న్యూ ఇయర్‌లో క్రెడిట్ స్కోరు పెంచే వ్యూహాలు: CRIF హోల్ టైమ్ డైరెక్టర్ ఇంటర్వ్యూ

నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలో CRIF High Mark క్రెడిట్ బ్యూరో హోల్ టైమ్ డైరెక్టర్ రామ్‌కుమార్ గుణశేఖరన్ వివరించారు. హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అప్పులు, వినియోగం, చెల్లింపులపై ఆయన అందించిన కీలక సూచనలు, అపోహలపై నివృత్తి ఇక్కడ చూడండి.

Published on: Dec 08, 2025 11:34 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CRIF High Mark క్రెడిట్ బ్యూరో హోల్ టైమ్ డైరెక్టర్ రామ్‌కుమార్ గుణశేఖరన్ హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో క్రెడిట్ స్కోర్ గురించి పలు కీలక సూచనలు చేశారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..

CRIF High Mark క్రెడిట్ బ్యూరో హోల్ టైమ్ డైరెక్టర్ రామ్‌కుమార్ గుణశేఖరన్
CRIF High Mark క్రెడిట్ బ్యూరో హోల్ టైమ్ డైరెక్టర్ రామ్‌కుమార్ గుణశేఖరన్

1. ఇయర్ ఎండ్‌లో క్రెడిట్ స్కోరుపై ఎందుకంత దృష్టి పెట్టాలి?

ప్రశ్న: సంవత్సరం చివరలో ఉన్నాం. ఈ సమయంలో వ్యక్తులు తమ క్రెడిట్ ప్రొఫైల్, స్కోరుపై దృష్టి పెట్టడం ఎందుకు చాలా ముఖ్యం?

రామ్‌కుమార్: ఇది అత్యంత కీలక సమయం. ఏడాది ముగింపులో ప్రజలు తమ ఆర్థిక ఆరోగ్యాన్ని.. బడ్జెట్‌, పెట్టుబడులు, అప్పులను సమీక్షించుకుంటారు. అదే సమయంలో, పండుగలు, ప్రయాణాలు, అమ్మకాల కారణంగా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అందుకే, తరువాత లోపాలను సరిదిద్దుకునే కన్నా, నియంత్రణతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను సమీక్షించడం చాలా ముఖ్యం.

అంతేకాకుండా, చాలా మంది వినియోగదారులు జనవరిలో హోమ్ లోన్స్ లేదా కార్ లోన్స్ వంటి పెద్ద రుణాల కోసం ప్రణాళిక వేసుకుంటారు. ఏడాది చివర్లో చేసే పటిష్టమైన తనిఖీ, మీ లోపాలను సరిదిద్దుకోవడానికి, ఆర్థిక ప్రవర్తనను మెరుగుపరచుకోవడానికి, జనవరిలో మెరుగైన రుణాన్ని పొందడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది.

2. క్రెడిట్ స్కోరు ప్రభావం

ప్రశ్న: రుణం పొందడం కాకుండా, క్రెడిట్ స్కోరు ఒక వ్యక్తి జీవితాన్ని, రాబోయే సంవత్సరంలో అతని ఆర్థిక అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

రామ్‌కుమార్: క్రెడిట్ స్కోరు అనేది కేవలం రుణాలకు సంబంధించిన సంఖ్య మాత్రమే కాదు. ఇది మీ రోజువారీ ఆర్థిక అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ స్కోరు ఉంటే, మీకు తక్కువ వడ్డీ రేట్లు, అధిక క్రెడిట్ పరిమితులు, అలాగే క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై వేగవంతమైన ఆమోదం లభిస్తాయి.

మెరుగైన నిబంధనలపై చర్చించడానికి, పెద్ద కొనుగోళ్లను తక్కువ ఖర్చుతో కూడిన EMIలుగా విభజించుకోవడానికి, లేదా అత్యవసర పరిస్థితుల్లో త్వరగా క్రెడిట్‌ను పొందడానికి ఇది మీకు బేరమాడే శక్తిని ఇస్తుంది. బలమైన క్రెడిట్ స్కోరు ఏడాది పొడవునా మీ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడానికి స్వేచ్ఛను, సౌలభ్యాన్ని అందిస్తుంది.

3. CRIF దృష్టిలో అపోహలు

ప్రశ్న: CRIF (క్రెడిట్ బ్యూరో) దృక్కోణం నుంచి చూస్తే, పండుగలు, ఏడాది ముగింపు గడువులు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలు సాధారణంగా చేసే పొరపాట్లు లేదా అపోహలు ఏమిటి?

