తమిళనాడులో మరోసారి డీఎంకేకే పట్టం.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనాలు
తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.

తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే రెండో సారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది.
అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది.
తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేపట్టనుందని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి.
శాతాలా వారీగా
డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది.
మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా, పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చారు.
18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది.
ఆ స్థానాల్లో టీవీకే గట్టి పోటీ
డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది.
ప్రధాన అభ్యర్థుల స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతున్నారు.
మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
విజయ్ ఒక సీటులో వెనుకంజ
సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది.
డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై మైలాపూర్‌లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటుడు దివంగత విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్‌కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి.
ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక
డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్‌కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోంది.
ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్‌కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్‌లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది. ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్‌కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది.
విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


