సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, ఈసీలకు నోటీసులు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఇతర కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై వారంలోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

Published on: Oct 5, 2026, 13:44:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కేంద్ర ఎన్నికల సంఘంలో (ఈసీ) నిర్ణయాల ప్రక్రియ, సీఈసీ వైఖరిపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పట్ల అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ప్రమేయం లేకుండా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. ఒక వారంలోగా తమ సమాధానం తెలియజేయాలని ఆదేశించింది.

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, ఈసీలకు నోటీసులు
సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, ఈసీలకు నోటీసులు

ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ వాదనలు వినిపించారు.

"ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలు ఏకగ్రీవంగా కానీ లేదా మెజారిటీ అభిప్రాయంతో కానీ ఉండాలి. సాధారణంగా అన్ని నిర్ణయాలు అలాగే జరుగుతాయని మేము భావిస్తున్నాం" అని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పిటిషన్‌లోని ప్రధాన విజ్ఞప్తులు

పాట్నాకు చెందిన రాకేష్ కుమార్ సింగ్ ఈ పిల్ దాఖలు చేశారు. చట్టబద్ధంగా ఎన్నికల సంఘం మొత్తానికి ఉండే అధికారాలను సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఒక్కరే చెలాయిస్తున్నారా అనే విషయాన్ని తేల్చాలని కోరారు. ఒకవేళ అది నిజమైతే ఆయన తీసుకున్న నిర్ణయాలను అనధికారికమైనవిగా ప్రకటించి తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

ఈ కేసుపై తుది విచారణ పూర్తయ్యే వరకు జ్ఞానేష్ కుమార్ సీఈసీగా విధులు నిర్వహించకుండా నిరోధించాలని పిటిషనర్ కోరారు. ఆ సమయంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల ఏకగ్రీవ నిర్ణయాలతో ఈసీ కార్యకలాపాలు సాగేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సీఈసీ పదవి ఖాళీ అయితే, సీజేఐ సభ్యుడిగా ఉండే కమిటీ సిఫార్సుల మేరకు నూతన నియామకం జరగాలని పేర్కొన్నారు.

14 సార్లు అభ్యంతరాలు.. రికార్డుల నమోదు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ఉత్తర్వులపై తమకు ముందస్తు సమాచారం లేదని, తమ సిఫార్సులు లేకుండానే ఆదేశాలు ఇచ్చారని కమిషనర్లు సుఖ్‌‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గడిచిన 10 నెలల్లో దాదాపు 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.

అయితే ఈ అంశంపై ఎన్నికల సంఘం వివరణ ఇస్తూ.. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలలో వేర్వేరు అభిప్రాయాలు ఉండటం సహజమని, తమ ఉత్తర్వులన్నీ చట్టబద్ధమైన విధానాల ప్రకారమే వెలువడ్డాయని వెల్లడించింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More