CSK Fleming : 18ఏళ్ల ప్రస్థానానికి ముగింపు- సీఎస్కేకి ఫ్లెమింగ్ గుడ్‌బై..
Stephen Fleming CSK : ఐపీఎల్ చరిత్రలో అత్యంత సక్సెస్ఫుల్ ఫ్రాంఛైజ్ల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి.. ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై చెప్పేశారు. ఫలితంగా ఆ జట్టుతో ఫ్లెమింగ్‌కి ఉన్న 18ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది.
ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన, అత్యంత విజయవంతమైన సుదీర్ఘ బంధం ముగిసిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) విజయాల్లో తెరవెనుక కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఫ్లెమింగ్, సీఎస్కే యాజమాన్యం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ఫ్రాంచైజీ ప్రకటించింది. దీనితో 2008 ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి జట్టుతో కొనసాగుతూ వచ్చిన 18 ఏళ్ల అపూర్వ అనుబంధానికి తెరపడింది.

నిలకడకు, వ్యూహాత్మక చతురతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన ఫ్లెమింగ్ అధ్యక్షతనే చెన్నై సూపర్ కింగ్స్ 5 ఐపీఎల్ ట్రోఫీలను దక్కించుకుంది.
"క్రీడారంగంలో 18 ఏళ్లు అంటే ఒక జీవితకాలంతో సమానం. మనసారా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా. చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా వ్యవహరించడం నా కెరీర్‌లోనే అత్యుత్తమ గౌరవం. మేమంతా కలిసి సాధించిన మరువలేని విజయాలు, అధిగమించిన కష్టాలు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి," అని స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నారు.
మేజర్ లీగ్ క్రికెట్ సెగ.. మారిన సమీకరణాలు!
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్, సీఎస్కే మేనేజ్‌మెంట్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాతే ఈ తుది నిర్ణయానికి వచ్చారు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో చెన్నై అనుబంధ ఫ్రాంచైజీ అయిన 'టెక్సాస్ సూపర్ కింగ్స్' ఈ ఏడాది అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. ఫ్లెమింగ్ పర్యవేక్షణలోనే ఉన్న ఈ జట్టు 10 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ ఘోర పరాజయం ఫ్లెమింగ్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది.
ధోనీ-ఫ్లెమింగ్: ఒక శకం.. ఎన్నో రికార్డులు!
2008లో ప్లేయర్‌గా సీఎస్కే ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఫ్లెమింగ్, 2009లో హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్లాట్ చేశారు. అప్పటి నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు కోచ్‌గా ఉంటూ ఐపీఎల్‌లోనే ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, ఫ్లెమింగ్ కోచింగ్ కలయికలో చెన్నై జట్టు 5 ఐపీఎల్ టైటిళ్లు, 2 ఛాంపియన్స్ లీగ్ టీ20 కప్పులను ముద్దాడింది. రికార్డు స్థాయిలో 12 సార్లు ప్లేఆఫ్స్‌కు, 10 సార్లు ఫైనల్స్‌కు చేరింది. ఫ్రాంచైజీ యాజమాన్యం వీరిద్దరికీ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో, ఒత్తిడి లేని ఒక అద్భుతమైన డ్రెస్సింగ్ రూమ్ సంస్కృతిని వీరు సృష్టించారు.
వరుస పరాజయాలు.. అనివార్యమైన మార్పు!
ఐపీఎల్‌లో చెన్నై అంటే ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అనుకునే రోజులకు ఇటీవలి కాలంలో బ్రేక్ పడింది. 2023లో ఐదోసారి ట్రోఫీ గెలిచిన తర్వాత సీఎస్కే గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఆ తర్వాత వరుసగా మూడు సీజన్లలో జట్టు కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. 2025లో ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోగా, ఈ ఏడాది (2026) జరిగిన టోర్నీలోనూ 8వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
"మా ఫ్రాంచైజీ సుదీర్ఘ ప్రయాణంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ గుండె చప్పుడులా నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు మా జట్టు గుర్తింపును, విజన్లను ఆయనే తీర్చిదిద్దారు. మైదానంలో మా ప్రయాణం ముగిసినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ చరిత్రలో ఆయన ఎప్పటికీ ఒక భాగమే," అని సీఎస్కే ఓనర్ రూపా గురునాథ్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
సీఎస్కే మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ కూడా ఫ్లెమింగ్‌ను కొనియాడారు. జట్టులో క్రమశిక్షణ, వినయం, జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చే గొప్ప సంస్కృతిని ఫ్లెమింగ్ నేర్పించారని గుర్తుచేసుకున్నారు.
రానున్న ఐపీఎల మెగా వేలానికి ముందే ఈ మార్పు జరగడం గమనార్హం. ఇప్పటికే ధోనీ క్రియాశీలక కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోగా, ఇప్పుడు ఫ్లెమింగ్ కూడా నిష్క్రమించడంతో సీఎస్కే ఫౌండేషన్ ఎరా పూర్తిగా ముగిసినట్లయింది. రాబోయే దశాబ్ద కాలానికి జట్టును నడిపించే కొత్త కోచ్‌ను వెతకడం ఇప్పుడు యాజమాన్యానికి హిమాలయాలంత పెద్ద సవాలు కానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


