TCS share price : క్యూ2 ఫలితాల తర్వాత భారీగా పెరిగిన టీసీఎస్ షేర్లు- ఇప్పుడు కొనొచ్చా?
ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికంలో రూ. 13,884 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రూ. 12 డివిడెండ్ ప్రకటన, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆదాయం 3.1 బిలియన్ డాలర్లు దాటడంతో షేరు ధర 5 శాతం మేర జంప్ అయ్యింది. మరి టీసీఎస్ స్టాక్‌ని ఇప్పుడు కొనొచ్చా?
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఐటీ ఇండెక్స్ దూసుకెళుతోంది. మరీ ముఖ్యంగా దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు 5శాతం లాభాల్లో ఉన్నాయి. ఉదయం 10:30 నిమిషాలకు టీసీఎస్ షేర్లు 5.63శాతం పెరిగి రూ. 2192.80 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 2,202.90 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి. త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆకట్టుకోవడంతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగం నుంచి బలమైన ఆదాయం లభించడం ఈ ర్యాలీకి కారణం.

టీసీఎస్ షేర్ ప్రైజ్ టుడే- ఫలితాలు, డివిడెండ్..
భారత ఐటీ రంగానికి ఊపిరిపోస్తున్న దిగ్గజ సంస్థ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో (క్యూ2 ఎఫ్వై27) అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఏడాది ప్రాతిపదికన ఏకంగా 15 శాతం వృద్ధితో రూ. 13,884 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 12,075 కోట్లుగా నమోదైంది.
ఈ త్రైమాసికానికి గాను కంపెనీ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయం 11 శాతం పెరిగి రూ. 73,188 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ. 65,799 కోట్లుగా ఉంది. స్థిరమైన కరెన్సీ ప్రాతిపదికన సీక్వెన్షియల్ ఆదాయ వృద్ధి 0.5 శాతంగా నిలిచింది. ఈ త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ 24 శాతంగా, నికర మార్జిన్ 19 శాతంగా నమోదయ్యాయి.
అద్భుత ఫలితాలు సాధించిన సందర్భంగా కంపెనీ యాజమాన్యం తమ వాటాదారులకు ప్రతి షేరుపై రూ. 12 చొప్పున రెండో ఇంటర్నల్ డివిడెండ్‌ను ప్రకటించింది.
టీసీఎస్ షేర్ ప్రైజ్ టుడే- 3.1 బిలియన్ డాలర్లకు చేరిన ఏఐ ఆదాయం..
అంతర్జాతీయ మార్కెట్లలో, దాదాపు అన్ని వర్టికల్స్‌లోనూ స్థిరమైన వృద్ధి నమోదైందని టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కె. కృతివాసన్ తెలిపారు.
"పోర్షే, బెస్ట్ బై వంటి దిగ్గజ సంస్థలతో కుదుర్చుకున్న భాగస్వామ్యాలు వ్యాపార రూపాంతరంలో కొత్త శకానికి నాంది పలికాయి. క్లయింట్లు తమ వ్యాపారాల వ్యాప్తంగా కృత్రిమ మేధను విస్తరించుకునేందుకు అనువైన వేదికలను అభివృద్ధి చేస్తున్నాం," అని ఆయన పేర్కొన్నారు.
కంపెనీ మొత్తం రాబడిలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగపు వార్షిక ఆదాయం రికార్డు స్థాయిలో 3.1 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది సంస్థ మొత్తం ఆదాయంలో 10 శాతానికి పైగా ఉండటం గమనార్హం. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షేతో కుదుర్చుకున్న 1.25 బిలియన్ యూరోల డీల్‌తో పాటు, పూణె, బెంగళూరులలో ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ ల్యాబ్‌లను కంపెనీ ప్రారంభించింది. ఏఐ-ఆధారిత డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, సైబర్ సెక్యూరిటీ సేవలకు మార్కెట్లో అత్యంత బలమైన డిమాండ్ ఉందని టీసీఎస్ సీఓఓ ఆర్తి సుబ్రమణ్యన్ వివరించారు.
అమెరికా గ్రీన్ కార్డ్ నిర్ణయంపై స్పష్టత..
ఇటీవల అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారుల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ (పీఈఆర్ఎం- గ్రీన్ కార్డు ప్రాసెస్) నుంచి ప్రధాన ఐటీ సంస్థలను సస్పెండ్ చేయడంపై టీసీఎస్ యాజమాన్యం స్పందించింది. తమ కంపెనీ సమర్పించే పర్మ్ దరఖాస్తులు గత రెండేళ్లుగా సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయని, దీనివల్ల కంపెనీ వర్క్‌ఫోర్స్ లేదా కస్టమర్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
"అమెరికా కార్మిక శాఖ ఇచ్చే ప్రతీ ఆదేశాన్ని మేము కచ్చితంగా పాటిస్తాం. అమెరికాలో ఇప్పటికే మాకు 31 ఆఫీసులు, డెలివరీ సెంటర్లు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో మరో 15,000 మంది స్థానిక అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం," అని కంపెనీ నివేదికలో పేర్కొంది.
టీసీఎస్ షేర్ ప్రైజ్ టుడే- కొనొచ్చా?
ఫలితాల అనంతరం టీసీఎస్ షేరుపై వివిధ బ్రోకరేజ్ సంస్థలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి:
ఎమ్‌కే గ్లోబల్ : ‘యాడ్’ రేటింగ్ కేటాయించిన ఎమ్‌కే, టీసీఎస్ షేర్ ప్రైజ్ టార్గెట్‌ని రూ. 2,600గా నిర్ణయించింది. ప్రస్తుత ధరతో పోలిస్తే 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏఐ భాగస్వామ్యాలు, డేటా సెంటర్ పెట్టుబడుల వల్ల స్వల్పకాలికంగా మార్జిన్లపై ఒత్తిడి ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో 26-28 శాతం మార్జిన్ పరిధిని అందుకోగలదని ఎమ్‌కే తెలిపింది.
బాబ్ క్యాపిటల్ : గతంలో ఇచ్చే 'సెల్' రేటింగ్‌ను ‘హోల్డ్’గా అప్‌గ్రేడ్ చేసింది. షేర్ ప్రైజ్ టార్గెట్‌ని రూ. 2,015 కు పెంచినప్పటికీ, రాబడి స్థిరంగా ఉన్నా మార్జిన్లు కొంత బలహీనంగా ఉన్నాయని అభిప్రాయపడింది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


