స్థానిక పోరులో 'ఇద్దరు పిల్లల' నిబంధనపై సుప్రీంకోర్టు పునరాలోచన
దేశంలో సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధనపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారాన్ని సమగ్ర విచారణ కోసం సీజేఐ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించే చట్టాల ప్రాధాన్యత ప్రస్తుతం తుడిచిపెట్టుకుపోయిందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశంలో మారుతున్న జనాభా సమతుల్యత, వేగంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్)ను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ముందుకు తీసుకెళ్తూ విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. 2003 నాటి 'జావేద్ వర్సెస్ హర్యానా ప్రభుత్వం' కేసు తీర్పులో ఇద్దరు పిల్లల నిబంధనను సమర్థించినప్పటికీ, నాటి అంచనాలు ప్రస్తుత జనాభా వాస్తవాలకు దూరంగా ఉన్నందున ఆ తీర్పును మళ్లీ సమీక్షించాల్సి ఉందని పేర్కొంది.

"దేశంలో భారీ జనాభా ఉందనే ఒక్క కారణంతో మారుతున్న జనాభా పెరుగుదల రేటును నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విధానాలు ఉండాలి. సంతానోత్పత్తి రేటు కోలుకోలేని విధంగా పడిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనపై ఉంది" అని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఏ రాష్ట్రాల్లో ఈ నిబంధన అమలులో ఉంది?
కోర్టుకు అమికస్ క్యూరీ రుక్మిణి బాబ్డే సమర్పించిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం అస్సాం, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన అమలవుతోంది. మరో 7 రాష్ట్రాలు ఈ నిబంధనను ఇప్పటికే రద్దు చేయగా, 15 రాష్ట్రాల్లో అసలు ఇటువంటి ఆంక్షలే లేవు. ఒకప్పుడు సరైనదే అనిపించిన చట్టమైనా, అది ఆధారపడిన ప్రాథమిక పరిస్థితులు మారినప్పుడు ఆ నిబంధన చెల్లుబాటు కాకుండాపోతుందని, ఈ చట్టాలపై రాజ్యాంగబద్ధమైన పునఃపరిశీలన అవసరమని ధర్మాసనం పేర్కొంది.
మహారాష్ట్ర సర్పంచ్ పిటిషన్‌తో వెలుగులోకి..
మహారాష్ట్రకు చెందిన మంగళ భీమ్రావ్ ఇంగ్లే అనే మహిళ 2022 స్థానిక ఎన్నికల్లో కాకోడ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అయితే, ఆమెకు 2014లో మూడో సంతానం కలిగిందనే కారణంతో మహారాష్ట్ర గ్రామ పంచాయతీల చట్టం-1959 ప్రకారం బాంబే హైకోర్టు ఆమె ఎన్నికను రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ ఇంగ్లే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ ఇంగ్లే సర్పంచ్‌గా కొనసాగేందుకు అనుమతించింది. చట్టం చెల్లుబాటుపై తుది నిర్ణయం విస్తృత ధర్మాసనం తేల్చే వరకు ఈ స్టే అమలులో ఉంటుంది.
తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు.. వృద్ధాప్యం వైపు దేశం
సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోవడమే ఈ నిబంధనపై పునరాలోచనకు ప్రధాన కారణమని కోర్టు వివరించింది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) గణాంకాల ప్రకారం 2003లో దేశంలో సంతానోత్పత్తి రేటు 3.02గా ఉండగా, 2024 నాటికి అది 1.9కి పడిపోయింది. సాధారణంగా జనాభా స్థిరీకరణకు (రీప్లేస్మెంట్ లెవల్) సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ ఎస్) లోనూ ఇది 2.0 గా నమోదైంది.
గత దశాబ్దాల్లో ఎక్కువ జనాభా నమోదవ్వడం వల్ల ప్రస్తుతం దేశంలో వెంటనే జనాభా తగ్గకపోవచ్చు. కానీ ఇదే రీతిలో సంతానోత్పత్తి రేటు పడిపోతే భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గి, వయోవృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, శ్రామిక శక్తి, ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.
