మోటారు వాహనాల చట్టం పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

మోటారు వాహనాల చట్టం, 1988 కింద పరిహారం పొందేందుకు కేవలం ఒక వాహనం ఘటనల వరుసక్రమంలో భాగమైతే సరిపోదని, మరణానికి లేదా గాయపడటానికి, ఆ వాహన వినియోగానికి మధ్య స్పష్టమైన ప్రత్యక్ష సంబంధం ఉంటేనే పరిహారం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

Published on: Jul 27, 2026, 16:12:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మోటారు వాహనాల ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రమాదం లేదా మరణం సంభవించిన క్రమంలో ఒక వాహనం కేవలం అక్కడ ఉందనో లేదా ప్రయాణించారనో కారణంతో యజమాని లేదా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act) కింద పరిహారం డిమాండ్ చేయలేరని తేల్చిచెప్పింది.

మోటారు వాహనాల చట్టం పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
మోటారు వాహనాల చట్టం పరిహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దిలీప్ అగర్వాల్ వర్సెస్ రాజ్శ్రీ అగర్వాల్ కేసులో జూలై 22న ఈ తీర్పును వెలువరించింది.

కేసు పూర్వాపరాలు

2009 నవంబర్ 29న ఆనంద్ అనే వ్యక్తి దిలీప్ అగర్వాల్ నడుపుతున్న కారులో ప్రయాణిస్తూ చివరిసారిగా కనిపించాడు. మూడు రోజుల తర్వాత ఆనంద్ మృతదేహం లభ్యమైంది. అతడిని కారులోనే హత్య చేశారని ఆరోపిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 కింద పరిహారం కోసం మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT)ని ఆశ్రయించారు.

MACT తీర్పు: ఆనంద్ కుటుంబానికి 5.64 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పు: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఈ తీర్పును సమర్థిస్తూ పరిహారాన్ని దాదాపు 8.61 లక్షలకు పెంచింది.

ఈ తీర్పులపై సుప్రీంకోర్టులో సవాలు చేయగా, సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేసింది.

కేవలం వాహనం ఉంటే పరిహారం రాదు: సుప్రీంకోర్టు

"మోటారు వాహనం వినియోగం వల్ల తలెత్తిన ఘటన" (Arising out of the use of a motor vehicle) అనే పదానికి, సదరు మరణానికి వాహనానికి మధ్య ప్రత్యక్ష సాక్ష్యాధారాల సంబంధం ఉండాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

"ఘటనల వరుసక్రమంలో ఒక వాహనం భాగంగా ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్‌గా వాహన యజమాని లేదా ఇన్సూరెన్స్ కంపెనీపై మోటారు వాహనాల చట్టం ప్రకారం బాధ్యత మోపలేం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆనంద్ కారులోనే మరణించాడని చెప్పడానికి ఎటువంటి ఫోరెన్సిక్ సాక్ష్యాలు (రక్తపు మరకలు, వెంట్రుకలు, చర్మ కణాలు) లభించలేదని, అలాగే వాహనం ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని కోర్టు గుర్తుచేసింది. క్రిమినల్ కేసులో కూడా నిందితుడిని హైకోర్టు ఇప్పటికే నిర్దోషిగా విడుదల చేసిందని వివరించింది.

రీటా దేవి కేసు తీర్పుతో పోలిక

గతంలో రీటా దేవి వర్సెస్ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (2000) కేసులో ఇచ్చి సంచలన తీర్పును ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. రీటా దేవి కేసులో కారును దొంగిలించే క్రమంలో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. అక్కడ నేరానికి, వాహనానికి నేరుగా సంబంధం ఉంది. కానీ ప్రస్తుత ఆనంద్ కేసులో కారులో ప్రయాణించాడనేది తప్ప, మరణానికి కారు వినియోగానికి ఎటువంటి సంబంధం నిరూపితం కాలేదు.

మానవతా కోణంలో ఆదేశం

అయితే, కేసు ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, తీర్పును రద్దు చేసినప్పటికీ, ఇప్పటికే మృతుడి కుటుంబానికి చెల్లించిన పరిహారాన్ని వారి వద్ద నుంచి తిరిగి వసూలు చేయకూడదని (Non-recovery) స్పష్టం చేసింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More