అనుమతి లేకుండా కోర్టు విచారణ రికార్డింగ్‌ల పోస్టింగ్‌పై సుప్రీంకోర్టు నిషేధం
ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియాలో లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆంక్షలు విధించింది. అయితే ఈ ఉత్తర్వులు వార్తా సేకరణపై ఎలాంటి ప్రభావం చూపవని ధర్మాసనం స్పష్టం చేసింది.
కోర్టు విచారణల వీడియోలను క్లిప్ చేసి, ఎడిట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వినోదం కోసం ఉపయోగించడం, వాటి ద్వారా ఆదాయం పొందడం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతి లేకుండా న్యాయస్థానాల ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియా లేదా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయడం, రీ-పోస్ట్ చేయడం లేదా ప్రచారం చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.
"సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ లేదా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా న్యాయపరమైన విచారణల ఆడియో/వీడియో రికార్డింగ్‌లను ఎలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఎక్స్‌ట్రాక్ట్ చేయడం, సవరించడం, పోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం లేదా వాటి ద్వారా ఆదాయం పొందే ప్రయత్నం చేయడం నిషేధించడమైనది" అని ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే, ఈ నిషేధ ఉత్తర్వులు జర్నలిస్టులు జరిపే సాధారణ వార్తా సేకరణకు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది.
కోర్టులు వినోద ఛానెళ్లు కావు: సుప్రీంకోర్టు
జర్నలిస్ట్ హర్షితా గ్రోవర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్ (PIL) విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ, కోర్టు విచారణల్లోని కొన్ని భాగాలను మాత్రమే కట్ చేసి వైరల్ చేయడం ద్వారా న్యాయవ్యవస్థను ప్రజల ముందు నవ్వులపాలు చేస్తున్నారని తెలిపారు.
ఈ వాదనతో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏకీభవించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ఉపయోగించి న్యాయమూర్తులు, న్యాయవాదుల స్వరాలను, పెదవుల కదలికలను మార్చివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విచారణ సందర్భంగా జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. "డిజిటల్ ప్రపంచంలో డేటాను నియంత్రించడం అతిపెద్ద సవాలుగా మారింది. లైవ్ స్ట్రీమింగ్‌ను పరిమితం చేయాలి. న్యాయస్థానాలు 24 గంటలూ ప్రసారమయ్యే వినోద ఛానెళ్లు కావు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రం, సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని హైకోర్టులకు, మెటా (Meta), ఎక్స్ (X) వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్ పరిపరిష్కారానికి సంబంధించి ఏ నోడల్ మంత్రిత్వ శాఖలు పనిచేయాలో వివరిస్తూ ఒక ప్రతిపాదనను కోర్టు ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ప్రత్యక్ష ప్రసారాల (Live-streaming) నిబంధనల అమలు, వాటి వల్ల కలుగుతున్న ప్రభావంపై నివేదికలు ఇవ్వాలని హైకోర్టులను ఆదేశించింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


