జంక్ ఫుడ్‌పై రెడ్ లేబుల్స్: FSSAIకి సుప్రీం కోర్ట్ 13 ప్రశ్నలు

ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై 'అధిక చక్కెర', 'అధిక ఉప్పు' వంటి హెచ్చరిక లేబుల్స్ ఏర్పాటుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించిన ఎరుపు రంగు షడ్భుజి (Red-Hexagon) లేబుళ్ల శాస్త్రీయత, రూపకల్పన, అమలు గడువులపై 13 అంశాలతో స్పష్టతకు ఆదేశించింది.

Published on: Sep 12, 2026, 07:48:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనం నిత్యం కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై ఇకపై 'అధిక చక్కెర', 'అధిక ఉప్పు', 'అధిక కొవ్వు' అనే హెచ్చరిక సంకేతాలు ప్రత్యక్షం కానున్నాయి. అయితే ఈ నిబంధనలు మార్కెట్లోకి రావడానికి ముందే కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI)కు అత్యున్నత న్యాయస్థానంలో పరీక్ష ఎదురైంది. ఈ లేబులింగ్ విధానం రూపకల్పన, రంగుల ఎంపిక, శాస్త్రీయ ప్రాతిపదికపై వివరణ ఇవ్వాలని కోరుతూ జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి 13 సూటి ప్రశ్నలు వేసింది.

జంక్ ఫుడ్‌పై రెడ్ లేబుల్స్: FSSAIకి సుప్రీం కోర్ట్ 13 ప్రశ్నలు
జంక్ ఫుడ్‌పై రెడ్ లేబుల్స్: FSSAIకి సుప్రీం కోర్ట్ 13 ప్రశ్నలు

సెప్టెంబర్ 10న ఇచ్చిన ఈ ఉత్తర్వుల్లో 10 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 28న జరగనుంది.

అసలు ఏమిటీ వివాదం?

కేరళకు చెందిన '3ఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ 2024లో వేసిన ప్రజాప్రయోజన పిటిషన్ (PIL) ఆధారంగా ఈ విచారణ సాగుతోంది. చిప్స్, బిస్కెట్లు, శీతల పానీయాల కవర్ల వెనుక భాగంలో ఉండే చిన్న అక్షరాల పోషకాల వివరాలను చదవడం సామాన్యులకు కష్టం. అందుకే ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరిక గుర్తులు (Front-of-Pack Warning Labels) ముద్రించాలని పిటిషనర్ కోరారు.

రాజ్యాంగం అందించిన ఆరోగ్య హక్కులో భాగమైన ఈ అంశంపై, ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన నిబంధనలు తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 13న ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన ముసాయిదా ప్రతిపాదనలను కోర్టుకు సమర్పించింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదించిన నియమాలేంటి?

ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ (ICMR-NIN) 2024 మార్గదర్శకాల ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. దీని ప్రకారం అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలతో పాటు అధికంగా తీపి ఉన్న శీతల పానీయాలపై 'ఎరుపు రంగు షడ్భుజి' (Red-Hexagon) హెచ్చరిక గుర్తును ఉంచాలి.

ఈ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు.

మొదటి దశ: రెండు లేదా అంతకంటే ఎక్కువ హానికర పదార్థాలు అధికంగా ఉండే ఉత్పత్తులు, తీపి పానీయాలపై ఈ లేబుల్ ముద్రిస్తారు.

రెండవ దశ: ఒకే ఒక్క హానికర పదార్థం ఎక్కువగా ఉన్నా ఎరుపు గుర్తు తప్పనిసరి అవుతుంది. ఈ హెచ్చరిక అక్షరాల పరిమాణం, వెనుక ఉండే పోషకాల పట్టిక ఫాంట్ కన్నా కనీసం ఒక పాయింట్ పెద్దదిగా ఉండాలి.

సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలివే

సుప్రీం కోర్ట్ ఈ ప్రతిపాదనను తిరస్కరించలేదు, అలా అని పూర్తిగా అంగీకరించలేదు. అమలు విధానంపై స్పష్టత కోసం 13 కీలక విషయాలపై ప్రశ్నలు గుప్పించింది. వాటిలో కొన్ని ఇక్కడ చూడొచ్చు.

  • రెండు దశల అమలుకు గల శాస్త్రీయ కారణాలేమిటి?
  • మొదట రెండు కంటే ఎక్కువ పదార్థాలు ఉన్నవాటికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు?
  • ఏయే పానీయాలు, ఆహార వర్గాలు దీని పరిధిలోకి వస్తాయి?
  • ప్రాసెసింగ్ స్థాయిని బట్టి ఈ పరిమితులు మారుతాయా?
  • చక్కెర, సంతృప్త కొవ్వు (Saturated Fat), ట్రాన్స్ ఫ్యాట్‌లను ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు?
  • హెచ్చరిక సైజు, ఎరుపు రంగు వాడకం, బొమ్మల గుర్తుల (Pictorial Symbols) వినియోగంపై స్పష్టత ఏమిటి?
  • విడివిడిగా హెచ్చరికలు ఇవ్వాలా లేదా ఉమ్మడిగా ఇవ్వాలా?
  • కంపెనీలు హెచ్చరిక ముద్ర పడకుండా ఉండటానికి ఆహార సూత్రీకరణలు (Reformulation) మారిస్తే, కృత్రిమ అడిటివ్స్ వాడకం పెరుగుతుందా?
  • నిబంధనల అమలుకు కంపెనీలకు ఎంత సమయం ఇస్తారు?
  • పాఠశాలల ద్వారా పిల్లలు, వినియోగదారులలో పోషకాహార అవగాహన పెంచేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలేమిటి?

ఫుడ్ కంపెనీలపై పడనున్న ప్రభావం

సుప్రీం కోర్ట్ ప్రశ్నించిన తీరు భారత ఆహార రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

"సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నల వల్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తమ ప్రతిపాదనలకు పక్కా శాస్త్రీయ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేదంటే తమ నిబంధనలను పునఃసమీక్షించుకోవాల్సి వస్తుంది," అని కొచ్చర్ అండ్ కో భాగస్వామి శివ్ సప్రా పేర్కొన్నారు.

మరొక న్యాయ నిపుణుడు, సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ పార్ట్నర్ బిప్లబ్ లెనిన్ స్పందిస్తూ, "కోర్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నియంత్రణ అధికారాలను ప్రశ్నించడం లేదు. కానీ నిర్ణయాలు ఎంతవరకు శాస్త్రీయమైనవో విశ్లేషిస్తోంది. దీనివల్ల కంపెనీలు తమ ఆహార వంటకాలను (Recipes) మార్చి, ప్యాకేజింగ్ సవరించక తప్పదు" అని విశ్లేషించారు.

పరిశ్రమలపై ఆర్థిక భారం ఎంత?

లేబులింగ్ నిబంధనలు మారితే ప్యాకేజింగ్ రీడిజైన్, లాబొరేటరీ టెస్టింగ్, రెగ్యులేటరీ ఆమోదాల వల్ల కంపెనీల వ్యయం పెరుగుతుంది.

"కంపెనీల ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను బట్టి ఖర్చులు మారుతాయి. ఉత్పత్తులను రీఫార్ములేట్ చేయడం, ల్యాబ్ టెస్టింగ్‌లు నిర్వహించడం, ప్యాకేజింగ్ ఇన్వెంటరీని మార్చడం పెద్ద కంపెనీలకు సుదీర్ఘమైన ప్రక్రియ కాగా, చిన్న తయారీదారులకు ఆర్థికంగా మరింత భారంగా మారుతుంది" అని ఈక్వినాక్స్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈఓ అశ్విన్ భద్రీ వివరించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More