దయచేసి పిల్లలను కనండి.. సంతానోత్పత్తి రేటుపై ఆరోగ్యమంత్రి ఆందోళన

Andhra Pradesh : రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటుపై ఆరోగ్యమంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. త‌గు చ‌ర్యలు తీసుకోకుంటే తీవ్రమైన అన‌ర్థాలు ఉంటాయని తెలిపారు.

Published on: Mar 30, 2026 9:18 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్షీణించ‌డం కారణంగా ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని.. రాష్ట్ర ప్రజ‌ల్ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ హెచ్చరించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్రమేణా అతి త‌క్కువ‌గా 1.50కు ప‌డిపోవ‌డం, దాని ప‌రిణామాల‌పై మంత్రి తీవ్ర ఆందోళ‌న‌ను వెలిబుచ్చారు. ఈ స‌మ‌స్యను స‌మిష్టిగా ఎదుర్కోడానికి ప్రజ‌లు, మీడియా, ఇత‌ర భాగ‌స్వాములు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి న‌డుం బిగించాల‌ని పిలుపునిచ్చారు.

సంతానోత్పత్తి రేటుపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆందోళన
సంతానోత్పత్తి రేటుపై రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఆందోళన

జ‌నాభా స్థిరీక‌ర‌ణ‌కు సంతానోత్పత్తి రేటు 2.10 అవ‌స‌రం కాగా.. ప‌లు ద‌శాబ్దాలుగా అనుస‌రించిన జ‌నాభా నియంత్రణ విధానంతో ఈ రేటు నేటికి 1.50 శాతానికి ప‌డిపోయింద‌ని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఇక‌నైనా దిద్దుబాటు చ‌ర్యల్ని చేప‌ట్టకుంటే ప్రజ‌లు, రాష్ట్ర ఆర్థిక ప్రగ‌తికి తీవ్ర విఘాతం ఏర్పడ‌నుంద‌ని మంత్రి హెచ్చరించారు. తీరు మార‌కుంటే అధిక యువశ‌క్తితో కూడిన జ‌నాభాతో ల‌భించే ప్రయోజ‌నం(పాపులేష‌న్ డివిడెండ్‌) 2040 నాటికి క‌నుమ‌రుగై.. అధిక శాతం వృద్ధుల‌తో కూడిన జ‌నాభా భారంగా (పాపులేష‌న్ డెట్‌) మార‌నుంద‌ని మంత్రి స్పష్టం చేశారు. సంతానోత్పత్తి క్షీణ‌త‌తో ఆర్థిక ప్రగ‌తికి ఊత‌మిచ్చే కార్మిక శ‌క్తి(వ‌ర్క్‌ఫోర్స్‌) త‌గ్గిపోయి భారీగా పెర‌గ‌నున్న వ‌యో వృద్ధుల భారాన్ని మోయాల్సి ఉంటుంద‌ని మంత్రి వెల్లడించారు.

2035నాటికి రాష్ట్రంలో జ‌నాభా స్థిరీక‌ర‌ణ ల‌క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నూత‌న ప్రణాళిక‌ను రూపొందించింద‌ని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన కుటుంబ నియంత్రణ ల‌క్ష్యాల సాధ‌నంగా అమ‌లైన జ‌నాభా నియంత్రణ విధానానికి స్వస్తి ప‌లికాలని కోరారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని క‌నేలా కుటుంబాలు స్వచ్ఛంద నిర్ణయాలు తీసుకునే అనుకూల ప‌రిస్థితుల్ని క‌ల్పించ‌డం ఈ నూత‌న విధానం ల‌క్ష్యమ‌ని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ అన్నారు.

'త‌ల్లికి పూర్తి ఆరోగ్య భ‌ద్రత క‌ల్పించి ఆరోగ్యక‌ర‌మైన శిశువుల‌కు జ‌న్మనివ్వడం, వారి పోష‌ణ, పెంపు, పూర్తి ఆరోగ్యంతో కూడిన స‌మ‌ర్థులైన కౌమార, యువ‌శక్తికి దారులు వేయ‌డం, సాంఘిక భ‌ద్రత‌తో కూడిన, గౌర‌వ ప్రద‌మైన, ఉత్పాద‌క అవ‌కాశాల‌తో కూడిన జీవితానికి గ‌ట్టి పునాదులు వేయ‌డం ఈ నూత‌న ప్రణాళిక ల‌క్ష్యం.' అని మంత్రి చెప్పారు.

ఇప్పటి వ‌ర‌కు అమ‌లు చేసిన జ‌నాభా నియంత్రణ విధానంతో రాష్ట్రంలో జ‌నాభా వృద్ధి రేటు 2011-15 కాలంలో ఉన్న 7.10 శాతం నుండి నేటికి 1.70 శాతానికి త‌గ్గింద‌ని, ఇదే మార్గంలో 2035 నాటికి మ‌రింతగా త‌గ్గి 0.30 శాతానికి ప‌డిపోతుంద‌ని మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆందోళ‌న వెలిబుచ్చారు. సంతానోత్పత్తి రేటు 1.68 నుండి 1.50కు ప‌డిపోయి స‌వ‌ర‌ణ చ‌ర్యలు చేప‌ట్టకుంటే ఇంకా క్షీణించే అవ‌కాశ‌ముంద‌ని మంత్రి స్పష్టం చేశారు.

ఈ ప‌రిణామాల ప‌ర్యవ‌సానాల‌ను వివ‌రిస్తూ.. ప్రస్తుత రాష్ట్ర జ‌నాభా మ‌ధ్యస్త వ‌య‌సు 32.50 సంవ‌త్సరాలుండ‌గా.. దేశ స్థాయిలో ఇది నాలుగున్నరేళ్ల త‌క్కువ‌గా కేవ‌లం 28 సంవ‌త్సరాలు మాత్రమే ఉంద‌న్నారు. ప్రస్తుత తీరు కొన‌సాగిస్తే ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతుంద‌ని, రాష్ట్రంలో వ‌య‌సు మ‌ళ్లే వారి సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని మంత్రి ఆందోళ‌న వ్యక్తం చేశారు.

సంతానోత్పత్తి క్షీణ‌త కారణంగా రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు జ‌నాభా 2011లో మొత్తం జ‌నాభాలో 25 శాతం ఉండ‌గా ఇది 2036 నాటికి 15 శాతానికి త‌గ్గనుంద‌ని, దీనికి సమాంత‌రంగా 60 ఏళ్లు దాటిన వారి జ‌నాభా 10 శాతం నుండి దాదాపు రెట్టింపై 2036 నాటికి 19 శాతానికి, 2047 నాటికి 23 శాతానికి పెరిగి స్వర్ణాంధ్ర సాధ‌న ల‌క్ష్యానికి తీవ్ర విఘాత‌మేర్పడనుంద‌ని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ నేప‌థ్యంలో స్వర్ణాంధ్ర ల‌క్ష్య సాధ‌న‌కు రానున్న 10 సంవ‌త్సరాలు అత్యంత కీల‌క‌మ‌ని, 2035 నాటికి 2.10 సంతానోత్పత్తి రేటును సాధించి జనాభా స్థిరీక‌ర‌ణ‌కు బాటులు వేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని మంత్రి స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More