Southwest Monsoon : బ్రేక్​ తీసుకున్న మాన్​సూన్! దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు- హీట్​వేవ్ తప్పదా?

Weather update : నైరుతి రుతుపవనాలు బ్రేక్ తీసుకున్నాయి! దేశంలో చాలా చోట్ల వర్షాలు పడటం లేదు. అంతేకాదు, ఉష్ణోగ్రతలు సైతం ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణాలను నిపుణులు వివరించారు.

Published on: Jul 13, 2026, 09:58:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వీకెండ్‌లో మీరు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడు వాతావరణ యాప్‌లో చూపించిన దానికంటే విపరీతమైన వేడి, ఉక్కపోత మిమ్మల్ని ఊపిరాడకుండా చేశాయా? అయితే అది మీ భ్రమ కాదు, అక్షరాలా నిజం! ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రత 32 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ లోపే ఉంది. కానీ, బయటకు వస్తే మాత్రం ఏకంగా 45-50 డిగ్రీల మండుటెండల్లో నిలబడినట్లు ఒళ్లు కాలిపోతోంది. దీనికి కారణం సాధారణ వడగాల్పులు కావు. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని 'మాన్‌సూన్ బ్రేక్' (వర్షాలకు పడిన విరామం) అని పిలుస్తున్నారు. గత వారమే కాదు, ఈ వారం కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది.

మాన్​సూన్ బ్రేక్ అంటే ఏంటి? హీట్​వేవ్ తప్పదా?
మాన్​సూన్ బ్రేక్ అంటే ఏంటి? హీట్​వేవ్ తప్పదా?

36 డిగ్రీల ఉష్ణోగ్రత.. 50 డిగ్రీల వేడిలా ఎందుకు అనిపిస్తోంది?

ఇదంతా గాలిలో ఉండే తేమ (హ్యుమిడిటీ) ఆడుతున్న వింత నాటకం! సాధారణంగా మన శరీరం అధిక వేడిని తట్టుకోవడానికి చెమటను ఉత్పత్తి చేస్తుంది. ఆ చెమట గాలిలో ఆవిరైనప్పుడు మనకు చల్లదనం లభిస్తుంది. కానీ, గాలిలో ఇప్పటికే తేమ శాతం గరిష్టంగా ఉన్నప్పుడు, మన ఒంటిపై ఉన్న చెమట అంత త్వరగా ఆవిరి కాదు. దీనివల్ల శరీరం తన వేడిని బయటకు పంపలేక లోపల ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. వాతావరణ నిపుణులు గాలి ఉష్ణోగ్రతను, తేమను కలిపి 'హీట్ ఇండెక్స్' లేదా 'అపారెంట్ టెంపరేచర్' అని పిలుస్తారు.

ఉదాహరణకు, భువనేశ్వర్‌లో గాలి ఉష్ణోగ్రత 36 డిగ్రీలు మాత్రమే ఉంది. కానీ, అక్కడి గాలిలో 63 శాతం తేమ ఉండటం వల్ల అది మనుషులకు 49.9 డిగ్రీల అత్యధిక వేడిలా అనిపిస్తోంది. చెన్నై, లక్నో నగరాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఏంటి ఈ మాన్‌సూన్ బ్రేక్? ఉక్కపోతకు దీనికి సంబంధం ఏంటి?

నైరుతి రుతుపవనాలు జులై 9 నాడే దేశమంతటా విస్తరించి, భారీ వర్షాలను కురిపించాయి. అయితే, జులై 10 నాటికి రుతుపవన ద్రోణి ఒక్కసారిగా హిమాలయ పర్వత ప్రాంతాల వైపు ఉత్తరానికి కదిలింది. దీనివల్ల మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారత ప్రాంతాల్లోకి పొడి గాలులు ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం.. రాబోయే కొన్ని రోజుల పాటు మధ్య, దక్షిణ భారత దేశంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి.

ఇలా వర్షాలు తగ్గి ఆకాశం నిర్మలంగా మారినప్పుడు సూర్యుడి తీవ్రత పెరుగుతుంది. భూమిలో, వాతావరణంలో అప్పటికే పేరుకుపోయిన తడి సూర్యుడి ఎండకు ఆవిరై గాలిలో భారీగా తేమను పెంచుతుంది. ఈ తీవ్రమైన తేమ, సూర్యుడి వేడి కలిసి హీట్ ఇండెక్స్‌ను అమాంతం పెంచేస్తాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా కోస్తా తీర ప్రాంతాలు, నగరాల్లో ఇటువంటి ఉక్కపోత తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

తీర ప్రాంత నగరాలపైనే ఎక్కువ ప్రభావం!

సముద్ర గాలుల వల్ల నిరంతరం తేమ వస్తూనే ఉంటుంది కాబట్టి తీర ప్రాంత, తూర్పు నగరాలు ఈ సమస్యతో ఎక్కువగా నలిగిపోతున్నాయి. ముంబైలో అసలు ఉష్ణోగ్రత కేవలం 32 డిగ్రీలు ఉన్నప్పటికీ, 70 శాతం తేమ వల్ల అక్కడి ప్రజలకు 40.4 డిగ్రీల వేడి తగులుతోంది. దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తరాది నగరాల్లో కూడా ఈ హీట్ ఇండెక్స్ 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతూ జన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.

ఇది అధికారిక వడగాల్పులా? వైద్యుల హెచ్చరిక ఏంటి?

జులై 15 వరకు ఉన్న అవుట్‌లుక్‌లో దీనిని 'హీట్ వేవ్' (వడగాల్పులు) అని వాతావరణ శాఖ ప్రకటించలేదు. కానీ, వాయవ్య, ఈశాన్య భారతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. ఇవి పొడి గాలులతో వచ్చే ఎండలు కావు, ఉక్కపోతతో కూడిన ప్రమాదకరమైన వేడి. పొడి ఎండల కంటే ఈ ఉక్కపోత ఎండలే చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఎండలో శ్రమించే కార్మికులు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందిని, రుతుపవనాలు మళ్లీ పుంజుకునే వరకు మధ్యాహ్నం పూట ప్రయాణాలు తగ్గించుకోవడం, ఓఆర్ఎస్ లేదా ఎక్కువ నీరు తాగడం చాలా అవసరమని వివరిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More