రామ్‌కుమార్: అవును, సంవత్సరం ముగిసే సమయానికి, చాలా మంది తెలియకుండానే తమ క్రెడిట్ స్కోరును ప్రభావితం చేసే ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. సాధారణ అపోహలను అర్థం చేసుకుంటే, పొరపాట్లు జరగకుండా క్రెడిట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ముఖ్యంగా కనిపించే కొన్ని అపోహలు ఇవి:

  • 'ఏడాది చివరి ఖర్చు స్కోరును వెంటనే ప్రభావితం చేయదు' అనుకోవడం తప్పు: పండగ వేళల్లో మరియు సెలువులలో అధిక ఖర్చు వల్ల క్రెడిట్ వినియోగం (Credit Utilisation) బాగా పెరిగి, స్వల్పకాలంలో కూడా క్రెడిట్ స్కోరు తగ్గుతుంది.
  • 'రుణం వెంటనే చెల్లిస్తే స్కోరు భారీగా పెరుగుతుంది' అనేది పూర్తి నిజం కాదు: అప్పును పూర్తిగా చెల్లించడం ముఖ్యం, కానీ అలా చేసినంత మాత్రానా స్కోరు భారీగా పెరుగుతుందని అనుకోకూడదు. నిలకడైన చెల్లింఫులు, తక్కువ వినియోగం, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే క్రెడిట్ మిక్స్ అనేవి ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.
  • 'ఒక ఆలస్య చెల్లింపు హాని చేయదు' అని భావించడం పొరపాటు: ఒక్కసారి చెల్లింపు తప్పినా లేదా ఆలస్యమైనా మీ స్కోరుపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం మీ క్రెడిట్ చరిత్ర కాలపరిమితి, మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న రుణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
  • 'ఎక్కువ ఆదాయం ఉంటే మెరుగైన స్కోరు గ్యారెంటీ': గుర్తుంచుకోండి, ఆదాయం అనేది క్రెడిట్ స్కోరు లెక్కల్లో భాగం కాదు. అప్పుగా తీసుకున్న డబ్బును బాధ్యతాయుతంగా నిర్వహించడం, అంటే చెల్లింపు చరిత్ర, వినియోగం, క్రెడిట్ ప్రవర్తన అనేదే ముఖ్యం.
  • 'క్రెడిట్ పరిమితిని పూర్తిగా వాడినా, సకాలంలో చెల్లిస్తే ఫర్వాలేదు': సకాలంలో చెల్లించినప్పటికీ, అధిక క్రెడిట్ వినియోగం స్కోరును తగ్గిస్తుంది. నిరంతరం అధిక వినియోగం అత్యవసర సమయాల్లో ఆర్థిక నిర్వహణకు అడ్డంకిగా మారుతుంది.

4. క్రెడిట్ వినియోగం (Utilisation) – ఒకే ఒక్క కీలక చర్య

ప్రశ్న: క్రెడిట్ స్కోరుపై ఎక్కువగా ప్రభావం చూపేది క్రెడిట్ వినియోగం (Credit Utilisation) అంటున్నారు. దాన్ని సులభంగా వివరిస్తారా? అలాగే, ఏడాది ముగిసేలోపు ఈ నిష్పత్తిని తగ్గించడానికి వెంటనే తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్య ఏమిటి?

రామ్‌కుమార్: క్రెడిట్ వినియోగం అంటే, మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో మీరు ప్రస్తుతం ఎంత వాడుతున్నారు అనే నిష్పత్తి. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డ్ పరిమితి 1 లక్ష అయితే, మీరు 50,000 ఖర్చు చేస్తే, మీ వినియోగం 50 శాతంగా ఉంటుంది.

వినియోగం ఎంత తక్కువగా ఉంటే, మీ క్రెడిట్ ప్రొఫైల్ అంత మెరుగ్గా ఉంటుంది.

ఏడాది ముగిసేలోపు ఈ నిష్పత్తిని తగ్గించడానికి అత్యంత వేగవంతమైన మార్గం: మీ క్రెడిట్ కార్డ్ బిల్లులో కొంత భాగాన్ని చెల్లించడం. మీ బకాయి మొత్తాన్ని కొద్దిగా తగ్గించినా, మీ వినియోగాన్ని ఆరోగ్యకరమైన పరిధిలోకి తీసుకురావచ్చు.

5. గతంలో తప్పిన చెల్లింపును సరిదిద్దుకోవడం

ప్రశ్న: ఈ సంవత్సరం ప్రారంభంలో ఎవరైనా చెల్లింపు తప్పి ఉంటే, ఆ నష్టాన్ని ఇప్పుడు తగ్గించుకోవడానికి మీ సలహా ఏమిటి? మిగిలిన రెండు నెలలు సకాలంలో చెల్లింపులు చేయడం వల్ల మార్పు కనిపిస్తుందా?

