పెళ్లి చేసుకున్నాడని 'రేప్' కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు.. కానీ ఒక కండిషన్
మైనర్‌పై అత్యాచారం కేసులో 10 ఏళ్ల శిక్ష పడిన వ్యక్తికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. బాధితురాలినే పెళ్లి చేసుకుని, ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఉంటున్నందున ఆర్టికల్ 142 కింద శిక్షను రద్దు చేసింది. అయితే, భార్యను వదిలేస్తే మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కోర్టు గట్టిగా హెచ్చరించింది.
అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష.. కానీ ఇప్పుడు ఆ శిక్ష రద్దయింది. దీనికి కారణం నిందితుడు బాధితురాలినే వివాహం చేసుకోవడం. భారత రాజ్యాంగం కల్పించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు వెలువరించింది. అయితే, ఈ విముక్తికి ఒక బలమైన నిబంధనను కూడా కోర్టు విధించింది.

ఏమిటీ కేసు? నేపథ్యం ఏంటి?
ఈ కేసు ఒక ప్రేమ వ్యవహారం నుండి మొదలైంది. నిందితుడు, ఒక బాలిక మధ్య సంబంధం ఉన్న సమయంలో ఆమె మైనర్. ఈ క్రమంలో అతనిపై ఐపీసీ సెక్షన్ 376(2)(n) (అత్యాచారం), పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదైంది. ఒడిశాలోని జైపూర్ ట్రయల్ కోర్టు అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది.
దీనిపై అతను ఒడిశా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, శిక్షపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కేవలం పరిమిత కాలానికి మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది.
మలుపు తిప్పిన పెళ్లి.. కోర్టు ఏమన్నదంటే?
కేసు విచారణలో ఉండగానే, 2019 డిసెంబర్‌లో నిందితుడు సదరు బాధితురాలినే పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటున్నారని, ఆమెను అతను బాగా చూసుకుంటున్నాడని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 (Article 142) ప్రకారం తమకున్న విశేషాధికారాలను ఉపయోగించి, అతనికి పడిన శిక్షను రద్దు చేస్తూ అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.
"కేసు తీవ్రత దృష్ట్యా, అనంతరం జరిగిన పరిణామాలను (వివాహం) పరిగణనలోకి తీసుకుని 'పూర్తి న్యాయం' (Complete Justice) చేసేందుకు ఆర్టికల్ 142ను ఉపయోగిస్తున్నాం" అని ధర్మాసనం పేర్కొంది.
ఒక్క కండిషన్.. వదిలేస్తే మళ్లీ ఊచల లెక్కించడమే
ఈ ఉపశమనం కేవలం షరతులతో కూడుకున్నదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ భర్త తన భార్యను వేధించినా లేదా ఆమెను వదిలేసి వెళ్ళిపోయినా (Desertion), ఇప్పుడు రద్దు చేసిన పాత శిక్షలన్నీ మళ్ళీ అమల్లోకి వస్తాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
"అతను తన భార్యతో సత్సంబంధాలను కొనసాగించాలి, ఆమెను విడిచిపెట్టకూడదు. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే, ప్రతి స్థాయిలోనూ అతనిపై క్రిమినల్ చర్యలు మళ్ళీ ప్రారంభమవుతాయి" అని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
సాధారణంగా పోక్సో కేసుల్లో రాజీకి తావుండదు, కానీ కుటుంబం విచ్ఛిన్నం కాకూడదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇక్కడ మానవీయ కోణంలో ఈ తీర్పునిచ్చినట్లు కనిపిస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ఆర్టికల్ 142 అంటే ఏమిటి?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు ఏదైనా కేసులో 'పూర్తి న్యాయం' చేయడానికి తన పరిధిలో అసాధారణ ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ఇది ఇతర చట్టాలకు అతీతంగా పని చేసే అధికారం.
2. పెళ్లి చేసుకుంటే రేప్ కేసు రద్దవుతుందా?
రద్దు కాదు. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బాధితురాలు, నిందితుడు కలిసి ఉండాలని కోరుకున్నప్పుడు లేదా పెళ్లి చేసుకున్నప్పుడు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు తన విశేషాధికారాలను వాడుతుంది.
3. నిందితుడు భార్యను వదిలేస్తే ఏమవుతుంది?
సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినట్లు, ఒకవేళ అతను భార్యను వదిలేస్తే లేదా సరిగ్గా చూసుకోకపోతే, అతనికి పడిన పాత 10 ఏళ్ల శిక్ష మళ్ళీ అమల్లోకి వస్తుంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper












