Cyclone Ditwah ఎఫెక్ట్​- ఆంధ్రతో పాటు ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..!

దిత్వా తుపాను దూసుకొస్తోంది! ఈ కారణంగా రానున్న రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో ఈరోజు నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు రెడ్​, ఆరెంజ్​ అలర్ట్​లను జారీ చేసింది.

Published on: Nov 29, 2025, 07:30:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. దీనికి ‘దిత్వా’ అనే పేరు పెట్టారు. ఈ తుపాను నవంబర్ 30 తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఐఎండీ ఇప్పటికే పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

తమిళనాడు రామాంతపురంలో.. (PTI)
తమిళనాడు రామాంతపురంలో.. (PTI)

దిత్వా తుపాను కదలిక, తాజా అప్‌డేట్..

ఐఎండీ విడుదల చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ దిత్వా తుపాను గత 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతోంది. నిన్న (నవంబర్ 28, 2025) రాత్రి 2330 గంటల సమయానికి (రాత్రి 11:30) ఇది అదే ప్రాంతంలో, 9.0°ఎన్​ అక్షాంశం, 80.8°ఈ రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది త్రింకోమలీ (శ్రీలంక)కి సుమారు 70 కి.మీ వాయువ్యంగా, పుదుచ్చేరి (భారతదేశం)కి 350 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, చెన్నై (భారతదేశం)కి 450 కి.మీ దక్షిణంగా ఉంది.

దిత్వా తుపాను- ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు..

ఈ దిత్వా తుపాను కారణంగా నవంబర్ 30 వరకు తమిళనాడు తీర ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన తాజా ప్రకటనలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాలలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నవంబర్ 30న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, తీర రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

కేరళలో ఈ రోజు (నవంబర్ 29) భారీ వర్షాలు కురుస్తాయని, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ఈ రోజు, రేపు (నవంబర్ 30) భారీ వర్షపాతం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఈ భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని వెల్లడించింది.

దిత్వా తుపాను- విమాన, రైలు సర్వీసులకు అంతరాయం..

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నవంబర్ 29కి షెడ్యూల్ చేసిన అనేక విమానాలను రద్దు చేశారు!

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణ సలహా జారీ చేస్తూ.. "దిత్వా తుపాను కారణంగా తలెత్తిన వాతావరణ పరిస్థితులు, భారీ వర్షాల వల్ల జాఫ్నా, పుదుచ్చేరి, తూత్తుకుడి, తిరుచికి వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే విమానాలకు అంతరాయం కలగవచ్చు," అని 'ఎక్స్​'లో పోస్ట్ చేసింది.

విమానాల రద్దుతో పాటు రైల్వే రవాణాకు కూడా అంతరాయం కలిగింది. దక్షిణ రైల్వే కూడా నవంబర్ 28, 29, 2025 తేదీల్లో కొన్ని రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు లేదా కుదించినట్లు 'ఎక్స్​' పోస్ట్ ద్వారా ప్రకటించింది.

దిత్వా తుపాను- రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ..

దిత్వా తుఫాన్ కారణంగా కేరళ ఇడుక్కి జిల్లాలోని మూడు రిజర్వాయర్లలో పెరుగుతున్న నీటి మట్టం కారణంగా రెడ్ అలర్ట్​లో ఉన్నాయి. త్రిస్సూర్, కోజికోడ్ రిజర్వాయర్లు ఆరెంజ్ అలర్ట్​లో ఉన్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాల దృష్ట్యా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని కడలూరు, మైలదుత్తురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలకు ఈ రోజు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, అరియలూరు, పెరంబలూరు, తిరుచిరాపల్లి, సేలం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట్ జిల్లాలతో పాటు కారైకాల్ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More