శ్రీదేవి స్థలం వివాదం: బోనీ కపూర్, జాన్వీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం

దివంగత నటి శ్రీదేవికి చెందిన చెన్నైలోని 2.7 ఎకరాల భూమి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. బోనీ కపూర్ కుటుంబం, పిటిషనర్ల మధ్య సమస్యను ముగించేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమిస్తామని స్పష్టం చేసింది.

Published on: Sep 16, 2026, 16:37:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నైలోని విలువైన భూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 1988 సేల్ డీడ్ ద్వారా శ్రీదేవి సొంతం చేసుకున్న 2.7 ఎకరాల స్థలంపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు వర్గాలు కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించింది. వివాద పరిష్కారం కోసం విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమిస్తామని స్పష్టం చేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది.

శ్రీదేవి స్థలం వివాదం: బోనీ కపూర్, జాన్వీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం (HT_PRINT)
శ్రీదేవి స్థలం వివాదం: బోనీ కపూర్, జాన్వీలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం (HT_PRINT)

ఏంటి ఈ 2.7 ఎకరాల వివాదం?

1988లో చెన్నై షోలింగనల్లూర్ పరిధిలో శ్రీదేవి 2.7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2018లో శ్రీదేవి మరణించిన తర్వాత, ఈ ఆస్తిని ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌ల పేర్లపైకి మార్చారు. ఆ స్థలం అసలు యజమాని ఎంసీ చంద్రశేఖరన్ అని, తామే ఆయన చట్టబద్ధ వారసులమని పేర్కొంటూ ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగారు. శ్రీదేవి పేరిట ఉన్న 1988 సేల్ డీడ్‌ను రద్దు చేయాలని కోరుతూ వారు 2025 జనవరిలో చెన్నైలోని విచారణ కోర్టును ఆశ్రయించారు.

ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు..

ఈ కేసును కొట్టివేయాలని బోనీ కపూర్ వేసిన పిటిషన్‌ను విచారణ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, 2026 ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు బోనీ కపూర్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ, పిటిషనర్ల దావాను రద్దు చేసింది. శ్రీదేవి మరణాంతరం 2023లో టైటిల్ మార్పు సమయంలోనే ఈ కొనుగోలు గురించి తెలిసిందనడం నమ్మశక్యంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చంద్రశేఖరన్ వారసులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

సుప్రీంకోర్టులో వాదనలు

బోనీ కపూర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. ఎంసీ సంబంధ ముదలియార్ కుటుంబానికి షోలింగనల్లూర్ గ్రామంలో 206 ఎకరాలకు పైగా భూమి ఉండేదని తెలిపారు. అందులో 2.7 ఎకరాలు మినహా మిగిలిన స్థలాన్ని ఉమ్మడి కుటుంబానికి ఇచ్చేశారని, ఆ 2.7 ఎకరాలను అనుభవిస్తున్న ముదలియార్ కుమారుల్లో ఒకరైన నిత్యానందం 1988లో శ్రీదేవికి విక్రయించారని వివరించారు.

1995లో చంద్రశేఖరన్ మరణించే వరకు ఈ విక్రయాన్ని సవాలు చేయలేదని, దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు వేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని సింఘ్వి పేర్కొన్నారు. చంద్రశేఖరన్‌కు ఆ స్థలంలో ఐదో వంతు వాటా ఉందా అనే అంశమే ఇక్కడ కీలకమని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, మధ్యవర్తి ద్వారా సమస్యను ముగించాలని ఇరువర్గాలకు సూచించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More