సుందర్ పిచాయ్‌కు చుక్కెదురు.. స్టాన్‌ఫర్డ్ విద్యార్థుల వాకౌట్

స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు నిరసన సెగ తగిలింది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్ కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వందకు పైగా విద్యార్థులు ఆయన ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు.

Published on: Jun 15, 2026, 08:29:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ 2026 స్నాతకోత్సవంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగం ప్రారంభించడానికి వేదికపైకి రాగానే విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్ కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని తప్పుబడుతూ వంద మందికి పైగా విద్యార్థులు తమ సీట్లలోంచి లేచి బయటకు నడిచారు.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Getty Images via AFP)
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Getty Images via AFP)

'ప్రాజెక్ట్ నింబస్' పై నిరసనల సెగ

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. సుందర్ పిచాయ్ డయాస్ పైకి రాగానే స్టాన్‌ఫర్డ్ స్టేడియంలో కూర్చున్న విద్యార్థుల్లో ఒక వర్గం ఒక్కసారిగా లేచి నిలబడింది. "ఫ్రీ, ఫ్రీ పాలస్తీనా" అంటూ నినాదాలు చేస్తూ వారు వేడుకను బహిష్కరించారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వానికి గూగుల్, అమెజాన్ సంస్థలు సంయుక్తంగా అందిస్తున్న $1.2 బిలియన్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాంట్రాక్ట్ 'ప్రాజెక్ట్ నింబస్'కు వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది. గాజాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ సైనిక చర్యలకు ఈ ప్రాజెక్టు సహకరిస్తోందని 'స్టాన్‌ఫర్డ్ స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా' ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ వాకౌట్ గురించి వారు కొన్ని వారాల ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

ప్రసంగంలో 'AI' ఊసే ఎత్తని పిచాయ్

ఈ ఏడాది వివిధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో జరిగిన ముగింపు వేడుకల్లో సాంకేతిక రంగ ప్రముఖులు 'AI' గురించి మాట్లాడినప్పుడు విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కాబోలు, సుందర్ పిచాయ్ తన కీనోట్ ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తావనే తీసుకోలేదు. దానికి బదులుగా ఆయన "ఆశావాదం" (Optimism) అనే అంశంపై మాట్లాడారు.

"ఎల్లప్పుడూ ఆశావాదాన్ని ఎంచుకోండి. రోజూ వార్తలు చూసినప్పుడు మనం అత్యంత సవాలుతో కూడిన కాలంలో జీవిస్తున్నామనే భావన కలగడం సహజం. కానీ ప్రతి తరం తమదైన రీతిలో కష్టాలను ఎదుర్కొందని గుర్తుంచుకోవడం అవసరం. మనం ఎలాంటి పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసి సమాజంలోకి అడుగుపెడుతున్నామనేది మన చేతుల్లో లేదు, కానీ ఆ పరిస్థితులను మనం ఎలా స్వీకరిస్తున్నామనేదే ముఖ్యం" అని పిచాయ్ విద్యార్థులకు హితబోధ చేశారు.

స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోనే ఎమ్మెస్ (MS) పూర్తి చేసిన పిచాయ్, తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విద్యా రంగం కంటే కార్పొరేట్ రంగాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో వివరించారు.

స్పందించని గూగుల్ బాస్

స్నాతకోత్సవం ముగిసిన తర్వాత స్టాన్‌ఫర్డ్ స్టేడియం నుండి బయటకు వస్తున్న సుందర్ పిచాయ్‌ను బీబీసీ (BBC) జర్నలిస్ట్ లిల్లీ జమాలీ పలకరించారు. విద్యార్థుల నిరసనపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా, పిచాయ్ ఏమాత్రం స్పందించకుండా ముఖం తిప్పుకుని ముందుకు సాగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More