మోటార్ ఇన్సూరెన్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాహనదారులకు కీలక ఆదేశాలు
సింగరాయకొండలో జరిగిన రోడ్డు ప్రమాద కేసుపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో 56 శాతం వాహనాలకు ఇన్సూరెన్స్ లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ, బీమా నిబంధనలు బలోపేతం చేసేలా సంచలన మార్గదర్శకాలు జారీ చేసింది.
1996లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత దేశంలోని కోట్ల మంది వాహనదారుల భద్రతకు కొత్త దిశ చూపిస్తోంది. టీ. రాము అనే వ్యక్తికి సంబంధించిన ₹10 లక్షల పరిహారం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, భారత మోటార్ ఇన్సూరెన్స్ వ్యవస్థలోని తీవ్ర లోపాలను ఎండగట్టింది.

కేసు పూర్వాపరాలు
సింగరాయకొండ సమీపంలో రాము తన మారుతి 800 కారులో వెళ్తుండగా గుర్తుతెలియని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ లారీ చిరునామా లభించలేదు. తీవ్రంగా గాయపడిన రాము ఆ తర్వాత మరణించారు. లారీ డ్రైవర్ ఆచూకీ దొరక్కపోవడంతో, బాధితుడి కుటుంబం తమ సొంత కారు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచే నష్టపరిహారం కోరింది.
అయితే, వాహన యజమాని తన సొంత పాలసీకి 'థర్డ్ పార్టీ' కాడని, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కోసం విడిగా ప్రిమియం చెల్లించలేదని పేర్కొంటూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఈ క్లెయిమ్‌ను తోసిపుచ్చింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయాన్ని తిరగరాసింది. కాంప్రహెన్సివ్ పాలసీ వాహనంలో ఉన్న ప్రయాణికులతో పాటు యజమానికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేస్తూ.. ₹10,00,500 పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. తాజాగా ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
దేశంలో 56 శాతం వాహనాలకు బీమా లేదు
ఈ కేసు కేవలం ఒక కుటుంబ పరిహారానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశంలో ఉన్న 30.48 కోట్ల వాహనాల్లో దాదాపు 16.54 కోట్ల వాహనాలకు (సుమారు 56 శాతం) ఎలాంటి ఇన్సూరెన్స్ లేదని సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. చట్ట ప్రకారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నిర్బంధమైనప్పటికీ, అమలులో తీవ్ర అలసత్వం ఉందనే నిజాన్ని ఈ గణాంకాలు బట్టబయలు చేశాయి.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా 2024' నివేదిక ప్రకారం, 2024లో దేశంలో 4,87,707 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,77,175 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే రోజుకు సగటున 485 మంది మరణిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు సరైన పరిహారం అందాలంటే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ బీమా అత్యవసరం.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అత్యున్నత న్యాయస్థానం పలు విప్లవాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.
- కొత్తగా కొనుగోలు చేసే కార్లకు నిర్బంధ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వ్యవధిని 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలి.
- కొత్త ద్విచక్ర వాహనాలకు థర్డ్ పార్టీ బీమా కాలపరిమితిని 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పెంచాలి.
- 'వాహన్' (VAHAN) డేటాబేస్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్ (ANPR) కెమెరాల వ్యవస్థతో ఇన్సూరెన్స్ సమాచారాన్ని అనుసంధానించాలి.
- ఇంధనం కొనుగోలు చేసే సమయంలో ఇన్సూరెన్స్ చెల్లుబాటును తనిఖీ చేసేలా పైలట్ ప్రాజెక్ట్ పరిశీలించాలి.
- వాహన కొనుగోలు సమయంలో వినియోగదారులకు ఐచ్ఛిక, నిర్బంధ కవర్ల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించే సమాచార పత్రాన్ని (Information Sheet) అందించాలి.
అంతర్జాతీయ పాఠాలు
బ్రిటన్, సింగపూర్, జపాన్ వంటి దేశాలు వాహన నిబంధనలతో ఇన్సూరెన్స్‌ను అనుసంధానించాయి. బ్రిటన్‌లో వాహన రిజిస్ట్రేషన్ రికార్డులను మోటార్ ఇన్సూరెన్స్ డేటాబేస్‌తో నిరంతరం సరిపోలుస్తారు. పోలీసు తనిఖీలు లేకుండానే ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించే వ్యవస్థ అక్కడుంది. సింగపూర్‌లో రోడ్డు టాక్స్ పునరుద్ధరణకు ఇన్సూరెన్స్ తప్పనిసరి. జపాన్‌లోనూ తనిఖీల సమయంలో బీమాను సరి చూస్తారు. భారతదేశంలోనూ ఇన్సూరెన్స్‌ను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, రోజువారీ వాహన నిర్వహణ వ్యవస్థలో భాగం చేయాల్సిన అవసరం ఉంది.
పాలసీలపై స్పష్టత లోపం
చాలామంది వాహనదారులు తమ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ రకంపై సరైన అవగాహన కలిగి ఉండటం లేదు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఎదుటివారికి జరిగే నష్టానికి మాత్రమే రక్షణ ఇస్తుంది. సొంత వాహన నష్టానికి (Own Damage) ఇది వర్తించదు. రాము కేసులో కూడా కాంప్రహెన్సివ్ పాలసీ ఉంటే యజమానికి రక్షణ ఉంటుందని కుటుంబం భావించింది. సుదీర్ఘకాలం ఉండే థర్డ్ పార్టీ కవర్ వల్ల తమకు పూర్తి బీమా ఉందనే భ్రమలో వాహనదారులు ఉండే అవకాశం ఉంది. అందుకే పాలసీదారులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది.
సింగరాయకొండలో మొదలైన ఒక కుటుంబ న్యాయపోరాటం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్ల మంది వాహనదారులకు భద్రత కల్పించే వ్యవస్థాగత మార్పులకు బాటలు వేసింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న 1: కొత్త వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వ్యవధిని సుప్రీంకోర్టు ఎంతకు పెంచింది?
జవాబు: కొత్త కార్లకు థర్డ్ పార్టీ బీమా వ్యవధిని 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు, ద్విచక్ర వాహనాలకు 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రశ్న 2: థర్డ్ పార్టీ బీమాకు, ఓన్ డ్యామేజ్ కవర్‌కు తేడా ఏమిటి?
జవాబు: థర్డ్ పార్టీ బీమా మన వాహనం వల్ల ఇతరులకు కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లిస్తుంది. ఓన్ డ్యామేజ్ కవర్ అనేది మన సొంత వాహనానికి జరిగే నష్టాన్ని కవర్ చేస్తుంది.
ప్రశ్న 3: భారతదేశంలో ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఎంత శాతం ఉన్నాయి?
జవాబు: సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారం దేశంలోని 30.48 కోట్ల వాహనాల్లో దాదాపు 16.54 కోట్ల వాహనాలకు (56 శాతం) చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేదు.
ప్రశ్న 4: ఇన్సూరెన్స్ తనిఖీ కోసం కోర్టు ఎలాంటి సాంకేతికతను సూచించింది?
జవాబు: వాహన్ (VAHAN) డేటాబేస్‌ను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్ (ANPR) వ్యవస్థతో అనుసంధానించి, తనిఖీలు లేకుండానే ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించాలని సూచించింది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


