తొమ్మిది రోజుల్లో సాధారణ వర్షపాతం 73.8 ఎంఎం ఉండాల్సి ఉండగా, ఈసారి ఏకంగా 101.9 ఎంఎం వర్షం కురిసింది. రుతుపవనాలు దేశం మొత్తాన్ని కమ్మేసినందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


