వెదర్ రిపోర్ట్ : తెలంగాణలో దంచికొట్టిన వర్షం - ఏపీకి ఆకస్మిక వర్షాల హెచ్చరిక..! ఐఎండీ అంచనాలు

తెలంగాణవ్యాప్తంగా అర్ధరాత్రి వేళ భారీ వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడటంతో గరిష్టంగా 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇవాళ తెలంగాణతో పాటు ఏపీలో కూడా వర్షాలు పడనున్నాయి.

Published on: May 27, 2026, 08:02:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Telangana Weather Updates : గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు… వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం ఊరటనిచ్చింది. తెలంగాణలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం తెలంగాణను ముంచెత్తింది. అకాల వర్షమే అయినప్పటికీ…. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న విపరీతమైన ఉష్ణోగ్రతల నుండి ఈ వాన కాస్త ఉపశమనం కలిగించింది.

ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్
ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్ట్

తెలంగాణవ్యాప్తంగా నమోదైన వర్షపాత వివరాలను గమనిస్తే…. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వాన దంచికొట్టింది. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తమొల్గరలో రికార్డు స్థాయిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే జిల్లాలోని పర్పల్లిలో 10 సెంటీమీటర్లు, భూత్పూర్‌లో 10 సెంటీమీటర్ల మేర భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌ సిటీలో సైతం 7.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.

మహబూబ్‌నగర్‌తో పాటు పక్కనే ఉన్న ఇతర దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ వాన జోరు కొనసాగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేటలో 8.8 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా అమరచింతలో 8.6 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది.

మరోవైపు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లోనూ అర్ధరాత్రి వాన పలకరించింది. సిద్దిపేట జిల్లా అంగడ కిష్టాపూర్‌లో 6.5 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా డిండిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6 సెంటీమీటర్లు, నిజామాబాద్‌ జిల్లా దర్పల్లిలో 5.4 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, సదాశివనగర్‌ ప్రాంతాల్లో ఐదేసి (5) సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే.. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనాలకు ఈ వాన వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లబరిచింది. హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లోనూ అర్ధరాత్రి వర్షం పడింది. ఇవాళ ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది.

మరికొన్ని రోజులు వర్షాలు..!

హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం (IMD) విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. మే 28 నుంచి మే 31 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పులతో పాటు ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మే 28 ఉదయం నుంచి మే 29 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం ఉండే సూచనలున్నాయి.

ఎండలతో పాటు రాష్ట్రంలో ఆకస్మిక వాతావరణ మార్పులు కూడా సంభవించనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ముఖ్యంగా మే 29, 30, 31 తేదీల్లో మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

ఏపీ వెదర్ రిపోర్ట్: ఎండలు, ఆకస్మిక వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత, వడగాల్పులు విపరీతంగా పెరుగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.

మే 27 (ఇవాళ) రాష్ట్రంలోని దాదాపు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. దీనితో పాటు మరో 93 మండలాల్లో సాధారణ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం గుంటూరు జిల్లా ములుకుదురులో అత్యధికంగా 47.7°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా గురజాలలో 47.6°C ఉష్ణోగ్రత నమోదైంది.

జిల్లాల వారీగా గరిష్ట ఉష్ణోగ్రతల అంచనా:

  • పోలవరం,కోనసీమ,పశ్చిమగోదావరి,ఏలూరు : 45°C - 47°C
  • ఉత్తరాంధ్ర,కృష్ణా,గుంటూరు,పల్నాడు,ప్రకాశం : 42°C - 44°C
  • రాయలసీమ,నెల్లూరు,కాకినాడ : 40°C - 42°C

తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

మరోవైపు ఆకస్మిక వర్షాలు, ఈదురు గాలులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడకూడదు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More