Tata Steel share price : మంచి ఫలితాలు వచ్చినా పతనమవుతున్న టాటా స్టీల్ షేర్లు- కొనాలా? అమ్మేయాలా?

Tata Steel share : ఇటీవలే ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం ఏకంగా 147 శాతం పెరిగి రూ.2,965 కోట్లకు చేరింది. అయినప్పటికీ, సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఈ టాటా గ్రూప్ స్టాక్ 4 శాతానికి పైగా పతనమై ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది.

Published on: May 18, 2026, 10:12:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ ‘టాటా స్టీల్’ సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా పతనమైంది. శుక్రవారం రూ.216.84 వద్ద ముగిసిన ఈ స్టాక్, నేడు రూ.211 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో టాటా స్టీల్​ షేరు ధర 4.6శాతం నష్టాలతో రూ. 206.72 వద్ద ట్రేడ్​ అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ మంచి లాభాలను అర్జించినప్పటికీ షేరు ధర ఈ స్థాయిలో పతనం అవుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే కంపెనీ సాధించిన లాభాలు మార్కెట్ నిపుణులు అంచనా వేసిన దానికంటే స్వల్పంగా తక్కువగా ఉండటమే ఈ ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.

టాటా స్టీల్ స్టాక్ క్రాష్.. కారణం ఇదే!
టాటా స్టీల్ స్టాక్ క్రాష్.. కారణం ఇదే!

టాటా స్టీల్ క్యూ4 ఫలితాల ముఖ్యాంశాలు..

నికర లాభం : గత ఆర్థిక సంవత్సరం క్యూ4 లో రూ.1,201 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం.. ఈ ఏడాది మార్చి త్రైమాసికానికి ఏకంగా 147 శాతం వృద్ధితో రూ.2,965 కోట్లకు పెరిగింది. అయితే, మార్కెట్ నిపుణులు దీనిని రూ.3,065 కోట్లుగా అంచనా వేశారు.

ఆదాయం : కంపెనీ మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే (రూ.56,218 కోట్లు) 13 శాతం పెరిగి రూ.63,270 కోట్లకు చేరుకుంది. ఇది అనలిస్టులు ఊహించిన రూ.62,440 కోట్ల అంచనాను అధిగమించింది.

ఎబిట్​డా: కంపెనీ ఎబిటా 47 శాతం వృద్ధితో రూ.9,953 కోట్లుగా నమోదైంది.

డివిడెండ్ ప్రకటన: కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఫైనాన్షియల్ ఇయర్ 2026 కోసం రూ.1 ఫేస్​ వాల్యూ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుపై రూ.4 ఫైనల్ డివిడెండ్‌ను సిఫార్సు చేశారు. జులై 2, 2026న జరిగే ఏజీఎంలో దీనికి ఆమోదం లభించిన తర్వాత, జులై 6, 2026 నుంచి అర్హులైన ఖాతాదారులకు ఈ డివిడెండ్ చెల్లించనున్నారు.

ఈ ఫలితాలపై టాటా స్టీల్ సీఈఓ అండ్ ఎండీ టి.వి.నరేంద్రన్ మాట్లాడుతూ.. "ఆర్థిక సంవత్సరం 2026 ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు సమస్యలు, టారిఫ్ వివాదాల వల్ల ఉక్కు రంగానికి సవాలుగా మారింది. అయినప్పటికీ మా పటిష్ట వ్యయ నియంత్రణ పద్ధతుల వల్ల గ్లోబల్ బిజినెస్‌లో మంచి పనితీరు కనబరిచాం. ముఖ్యంగా టాటా స్టీల్ ఇండియా చరిత్రలోనే అత్యుత్తమంగా సుమారు 22.5 మిలియన్ టన్నుల డెలివరీలను నమోదు చేసింది," అని పేర్కొన్నారు.

టాటా స్టీల్ షేరు కొనాలా? అమ్మేయాలా? బ్రోకరేజ్ సంస్థల సలహా ఇలా..

టాటా స్టీల్ షేరు ప్రస్తుత పతనంలో ఉన్నప్పటికీ, ప్రముఖ దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. టాటా స్టీల్ షేర్లకు ‘బై’ రేటింగ్‌ను పునరుద్ఘాటించడంతో పాటు.. భవిష్యత్తు కోసం రూ.250 టార్గెట్ ప్రైజ్​ని నిర్ణయించింది.

యూరప్ వ్యాపారంలో ఉన్న ఉద్గారాల సవాళ్లు, ధరల అస్థిరత వంటి స్వల్పకాలిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. టాటా స్టీల్ దీర్ఘకాలిక భవిష్యత్తు చాలా బలంగా ఉందని బ్రోకరేజ్ పేర్కొంది. భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్, మెరుగైన ఉక్కు ధరల వాతావరణం కారణంగా రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ మరింత వృద్ధి సాధిస్తుందని, అందువల్ల ప్రస్తుత ధర వద్ద ఈ టాటా స్టాక్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ తన నివేదికలో అభిప్రాయపడింది.

(గమనిక- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్ చేసే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More