Tamil Nadu Elections : తమిళనాడులో రాజకీయ చదరంగం- డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వం కోసం బీజేపీ కృషి! అదే జరిగితే..

DMK AIADMK alliance : తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఊహించని మలుపు తిరిగింది. 50 ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే ఇప్పుడు చెయ్యి కలపబోతున్నాయనే వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయ్​ టీవీకేని అధికారానికి దూరం చేసేందుకు ఈ అసాధారణ పొత్తుకు తెరలేస్తున్నట్లు సమాచారం.

Published on: May 8, 2026, 05:58:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay TVK : తమిళ రాజకీయాల్లో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం కాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎంజీఆర్, కరుణానిధి కాలం నుంచి రాజకీయంగా ఉప్పు-నిప్పులా ఉండే డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఇప్పుడు విజయ్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు చేతులు కలపాలని యోచిస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్​కి చెందిన టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో, ద్రవిడ పార్టీల అస్తిత్వానికి ముప్పు ఏర్పడింది. దీనితో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుని విజయ్‌ను గద్దె ఎక్కకుండా చూడాలనేది వీరు వ్యూహాలు రచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

డీఎంకే చీఫ్​ స్టాలిన్- టీవీకే అధినేత విజయ్..
డీఎంకే చీఫ్​ స్టాలిన్- టీవీకే అధినేత విజయ్..

ఎంజీఆర్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? ఉదయనిధి వర్గం భయం!

డీఎంకేలోని ఉదయనిధి స్టాలిన్ వర్గం.. విజయ్ ఎదుగుదలను చూసి తీవ్ర ఆందోళనలో ఉంది. గతంలో ఎంజీఆర్ సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చి ఎలాగైతే డీఎంకేను దశాబ్దాల పాటు అధికారానికి దూరం చేశారో, ఇప్పుడు విజయ్ కూడా అదే రీతిలో మ్యాజిక్ చేస్తారని వారు భయపడుతున్నారు.

అటు అన్నాడీఎంకే పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. జయలలిత మరణం తర్వాత వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీ, తన ఉనికిని కాపాడుకోవడానికి డీఎంకే మద్దతుతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందట.

సీఎంగా పళనిస్వామి.. బయట నుంచి డీఎంకే మద్దతు?

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే, డీఎంకే బయట నుంచి మద్దతు ఇచ్చేలా ఒప్పందం కుదురుతోందట. టీవీకేతో కలిసిన కాంగ్రెస్​ని అధికారంలో ఉండకుండా చేసేందుకు డీఎంకే- అన్నాడీఎంకే మధ్య సయోధ్య కుదుర్చే విధంగా బీజేపీయే ప్లాన్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఈ ‘వింత’ పొత్తుపై డీఎంకేలోని సీనియర్ నేతలు, ముఖ్యంగా ఎంకే స్టాలిన్ కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని ఏళ్లుగా ఒకరిపై ఒకరు పోరాడి, ఇప్పుడు చేతులు కలిపితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వారు ఆందోళనలో ఉన్నారట. తమిళనాడు ఓటర్లు భావోద్వేగపూరితమైన వారని, ఇలాంటి ప్రయోగాలను వారు సహించకపోవచ్చని సీనియర్లు భావిస్తున్నారు.

విజయ్ ‘రాజీనామా’ అస్త్రం.. గవర్నర్ తీరుపై ఆగ్రహం

234 సీట్లున్న అసెంబ్లీలో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే, అతిపెద్ద పార్టీగా తనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు చూపిస్తేనే ఆహ్వానిస్తానని గవర్నర్ ఆర్​వీ అర్లేకర్ పట్టుబట్టడం వివాదాస్పదమైంది. బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాలి కానీ, రాజ్‌భవన్‌లో కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, డీఎంకే-ఏఐఏడీఎంకే అపవిత్ర పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తే, తమ పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని విజయ్ హెచ్చరించారు. ఈ నిర్ణయం తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఎన్నికల ఫలితాల విశ్లేషణ:

టీవీకే (విజయ్): 108 సీట్లు (అతిపెద్ద పార్టీ)

డీఎంకే కూటమి: 59 (డీఎంకే) + 5 (కాంగ్రెస్) + ఇతరులు = మొత్తం 70 పైచిలుకు. కాంగ్రెస్​ ఇప్పుడు టీవీకేకి మద్దతిస్తోంది.

అన్నాడీఎంకే కూటమి: 47 (ఏఐఏడీఎంకే) + 6 (మిత్రపక్షాలు) + 4 (పీఎంకే) = మొత్తం 57.

రాజకీయ మనుగడ కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి ద్రవిడ పార్టీలు ఏకమవుతాయా? లేక విజయ్ రాజీనామా అస్త్రంతో మళ్లీ ఎన్నికలకు వెళతారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More