వన్డే ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్‌పై ‘స్కామ్’ ఆరోపణలు- అరెస్ట్!
Arjuna Ranatunga : 1996 వన్డే ప్రపంచ కప్ విన్నింగ్ జట్టు సారథి, మాజీ పెట్రోలియం మంత్రి అయిన అర్జున రణతుంగపై చమురు స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి. ఆయన విదేశాల్లో ఉన్నారని, దేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆరెస్టు చేస్తామని అధికారులు వెల్లడించారు.
శ్రీలంక వన్డే ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ అర్జున రణతుంగకు భారీ షాక్! పెట్రోలియం మంత్రిగా పనిచేసిన కాలానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై ఆయన్ని అరెస్టు చేయాలని యోచిస్తున్నట్లు అధికారులు కోర్టుకు తెలిపారు.

దీర్ఘకాలిక చమురు సేకరణ కాంట్రాక్టుల కేటాయింపు విధానాన్ని మార్చి, ఎక్కువ ధరకు స్పాట్ కొనుగోళ్లు చేశారనే ఆరోపణలు.. రణతుంగ, ఆయన సోదరుడిపై వచ్చినట్లు అవినీతి నిరోధక సంస్థ వెల్లడించింది.
"2017లో జరిగిన ఈ 27 కొనుగోళ్ల వల్ల రాష్ట్రానికి మొత్తం 800 మిలియన్ శ్రీలంక రూపాయలు (సుమారు రూ. 23.5 కోట్లు) నష్టం వాటిల్లింది," అని అవినీతి ఆరోపణలపై విచారణ కమిషన్ (సీఐఏబీఓసీ) తెలిపింది.
ప్రస్తుతం అర్జున రణతుంగ విదేశాల్లో ఉన్నారని, ఆయన శ్రీలంకకు తిరిగి రాగానే అరెస్టు చేస్తామని కమిషన్ కొలంబో మెజిస్ట్రేట్ అసంగా బొడరాగమాకు తెలియజేసింది.
మాజీ మంత్రి అర్జున రణతుంగ అన్నయ్య ధమ్మికా రణతుంగను సోమవారం అరెస్టు చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఆయన అప్పట్లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. ధమ్మికా శ్రీలంక, అమెరికా ద్వంద్వ పౌరుడు కావడంతో, మెజిస్ట్రేట్ ఆయనపై ప్రయాణ నిషేధం విధించారు. తదుపరి విచారణ మార్చి 13కి వాయిదా పడింది.
అర్జున రణతుంగ ప్రస్థానం..
ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన 62 ఏళ్ల అర్జున రణతుంగ.. 1996లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంకకు క్రికెట్ ప్రపంచ కప్‌ను అందించారు. అది ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే గొప్ప విజయం. ఆ తర్వాత శ్రీలంక ఒక్కసారి కూడా వన్డే ప్రపంచకప్ గెలవలేదు.
రణతుంగ సోదరులపై నమోదైన ఈ కేసు, అవినీతి నిర్మూలన హామీతో గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ప్రభుత్వం చేపట్టిన విస్తృత చర్యల్లో భాగం.
రణతుంగల కుటుంబానికి చెందిన మరో సోదరుడు, మాజీ పర్యాటక శాఖ మంత్రి ప్రసన్న రణతుంగను గత నెలలో బీమా మోసానికి సంబంధించిన కేసులో అరెస్టు చేశారు. ఆ కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఆయన గతంలో 2022 జూన్‌లో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకున్నందుకు దోషిగా తేలారు. ప్రస్తుతం ఆయనకు రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష అమల్లో ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


