...
...
Next Story

స్టాక్ మార్కెట్ ఆరంభం: పాజిటివ్ సంకేతాలు ఇస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 275 పాయింట్లు పెరిగి 25,319 వద్ద ట్రేడవుతుండటంతో బుధవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, రికవరీ ఆశలతో ఇన్వెస్టర్లు మార్కెట్ దిశపై దృష్టి సారించారు.

Published on: Nov 11, 2026, 07:10:43 IST
Advertisement

బుధవారం నాటి ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో బోణీ కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) నిఫ్టీ 275 పాయింట్లకు పైగా (1.10 శాతం) ఎగబాకి 25,319 వద్ద ట్రేడ్ అవుతుండటమే ఇందుకు నిదర్శనం. గత సెషన్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ ముగింపు కంటే ఇది ఎగువన ఉండటం వల్ల, బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు బలమైన గ్యాప్-అప్ ప్రారంభాన్ని నమోదు చేసే అవకాశం ఉంది.

నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు
నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

మరోవైపు బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నాటి అమెరికా స్టాక్ మార్కెట్‌లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంకేతాలను గమనిస్తూ స్వదేశీ ఇన్వెస్టర్లు అడుగులు వేస్తున్నారు.

సోమవారం మార్కెట్ సరళి ఎలా ఉందంటే..

సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో భారత బెంచ్‌మార్క్ సూచీలు రోజంతా హెచ్చుతగ్గులకు లోనై చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ అంతక్రితం ముగింపు 80,999.40 పాయింట్లతో పోలిస్తే 107.25 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 81,106.65 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 58.25 పాయింట్లు (0.23 శాతం) లాభపడి 25,044.65 పాయింట్ల వద్ద నిలిచింది.

బుధవారం మార్కెట్లు తిరిగి ప్రారంభమవుతున్న వేళ ఇన్వెస్టర్లు ఆసియా ఈక్విటీల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్ సూచీలు, ముడిచమురు ధరలపై నిఘా ఉంచనున్నారు.

నిఫ్టీ 50, సెన్సెక్స్ సాంకేతిక విశ్లేషణ

"భారత ఈక్విటీ మార్కెట్లు సానుకూల ధోరణితో ముగిశాయి. నిఫ్టీ 50 సూచీ దాదాపు 90 పాయింట్ల గ్యాప్-అప్‌తో 25,076.40 వద్ద ప్రారంభమై రోజంతా పరిమిత శ్రేణిలోనే ట్రేడైంది. ఇంట్రాడేలో 24,838.75 వద్ద కనిష్ఠాన్ని, 25,084.05 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరికి 25,044.65 వద్ద ముగిసింది. కీలకమైన 25,000 స్థాయికి ఎగువన నిఫ్టీ నిలదొక్కుకోవడమే కాకుండా దినసరి క్యాండిల్‌పై లాంగ్ లోయర్ షాడోను ఏర్పరచడం దిగువ స్థాయిల్లో కొనుగోలు ఆసక్తిని సూచిస్తోంది" అని ఛాయిస్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ గుప్తా వివరించారు.

సెన్సెక్స్ విషయానికొస్తే.. ఇంట్రాడేలో 81,327.29 వద్ద గ్యాప్-అప్‌తో ప్రారంభమై 81,339.41 వద్ద గరిష్ఠాన్ని, 80,519.31 వద్ద కనిష్ఠాన్ని తాకింది. "ఇంట్రాడేలో తీవ్ర ఊగిసలాట ఉన్నప్పటికీ, 80,600–80,700 మద్దతు శ్రేణికి ఎగువన సెన్సెక్స్ నిలదొక్కుకోగలిగింది. 81,700–81,800 వద్ద తక్షణ నిరోధం ఎదురుకావచ్చు. సెన్సెక్స్ డైలీ ఆర్ఎస్ఐ 79.67 వద్ద ఓవర్‌బాట్ జోన్‌లో ఉన్నప్పటికీ ప్రధాన మద్దతు స్థాయిలు నిలబడితే బుల్లిష్ వైఖరే కొనసాగుతుంది" అని సచిన్ గుప్తా విశ్లేషించారు.

'బై ఆన్ డిప్స్' వ్యూహం మేలు

"గత కొన్ని సెషన్లుగా బలమైన ర్యాలీ తర్వాత నిఫ్టీ కొంత కన్సాలిడేషన్ దిశగా సాగుతున్నప్పటికీ, కొనుగోలుదారుల ఆసక్తి తగ్గలేదు. అందువల్ల ఇన్వెస్టర్లు 'బై ఆన్ డిప్స్' (తగ్గినప్పుడు కొనుగోలు) వ్యూహాన్ని అనుసరించవచ్చు. దిగువ స్థాయిలలో పొజిషన్లు ఉన్న ట్రేడర్లు తమ స్టాప్‌లాస్‌ను 24,800 వద్దకు పెంచుకోవచ్చు. ఎగువన 25,200 తక్షణ నిరోధక స్థాయి కాగా, 24,750–24,800 కీలకమైన సపోర్ట్ జోన్" అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ వత్సల్ భువా సూచించారు.

అమెరికా, ఆసియా మార్కెట్ల పరిస్థితి

మంగళవారం ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్లలో లాభాల స్వీకరణ నమోదైంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఒకానొక దశలో 350 పాయింట్లు నష్టపోయినప్పటికీ, చివరకు 160 పాయింట్ల నష్టంతో ముగిసింది. నాస్‌డాక్ సూచీ 0.7 శాతం తగ్గగా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 0.4 శాతం నష్టపోయింది.

ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, దక్షిణ కొరియా కాస్పీ (Kospi) సూచీ 0.49 శాతం క్షీణించగా, కాస్‌డాక్ (Kosdaq) సూచీ 2.1 శాతం మేర పడిపోయింది. మరోవైపు జపాన్ నిక్కీ 225 సూచీ 0.28 శాతం, టోపిక్స్ సూచీ 0.65 శాతం లాభపడ్డాయి. తైవాన్ తైపెక్స్ సూచీ బుధవారం ఉదయం ఏకంగా 1 శాతం పెరిగి 43,150.41 స్థాయికి చేరింది.

(గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks