ITR filing : ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి? ఈ సింపుల్ ప్రాసెస్ తెలుసుకోండి..
ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణకు జులై 31 ఆఖరి తేదీ కావడంతో పన్ను చెల్లింపుదారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. సర్వర్ సమస్యలు, చివరి నిమిషం హడావుడి లేకుండా ఆన్‌లైన్‌లో ఐటీఆర్ దాఖలు చేయడానికి సులువైన గైడ్ ఇక్కడ చూడండి..
ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సమర్పణకు జులై 31 తుది గడువు కావడంతో, పన్ను చెల్లింపుదారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ రిటర్నులను ఫైల్ చేయడం మంచిది. ఆఖరి రోజుల్లో ఐటీ శాఖ పోర్టల్‌పై ట్రాఫిక్ విపరీతంగా పెరిగి వెబ్‌సైట్ స్లో అవ్వడం లేదా క్రష్ అవ్వడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశముంది. అందుకే సమయానికి ఐటీఆర్ దాఖలు చేయడం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు; భవిష్యత్తులో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, వీసా అప్రూవల్స్, క్రెడిట్ కార్డుల ఆమోదానికి ఇది అత్యంత కీలకమైన పత్రంగా ఉపయోగపడుతుంది.

చివరి నిమిషంలో ఆలస్య రుసుములు పడకుండా ఉండాలన్నా, ఖచ్చితమైన వివరాలతో తప్పులు లేకుండా ఫైలింగ్ పూర్తి చేయాలన్నా ముందే మీ ఆర్థిక లావాదేవీల డేటాను సరిచూసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీఆర్‌ను ఆన్‌లైన్‌లో సులువుగా ఎలా పూర్తి చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇక్కడ తెలుసుకోండి..
1. పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి..
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ (https://www.incometax.gov.in) సందర్శించండి. మీ పాన్ నంబర్‌ను యూజర్ ఐడీగా, మీ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వండి.
2. ఐటీఆర్ ఫైలింగ్ సెక్షన్‌కు వెళ్లండి..
హోమ్‌పేజీలో లాగిన్ అయ్యాక 'e-File' > 'Income Tax Returns' > 'File Income Tax Return' ఆప్షన్లపై వరుసగా క్లిక్ చేయండి.
ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ 'AY 2026-27' (2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను) ఎంచుకుని, ఆన్‌లైన్ మోడ్ సెలెక్ట్ చేసి 'Continue' పై క్లిక్ చేయండి.
3. సరైన ఐటీఆర్ ఫామ్‌ను ఎంచుకోండి..
మీ రాబడి మార్గాన్ని బట్టి సరిపోయే ఫామ్‌ను ఎంచుకోవాలి:
ఐటీఆర్-1 : జీతం, ఒకే ఇల్లు లేదా ఇతర సాధారణ మార్గాల ద్వారా ఆదాయం పొందే వ్యక్తుల కోసం.
ఐటీఆర్-2: క్యాపిటల్ గెయిన్స్ (షేర్లు/ఆస్తుల విక్రయ లాభాలు), విదేశీ ఆస్తులు లేదా ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల ద్వారా ఆదాయం ఉన్నవారికి.
ఐటీఆర్-3: వ్యాపారం లేదా స్వయం ఉపాధి/వృత్తిపరమైన ఆదాయం కలిగిన వ్యక్తులకు.
ఐటీఆర్-4 (సుగమ్): ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీమ్ కింద ఆదాయం చూపే వారికి.
4. ఫైలింగ్ చేయడానికి గల కారణాన్ని తెలుపండి..
మీరు ఐటీఆర్ ఎందుకు దాఖలు చేస్తున్నారో కింద పేర్కొన్న ఆప్షన్లలో సరైనదాన్ని ఎంచుకోండి:
- మీ స్థూల ఆదాయం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి కంటే ఎక్కువ ఉండటం.
- కొన్ని నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఐటీఆర్ దాఖలు తప్పనిసరి కావడం.
- లేదా ఇతర చెల్లుబాటు అయ్యే కారణాలు.
5. వివరాలను సరిచూసి ధృవీకరించండి..
మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం చాలావరకు ముందే నింపి ఉంటుంది.
మీ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి.
మీ జీతం, పన్ను వివరాలను మీ ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్‌లోని వివరాలతో సరిపోల్చండి.
సెక్షన్ 80సీ, 80డీ కింద మీరు పొందే పన్ను మినహాయింపుల వివరాలు నమోదు చేయండి. అన్ని వివరాలు సరైనవని నిర్ధారించుకున్నాకే ముందుకెళ్లండి.
6. పన్ను బకాయిలు ఉంటే చెల్లించి సబ్మిట్ చేయండి..
మీరు ఇంకా ఏదైనా పన్ను చెల్లించాల్సి ఉంటే, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించండి. చివరిగా మీ ఐటీఆర్ సమాచారాన్ని మరొకసారి సరిచూసుకుని ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
7. ఈ-వెరిఫికేషన్ తప్పనిసరి..
ఆదాయపు పన్ను రిటర్నుల సబ్మిట్ చేసినంత మాత్రాన ప్రక్రియ పూర్తి కాదు. సబ్మిట్ చేసిన 30 రోజుల్లోగా ఖచ్చితంగా ఈ-వెరిఫై చేయాలి. ఈ-వెరిఫికేషన్ కోసం క్రింది మార్గాలను వాడవచ్చు:
- ఆధార్ ఓటీపీ ద్వారా
- నెట్ బ్యాంకింగ్ ద్వారా
- ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) ద్వారా
- ఐటీఆర్-వీ కాపీపై సంతకం చేసి బెంగళూరులోని సీపీసీ ఆఫీస్‌కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు.
గడువు దాటితే పెనాల్టీలతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది కాబట్టి, జులై 31న ఆఖరి నిమిషం దాకా వేచి చూడకుండా వెంటనే మీ ఐటీఆర్ ఈ-ఫైలింగ్‌ను పూర్తి చేయండి!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