2014లో దేశంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల శాతం 8.3 ఉండగా, 2024 నాటికి అది 9.7 శాతానికి చేరిందని, 2036 నాటికి ఇది 15 శాతానికి చేరుతుందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. ఆర్థిక సర్వే 2025-26, ఐక్యరాజ్యసమితి (యూఎన్) నివేదికల ప్రకారం భారత్ అనుభవిస్తున్న ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ (యువ శ్రామిక శక్తి ప్రయోజనం) 2030 నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గనుంది.
చైనా, జపాన్ దేశాల అనుభవాలు మనకు కనువిప్పు కావాలని ధర్మాసనం పేర్కొంది. చైనా 2015లో 'ఒక్కరే పిల్లలు' విధానాన్ని రద్దు చేసి, ఆ తర్వాత ముగ్గురు పిల్లల వరకు అనుమతి ఇచ్చింది. పిల్లల్ని కనేలా ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు తెచ్చినప్పటికీ అక్కడ జననాల రేటు అనుకున్నంతగా పెరగలేదు. "చనిపోయిన గుర్రంపై స్వారీ చేస్తూ భవిష్యత్తు వైపు పయనించలేం.. 2003 నాటి జావేద్ తీర్పును పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది" అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
సామాజిక, రాజ్యాంగ కోణాలు.. మహిళలపై పడే భారం
మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మారకపోతే అది అన్యాయానికి దారితీస్తుందని, అది ఒక రకంగా అధికార దుర్వినియోగమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాల ప్రభావం, పనితీరును ప్రభుత్వం నిరంతరం సమీక్షించాలి. ఎన్నికల పోటీకి, పిల్లల సంఖ్యకు ముడిపెట్టడం వల్ల అర్హత కలిగిన పౌరులు రాజకీయ ప్రాతినిధ్యానికి దూరమవుతున్నారని కోర్టు అభిప్రాయపడింది.
1993 నాటి కె. కరుణాకరన్ కమిటీ పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు అన్ని స్థాయిలలోనూ ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారిని అనర్హులుగా చేయాలని సిఫార్సు చేసింది. కొన్ని రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో దీనిని అమలు చేసినప్పటికీ, కేంద్ర స్థాయిలో చట్టం కాలేదు. 1992లో తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు కూడా రాజకీయ అంగీకారం లేక వీగిపోయింది.
ఈ నిబంధన వల్ల మహిళలే ఎక్కువగా నష్టపోతున్నారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. పితృస్వామ్య వ్యవస్థలో కుటుంబ పరిమాణంపై నిర్ణయాలు పురుషుల చేతుల్లోనే ఉంటాయి. 2009లో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఎన్నికల అనర్హత నుంచి తప్పించుకోవడానికి బలవంతపు అబార్షన్లు చేయించడం, గర్భిణులైన భార్యలను వదిలేయడం, పిల్లల తండ్రిగా గుర్తింపును నిరాకరించడం వంటి దారుణాలు జరిగినట్లు వెల్లడైంది.
మగ సంతానం కోరిక కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి కారణమవుతోంది. సంతాన నియంత్రణ పేరుతో దంపతులు పిల్లల్ని కనే హక్కుపై బలవంతపు ఆంక్షలు విధించడాన్ని సమర్థించలేమని కోర్టు తేల్చిచెప్పింది. 2016 నాటి 'రాజ్ బాలా వర్సెస్ హర్యానా' కేసు తీర్పును కూడా ప్రస్తావిస్తూ, విద్యార్హతలు, శానిటేషన్ నిబంధనల వల్ల ఎస్సీ వర్గాలు, ప్రత్యేకించి మహిళలు ఎన్నికలకు దూరమయ్యారనే విమర్శలపై మళ్లీ చర్చ జరగాల్సి ఉందన్నారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


