పెండింగ్ చలానాలు ఉంటే ఆర్‌సీ, లైసెన్స్, పీయూసీ కట్: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

ట్రాఫిక్ ఈ-చలానాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించే వాహనదారులపై సుప్రీంకోర్టు కఠిన చర్యలకు ఆదేశించింది. పెండింగ్ చలానాలు ఉంటే ఆర్‌సీ నవీకరణ, పీయూసీ, వాహన బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ సేవలను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.

Published on: Oct 3, 2026, 20:33:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ట్రాఫిక్ చలానాలను తేలిగ్గా తీసుకునే వాహనదారులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. బకాయి ఉన్న ఈ-చలానాలను చెల్లించకపోతే వాహనాలకు సంబంధించిన పలు డిజిటల్, ఆన్‌లైన్ సేవలను తక్షణమే స్తంభింపజేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పెండింగ్ చలానాలు ఉన్న వాహనాలను కేంద్ర ప్రభుత్వ 'పరివాహన్' పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, వాటికి సంబంధించి ఎలాంటి సేవలు అందించకూడదని స్పష్టం చేసింది.

పెండింగ్ చలానాలు ఉంటే ఆర్‌సీ, లైసెన్స్, పీయూసీ కట్: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు
పెండింగ్ చలానాలు ఉంటే ఆర్‌సీ, లైసెన్స్, పీయూసీ కట్: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

కోట్ల రూపాయల చలానాలు పెండింగ్

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్డు భద్రతపై దాదాపు 14 ఏళ్లుగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

"కేవలం వేలల్లో, లక్షల్లో ఈ-చలానాలను జారీ చేస్తే సరిపోదు. ఆ జరిమానాలను అధికారులు వసూలు చేయలేకపోతే ఈ వ్యవస్థ మొత్తానికే అర్థం ఉండదు" అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జారీ చేసిన ఈ-చలానాలలో రూ. 49,194.05 కోట్లు బకాయిలు ఉన్నాయని, కేవలం రూ. 26,175.05 కోట్లు మాత్రమే వసూలయ్యాయని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.

ఏయే సేవలు నిలిచిపోతాయి?

సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం.. బకాయిలు చెల్లించే వరకు వాహనదారులకు కింది ఆన్‌లైన్ సేవలను రవాణా శాఖ అధికారులు నిలిపివేయనున్నారు.

  • ఆర్‌సీ (నమోదు పత్రం) నవీకరణ
  • డూప్లికేట్ ఆర్‌సీ జారీ చేయడం
  • వాహన యజమాని చిరునామా మార్పు
  • ఫిట్‌‌నెస్ సర్టిఫికెట్ జారీ
  • వాహనాన్ని వేరొకరికి అమ్మడం లేదా యాజమాన్య బదిలీ (ట్రాన్స్‌ఫర్)
  • పీయూసీ జారీ

పెండింగ్ చలానాలు క్లియర్ అయ్యే వరకు ఏ కేంద్రం కూడా పీయూసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

లైసెన్స్ రద్దు, సీజ్ హెచ్చరికలు

వరుసగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లపై కూడా సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. పదే పదే తప్పులు చేసే వారి డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) నవీకరణను నిలిపివేయాలని, అవసరమైతే ఉన్న లైసెన్స్‌ను సస్పెండ్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

2026లో అమల్లోకి వచ్చిన సవరించిన రూల్ 21(25) ప్రకారం.. ఒకే ఏడాదిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలకు పాల్పడితే, దానిని సమాజానికి ముప్పుగా పరిగణిస్తారు.

మరోవైపు రహదారులపై పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు (Random checks) నిర్వహించాలని, పెండింగ్ ఈ-చలానాలు ఉన్నట్లు తేలితే ఆ వాహనాలను సీజ్ (Impound) చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 2025 అక్టోబర్ 28న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఎస్‌ఓపీ (SOP)ని, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 136ఏ, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 167ఏ నిబంధనలను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More