రామ్‌కుమార్: గతంలో తప్పిన చెల్లింపు స్కోరును ప్రభావితం చేస్తుంది, కానీ మిగిలిన నెలలు మీ ప్రొఫైల్‌ను స్థిరీకరించడానికి ఇది మంచి అవకాశం.

ముఖ్యమైన విషయం (చర్య) ఏమిటంటే: రాబోయే ప్రతి చెల్లింపును తప్పకుండా సకాలంలో చేయాలి. ఎందుకంటే, ఇటీవలి ప్రవర్తనకు క్రెడిట్ స్కోరింగ్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సాధ్యమైతే, క్రెడిట్ కార్డులపై కనీస చెల్లింపు కంటే ఎక్కువ చెల్లించండి, తద్వారా మీ బకాయిలు వేగంగా తగ్గుతాయి. ఆటో-పే లేదా రిమైండర్‌లను సెట్ చేయడం వలన మరింత ఆలస్యం జరగకుండా చూసుకోవచ్చు.

గతంలో తప్పిన చెల్లింపు మీ రిపోర్టులో ఉన్నప్పటికీ, చివరి నెలల్లో నిలకడగా చెల్లింపులు చేస్తే, అది విశ్వాసాన్ని పునర్నిర్మించి, మీ స్కోరును క్రమంగా పెంచడానికి సహాయపడుతుంది.

6. రిపోర్టులో తప్పులు, తేడాలు (Discrepancies)

ప్రశ్న: వినియోగదారులు తమ క్రెడిట్ రిపోర్టును సమీక్షించేటప్పుడు, స్కోరును ప్రభావితం చేసే ఏయే రకాల లోపాలను ముఖ్యంగా వెతకాలి?

రామ్‌కుమార్: క్రెడిట్ రిపోర్ట్‌ను చూసేటప్పుడు, స్కోరును ప్రభావితం చేసే సాధారణ లోపాలను నిశితంగా పరిశీలించాలి.

  1. వ్యక్తిగత వివరాలు: మీ పేరు, PAN, చిరునామా వంటి ప్రాథమిక వివరాలతో ప్రారంభించండి. చిన్న లోపాలు కూడా సరిపోలకపోవడానికి దారితీయవచ్చు.
  2. ఖాతా స్థితి: మీరు ఇప్పటికే తీర్చిన రుణాలు ఇప్పటికీ యాక్టివ్‌గా కనిపిస్తున్నాయేమో తనిఖీ చేయండి.
  3. బకాయి మొత్తం: రిపోర్ట్‌లో ఉన్న బకాయి మొత్తానికి (మొత్తాలు) మీరు వాస్తవంగా చెల్లించాల్సిన మొత్తానికి తేడా ఉందా? అనేది చూడండి.
  4. గుర్తు తెలియనివి: ఒకే రుణానికి సంబందించిన విషయాలు పునరావృత్తం అయినా, ముఖ్యంగా మీకు సంబంధించని రుణం లేదా క్రెడిట్ కార్డు ఏమైనా వుందా అని తనిఖీ చేసుకోండి.

ఈ సమస్యలను ముందుగా గుర్తించి, ఫిర్యాదు చేయడం వలన, తదుపరి రిపోర్టింగ్ సైకిల్‌లో సరిదిద్దుబాట్లు కనిపిస్తాయి. స్కోరు పడిపోకుండా, గుర్తింపు దుర్వినియోగం కాకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది.

7. అప్పులకు ప్రాధాన్యత (Debt Prioritization)

ప్రశ్న: ఒక వినియోగదారుకు వ్యక్తిగత రుణం (Personal Loan), అధిక వడ్డీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్, EMI వంటి బహుళ అప్పులు ఉంటే, క్రెడిట్ స్కోరు మెరుగుదల కోసం బోనస్ వంటి అదనపు నిధులను ఎలా ఖర్చు చేయాలి?

రామ్‌కుమార్: బోనస్ వంటి అదనపు నిధులు వచ్చినప్పుడు, అప్పులను వ్యూహాత్మకంగా చెల్లించడం వలన క్రెడిట్ ప్రొఫైల్ బలపడుతుంది.

ప్రారంభించడానికి అత్యంత ప్రభావవంతమైన స్థానం: అధిక వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు. ఇవి మీ వినియోగం, మొత్తం రుణ ఖర్చు రెండింటినీ నేరుగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత, గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న ఏదైనా రుణంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే చెల్లింపులు తప్పడం ఇతర అంశాల కంటే స్కోరును ఎక్కువగా దెబ్బతీస్తుంది. మీ బడ్జెట్ అనుమతిస్తే, ఒక చిన్న రుణాన్ని పూర్తిగా చెల్లించడం కూడా సహాయపడుతుంది.

