న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని దోషిగా తేల్చి జరిమానా విధించిన బిహార్ సెషన్స్ జడ్జి తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు తమ పరిధులు, అధికారాలను తెలుసుకుని నడుచుకోవాలి తప్ప 'రాబిన్‌హుడ్', 'బాహుబలి'లా ప్రవర్తించకూడదని ఘాటుగా హెచ్చరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

"ఇక సాహసాలు చాలు. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్లి శిక్షణ తీసుకోండి. మీరు రాబిన్‌హుడ్ కావాల్సిన అవసరం లేదు.. బాహుబలి కావాలనుకుంటున్నారా? ఒక న్యాయమూర్తిగా మీ పరిమితులు, అధికార పరిధి ఏమిటో ముందుగా అర్థం చేసుకోండి" అని సెషన్స్ జడ్జి అనిల్ కుమార్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చట్టంపై అవగాహన ఇదేనా? సుప్రీం ధర్మాసనం విస్మయం
ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాలను ఒక అధికారి పాటించకపోతే, దానిని 'కోర్టు కళ్లెదుట జరిగిన నేరం' (అఫెన్స్ కమిటెడ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ది కోర్టు)గా పరిగణించడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. "కోర్టు ఎదుట జరిగే ఉల్లంఘన లేదా నేరానికి సంబంధించిన చట్టాన్ని మీరు అర్థం చేసుకున్న తీరు మమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. ముందుగా మీరు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 384, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 345 పరిధిని తెలుసుకోవాలి" అని ధర్మాసనం హితవు పలికింది.
కోర్టు గదిలో ఎవరినైనా చెంపదెబ్బ కొట్టడం, న్యాయస్థానాన్ని దూషించడం లేదా బయటకు వెళ్లాలని ఆదేశించినా వెళ్లకపోవడం వంటి చర్యలు మాత్రమే 'కోర్టు ఎదుట జరిగిన నేరం' కిందకు వస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేతప్ప, కోర్టు చెప్పినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ఆ కేటగిరీలోకి రాదని తేల్చి చెప్పింది. "ఒక వ్యక్తిని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మేం ఆదేశించినప్పుడు, అతను అలా చేయకపోతే అది కోర్టు ఎదుట చేసిన నేరం అనిపించుకోదు" అని పేర్కొన్న ధర్మాసనం.. సదరు న్యాయాధికారికి చట్టంపై ఉన్న అవగాహన విస్మయకరంగా ఉందని వ్యాఖ్యానించింది.
అసలు వివాదం ఏమిటంటే..
బిహార్‌లోని రోహ్తాస్ ఎస్పీపై సెషన్స్ జడ్జి అనిల్ కుమార్ చేపట్టిన చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన ఆదేశాలను అమలు చేయడంలో పదేపదే జాప్యం చేస్తున్నారంటూ ఎస్పీకి జడ్జి సమన్లు జారీ చేశారు. ఆదేశాల ఉల్లంఘనను కోర్టు ఎదుట జరిగిన నేరంగా పరిగణించి, ఎస్పీని దోషిగా నిర్ధారిస్తూ రూ. లక్ష జరిమానా విధించారు.
{{/usCountry}}బిహార్‌లోని రోహ్తాస్ ఎస్పీపై సెషన్స్ జడ్జి అనిల్ కుమార్ చేపట్టిన చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన ఆదేశాలను అమలు చేయడంలో పదేపదే జాప్యం చేస్తున్నారంటూ ఎస్పీకి జడ్జి సమన్లు జారీ చేశారు. ఆదేశాల ఉల్లంఘనను కోర్టు ఎదుట జరిగిన నేరంగా పరిగణించి, ఎస్పీని దోషిగా నిర్ధారిస్తూ రూ. లక్ష జరిమానా విధించారు.
{{/usCountry}}ఓ క్రిమినల్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సెషన్స్ కోర్టు 2025 సెప్టెంబర్‌లో ఆదేశాలు ఇచ్చింది. అయితే పోలీసులు దాదాపు 10 నెలల తర్వాత, 2026 జులైలో ఆ ఆదేశాలను అమలు చేశారు. వివరణ కోరినప్పుడు ఆలస్యంగా స్పందించడం, ఎస్పీపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేస్తూ ఇచ్చిన నివేదికపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించకపోవడం వంటి అంశాలను కూడా జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు.
మరోవైపు, ఎఫ్ఐఆర్ నమోదు ఆదేశాలతో కూడిన ప్రధాన తీర్పుపై అప్పటికే పాట్నా హైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న పాట్నా హైకోర్టు స్పందిస్తూ.. ఇది 'విచిత్రమైన', 'గతంలో ఎన్నడూ చూడని' పరిస్థితి అని పేర్కొంది. ప్రధాన తీర్పుపై అప్పీల్ పెండింగ్‌లో ఉన్నందున సెషన్స్ జడ్జి 'ప్రక్రియాపరమైన సమగ్రత'ను పాటించాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఎస్పీపై నమోదు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్ పూర్తి రికార్డులను తెప్పించుకోవడంతో పాటు, నవంబర్ 25న జరగనున్న తదుపరి విచారణ వరకు ఈ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ అక్టోబర్ 8 నాటి ఉత్తర్వులను సవాలు చేస్తూ అనిల్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యాయం చేయాలన్న తపన ఉన్నా.. పరిధి దాటకూడదు
కోర్టు ఆదేశాలను అమలు చేయించి బాధితులకు న్యాయం చేయాలన్న సదరు న్యాయాధికారి ఉద్దేశాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. అయినప్పటికీ, చట్టం నిర్దేశించిన ప్రక్రియను పక్కనపెట్టడానికి అది కారణం కాకూడదని స్పష్టం చేసింది. "మీ భావాలను మేం అర్థం చేసుకుంటున్నాం. న్యాయం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. కానీ, మనమంతా కొన్ని ప్రక్రియాపరమైన నిబంధనలు, క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు" అని అనిల్ కుమార్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేసింది.
పరిపాలనాపరమైన హోదాలో తనిఖీ న్యాయమూర్తి (ఇన్స్పెక్టింగ్ జడ్జి) తనకు సమన్లు జారీ చేయడంపై అనిల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం), ఎస్పీలను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించి, వారు రాకపోవడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించినప్పుడు మీరు మీ పరిధిలోనే వ్యవహరించారా అని నిలదీసింది. "ఈ అధికారాన్ని వినియోగించేటప్పుడు మీరు మీ పరిధిలోనే ఉన్నారా?" అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎస్పీ ప్రవర్తన క్రిమినల్ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని భావిస్తే, ఆ విషయాన్ని హైకోర్టుకే వదిలేయాల్సిందని పేర్కొంది.
న్యాయాధికారులు తమ అధికార పరిధులపై స్పృహతో ఉండాలని, చట్టం అనుమతించిన దానికంటే ఎక్కువ అధికారాలను ఆపాదించుకోకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీలో పునశ్చరణ శిక్షణ (రిఫ్రెషర్ ట్రైనింగ్) తీసుకోవాలని సూచిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. అదే సమయంలో అనిల్ కుమార్ ఇచ్చే వివరణను, ఆయన సమర్పించే క్షమాపణను 'సానుభూతితో' పరిశీలించాలని పాట్నా హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది.
ABOUT THE AUTHOR
ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.