శ్రీలంకలో దిత్వా తుపాను బీభత్సం: 123 మంది మృతి..

శ్రీలంకలో 'దిత్వా' తుపాను కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల వల్ల 123 మంది మరణించారు. 61,000 కుటుంబాలకు చెందిన 2 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీలంకకు సహాయం అందించేందుకు భారత్ 'ఆపరేషన్ సాగర్ బంధు' చేపట్టింది.

Published on: Nov 29, 2025, 13:30:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అల్లాడిపోతోంది! బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను కారణంగా కురిసిన కుండపోత వర్షాలు, వరదలు విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 123 మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం (డీఎంసీ) శనివారం తెలిపింది. ఏజెన్సీ నివేదిక ప్రకారం మరో 130 మంది గల్లంతయ్యారు.

శ్రీలంకపై తుపాను పంజా.. (AP)
శ్రీలంకపై తుపాను పంజా.. (AP)

ఈ విపత్తు కారణంగా 61,000 కుటుంబాలకు చెందిన 2 లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని శ్రీలంక అధికారులు తెలిపారు.

అయితే, సెంట్రల్ ప్రావిన్స్‌లోని క్యాండీ సహాయక అధికారులు మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే సమయానికే క్యాండీ జిల్లాలోనే మరణాల సంఖ్య 50 దాటింది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు.

శ్రీలంకపై దిత్వా తుపాను ప్రభావం..

కొండచరియలు విరిగిపడటంతో కొండ ప్రాంతాల్లోని బదుల్లా జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ 35 మందికి పైగా మరణించగా, చాలా మంది ఆచూకీ గల్లంతైంది.

శనివారం లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితి మరింత దిగజారింది! దీనితో రాజధాని కొలంబో నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రవహించే కెలానీ నది ఒడ్డున నివసించే ప్రజలను తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం సాయంత్రం కెలానీ నది ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది మంది తాత్కాలిక శిబిరాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని డీఎంసీ తెలిపింది.

దిత్వా తుపాను- శ్రీలంకలో వాతావరణ అప్‌డేట్

రాజధాని కొలంబోతో పాటు ద్వీప దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే దిత్వా తుపాను ప్రభావం కారణంగా ద్వీపం ఉత్తర ప్రాంతాల్లో మాత్రం ఇంకా వర్షాలు కురుస్తున్నాయి.

ఈ వాతావరణ వ్యవస్థ శ్రీలంక నుంచి పొరుగు దేశమైన భారతదేశం వైపు కదులుతోందని డీఎంసీ తెలిపింది. దిత్వా తుపాను శనివారం చివరి నాటికి ద్వీపాన్ని దాటిపోవచ్చు. అయినప్పటికీ, 200 మిల్లీమీటర్లకు పైగా మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో హెచ్చరించింది.

దిత్వా తుపాను విలయంతో వరదలు, కొండచరియలు విరిగిపడి మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లడం, ప్రాణనష్టం జరగడంతో శ్రీలంక అత్యంత తీవ్రమైన విపత్తులలో ఒకదాన్ని ఎదుర్కొంటోంది.

'ఆపరేషన్ సాగర్ బంధు' ద్వారా భారత్ సహాయం..

శ్రీలంకకు సంక్షోభ సమయంలో సహాయం అందించడానికి భారత్ శుక్రవారం ‘ఆపరేషన్ సాగర్ బంధు’ను ప్రారంభించింది. ఇండియన్ నేవీకి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఫ్రంట్‌లైన్ షిప్ ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా తొలి విడత సహాయ సామగ్రిని ద్వీప దేశానికి రవాణా చేసి, శ్రీలంక అధికారులకు అందజేశారు.

శనివారం కూడా భారత వైమానిక దళం (ఐఏఎఫ్​) విధ్వంసకర వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి సహాయం చేయడానికి 21 టన్నుల సహాయ సామాగ్రితో పాటు 80 మందికి పైగా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని, ఎనిమిది టన్నుల పరికరాలను శ్రీలంకకు డెలివరీ చేసింది.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున హిండన్ ఎయిర్ బేస్ నుంచి ఒక సీ-130, ఒక ఐఎల్​-76 విమానాలను తక్షణమే మోహరించి, 21 టన్నుల సహాయ సామాగ్రితో పాటు 80 మందికి పైగా ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని, ఎనిమిది టన్నుల పరికరాలను తరలించినట్లు భారత వైమానిక దళం తెలిపింది.

బాధితులకు మద్దతుగా అవసరమైన రేషన్, కీలకమైన సామాగ్రిని అందించినట్లు అధికారులు తెలిపారు.

దిత్వా తుపాను తీరం ఎక్కడ దాటుతుంది?

దిత్వా తుపాను నవంబర్ 29 సాయంత్రం నుంచి నవంబర్ 30 ఉదయం మధ్య ఉత్తర తమిళనాడు-యు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

ఈ తుపాను ప్రభావం విస్తృతంగా ఉంటుందని, నవంబర్ 30న తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలలో దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More