రుతుపవనాలు కనబడుట లేదు! దేశంలోని 70శాతం ప్రాంతాల్లో మేఘాలు మిస్సింగ్- ఏపీలో మళ్లీ హీట్‌వేవ్ పరిస్థితులు..
Southwest monsoon : భారతదేశంలో నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించిన కొద్దిరోజులకే వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి! ఆకాశంలో మేఘాలు మాయమై, ఎండలు మళ్లీ ముదురుతుండటంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది! సాధారణంగా జులై నెలలో ఎడతెరిపి లేకుండా కురవాల్సిన వానలు అకస్మాత్తుగా తగ్గిపోవడంతో దేశంలోని మెజారిటీ ప్రాంతాలు పొడి వాతావరణంతో నిశ్శబ్దంగా మారిపోయాయి. శనివారం (జులై 11) అందిన శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే.. దేశంలోని దాదాపు 70 నుంచి 80 శాతం భూభాగంపై అస్సలు మేఘాల జాడే లేదు! నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన కొన్ని రోజులకే వాతావరణంలో ఈ అనూహ్య మార్పు రావడం గమనార్హం.

ఇటీవల ముంబై, దిల్లీ వంటి నగరాలను ముంచెత్తిన భారీ వర్షాల తర్వాత అకస్మాత్తుగా ఈ డ్రై స్పెల్ (పొడి వాతావరణం) ఎందుకు వచ్చింది? వర్ష కాలం మధ్యలో వానలు ఎందుకు ఆగిపోయాయనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. అయితే, ఈ మార్పునకు కారణం మన దేశంలో లేదు.. ఇక్కడికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో దాగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వర్షాలను అడ్డుకుంటున్న పసిఫిక్ తుపాను!
భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురవాలంటే హిందూ మహాసముద్రం నుంచి వచ్చే తేమతో కూడిన గాలులు, అలాగే దేశంపై ఏర్పడే రుతుపవన ద్రోణి బలంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఒక శక్తివంతమైన ఉష్ణమండల తుపాను ఏర్పడింది. ఈ తుఫాను ప్రభావం వల్ల హిందూ మహాసముద్రం నుంచి రావాల్సిన తేమ గాలిని, వాతావరణ వ్యవస్థలను ఆ తుపాను తన వైపునకు లాగేసుకుంటోంది. ఫలితంగా భారత ఉపఖండంపై ఉన్న రుతుపవన ద్రోణి పూర్తిగా బలహీనపడి, వర్షాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.
ఈ నేపథ్యంలోనే మధ్య భారతదేశంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఊగిసలాడుతున్న వానల ప్రస్థానం!
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రయాణం మొదటి నుంచి ఒడిదొడుకులతోనే సాగుతోంది! జూన్ నెల ముగిసే సమయానికి దేశంలో దాదాపు 40 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఇటీవలి కాలంలో ఇంత బలహీనమైన ప్రారంభం ఎప్పుడూ లేదు. జూన్ చివరి వారంలో, జులై మొదటి వారంలో పడిన భారీ వర్షాల వల్ల ఈ లోటు 14 శాతానికి తగ్గింది. జులై 9 నాటికి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. అయినప్పటికీ వర్షపాతం ఏకరీతిగా లేదు. పశ్చిమ, తూర్పు భారత ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసినా, మధ్య భారత రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ తీవ్ర వర్షపాత లోటు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు విత్తనాలు వేసేందుకు సరైన వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముంచుకొస్తున్న ఎల్ నినో భయం.. కోస్తా ఆంధ్రాలో ఎండలు!
"పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు త్వరగా సర్దుకుంటేనే రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటాయి," అని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. జులై మిగిలిన రోజుల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని, అది సగటున 94 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎమ్‌డీ అంచనా వేస్తోంది. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ‘ఎల్ నినో’ ప్రభావం వాతావరణ శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎల్ నినో బలం పుంజుకుంటే రుతుపవనాల సీజన్ చివరి భాగంలో వర్షాలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం వర్షాలు మొండికేయడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా జులై 12న కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడా హీట్‌వేవ్ పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


