ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. సోమవారం నుంచి వర్షాలు పడే అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే తుపాను ప్రభావం పెద్దగా ఉండదని చెబుతున్నారు.

Published on: Nov 23, 2025, 18:00:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొద్ది రోజులుగా ఏపీని తుపాన్‌ భయం వెంటాడుతోంది. మొంథా తుపాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. అయితే మరో తుపాను సెనియార్ కూడా ఉంటుందని మెుదట అంచనా వేశారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను ఏపీ వైపు కాకుండా పశ్చిమ బెంగాల్/బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ, ఏపీ వర్షాలు
తెలంగాణ, ఏపీ వర్షాలు

దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 26 నుంచి ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. తుపాను పశ్చిమ బెంగాల్/బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని పలు జిల్లాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్‌ కడప, శ్రీ సత్యసాయి, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాలకు ఆదివారం ఎల్లో అలర్ట్‌ జారీ చేశామని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడన వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థ ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతం వైపు కదులుతున్నప్పుడు మరింత బలపడనుంది.

దీని ఫలితంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 1 మధ్య అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో వరి కోత పనులు జరుగుతున్నందున, రైతులు తమ ఉత్పత్తులను రక్షించుకోవడానికి చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో కూడా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అయితే రెండుమూడు రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పడిపోవడం లేదు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ప్రస్తుతం సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More