ఈ క్రమంలో అప్పులను నిర్వహించడం, ఒక లక్ష్యంతో కూడిన 'క్లీన్-అప్' లాగా పనిచేస్తుంది, కొత్త సంవత్సరానికి ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ఇస్తుంది.

8. కొత్త కార్డులు, ఎంక్వైరీల ప్రభావం

ప్రశ్న: సెలవుల షాపింగ్ సమయంలో, డిస్కౌంట్‌ల కోసం చాలా మంది కొత్త క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తారు. హార్డ్ ఎంక్వైరీల ప్రభావంపై మీ సలహా ఏమిటి? కొత్త ఏడాది వరకు కొత్త క్రెడిట్‌ను తీసుకోకుండా ఆపాలా?

రామ్‌కుమార్: సెలవులు మరియు పండగ సమయాల్లో, కొత్త క్రెడిట్ కార్డుల దరఖాస్తులు పెంచుకోవడానికి ఫైనాన్స్ కంపెనీలు లేదా బ్యాంకులు వినియోగదారులను వివిధ ఆఫర్లతో ప్రేరేపిస్తాయి. కానీ దాని ప్రభావం అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రతి కొత్త దరఖాస్తు హార్డ్ ఎంక్వైరీని సృష్టిస్తుంది. తక్కువ సమయంలో ఎంక్వైరీల సంఖ్య అధికంగా ఉంటే, అది మీ క్రెడిట్ స్కోరును ప్రభావితం చేయవచ్చు.

కొత్త కార్డు మీకు నిజంగా అవసరం, బాధ్యతాయుతంగా ఉపయోగిస్తామని అనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కేవలం స్వల్పకాలిక డిస్కౌంట్ కోసం మాత్రమే అయితే, మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించడం తెలివైన పని.

9. కొత్త ఏడాదికి బలమైన పునాది

ప్రశ్న: క్రెడిట్ స్కోరు అనేది ఒక ప్రయాణం. ఏడాది ముగింపు సమీక్ష ద్వారా బలమైన ఆర్థిక పునాదితో కొత్త సంవత్సరం ప్రారంభించడానికి మీరు ఇచ్చే ఒక్క సలహా ఏమిటి?

రామ్‌కుమార్: ప్రతి నెలా క్రెడిట్ హెల్త్ రొటీన్‌ను పాటించండి. ప్రతి నెలా పది నిమిషాలు మీ క్రెడిట్ రిపోర్ట్, వినియోగం, రాబోయే చెల్లింపులను తనిఖీ చేయడానికి కేటాయించండి. ఈ చిన్న అలవాటు లోపాలను నివారిస్తుంది. క్రెడిట్ ఆరోగ్యం అనేది నిరంతర పర్యవేక్షణ, సకాలంలో చర్య తీసుకోవడం ద్వారా మాత్రమే పటిష్టం అవుతుంది.

10. జనవరి 1st లోపు పాటించాల్సిన 3 ముఖ్యమైన క్రెడిట్ టిప్స్

ప్రశ్న: జనవరి 1వ తేదీలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవలసిన, అత్యంత ముఖ్యమైన, టాప్ 3 క్రెడిట్ చిట్కాలు ఏమిటో చివరగా మా పాఠకులతో పంచుకోండి.

రామ్‌కుమార్: చిన్న, వ్యూహాత్మక చర్యలతో సంవత్సరాన్ని ముగించడం వలన, రాబోయే సంవత్సరానికి మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేయవచ్చు.

  1. క్రెడిట్ వినియోగాన్ని చురుకుగా ప్లాన్ చేయండి: కేవలం బ్యాలెన్స్‌లను తగ్గించడం మాత్రమే కాకుండా, ముందుగానే చెల్లింపులకు బడ్జెట్ చేసి, ఖర్చులను అంచెలంచెలుగా చేస్తూ, వినియోగాన్ని స్థిరంగా 30 శాతం కంటే తక్కువగా ఉంచండి.
  2. చెల్లింపు దినచర్యను సెట్ చేయండి: EMIలు, కార్డ్ చెల్లింపుల కోసం ఆటోమేషన్ సెటప్ చేయండి. సకాలంలో చెల్లింపుల పరంపర మీ స్కోరుపై సానుకూల ప్రభావం చూపుతుంది.
  3. ఖాతాలను వ్యూహాత్మకంగా నిర్వహించండి: మీ క్రెడిట్ మిక్స్‌ను సమీక్షించండి, ఉపయోగించని అధిక-ఖర్చు ఖాతాలను జాగ్రత్తగా తీర్చడాన్ని పరిగణించండి. అన్ని రుణాలు ట్రాక్‌లో ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇది కొత్త సంవత్సరంలో కొత్త రుణ అవకాశాల కోసం మీ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తుంది.
  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More