Tesla New SUV : మిడిల్​ క్లాస్​పై టెస్లా ఫోకస్​! తక్కువ ధరకే కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ..

Tesla budget EV : ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఒక ఎంట్రీ-లెవల్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది! ప్రస్తుత మోడల్-3 కంటే తక్కువ ధరకు రానున్న ఈ కారు విశేషాలు, టెస్లాలో మారుతున్న వ్యూహాలపై ప్రత్యేక కథనాన్ని ఇక్కడ చూసేయండి..

Published on: Apr 11, 2026, 08:15:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tesla EV : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌ను శాసిస్తున్న ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా.. ఇప్పుడు మధ్యతరగతి వినియోగదారులనే లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటివరకు లగ్జరీ, ప్రీమియం సెగ్మెంట్లకే పరిమితమైన టెస్లా.. త్వరలో ఒక చౌకైన 'ఎంట్రీ-లెవల్ ఎస్‌యూవీ'ని మార్కెట్​లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ కొత్త కారు ధర టెస్లా అత్యంత చౌకైన మోడల్-3 (సుమారు రూ. 34.31 లక్షలు) కంటే కూడా తక్కువగా ఉండబోతోంది!

ృమిడిల్​ క్లాస్​పై టెస్లా ఫోకస్​! తక్కువ ధరకే కొత్త ఈవీ..
ృమిడిల్​ క్లాస్​పై టెస్లా ఫోకస్​! తక్కువ ధరకే కొత్త ఈవీ..

భారత్ వంటి దేశాల్లో టెస్లా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వాహన ప్రియులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే, అధిక ధరల కారణంగా ఇప్పటివరకు టెస్లా కార్లు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈ కొత్త మోడల్ ఆ అడ్డంకిని తొలగించే అవకాశం ఉంది.

టెస్లా కొత్త ఎస్‌యూవీ ప్రత్యేకతలు ఇవే..

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం ఉన్న ‘మోడల్ వై’కి మరొక వేరియంట్ కాదని, ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లు ఇలా ఉన్నాయి:

కొలతలు: ఇది సుమారు 4.3 మీటర్ల పొడవుతో, మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి వస్తుంది. మోడల్ వై కంటే ఇది కాస్త చిన్నదిగా ఉంటుంది.

బరువు, బ్యాటరీ: కారు బరువును తగ్గించడానికి టెస్లా ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని బరువు సుమారు 1,500 కేజీలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ధర తగ్గించడానికి ఇందులో చిన్న సైజు బ్యాటరీని వాడనున్నారు, దీనివల్ల రేంజ్ కాస్త తగ్గే అవకాశం ఉంది.

మోటార్: ఇందులో రెండు మోటార్లకు బదులుగా సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను మాత్రమే అందించనున్నారు.

ఉత్పత్తి: మొదటగా చైనాలోని షాంఘై ఫ్యాక్టరీలో ఈ కారును ఉత్పత్తి చేసి, ఆపై అమెరికా, యూరప్ మార్కెట్లకు విస్తరించాలని టెస్లా భావిస్తోంది. ఆ తర్వాత ఈ టెస్లా కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇండియాలోకి కూడా వచ్చే అవకాశం ఉంది.

మారిన టెస్లా వ్యూహం: మోడల్ ఎస్, ఎక్స్ నిలిపివేత..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టెస్లా తన సుదీర్ఘ కాలపు మోడల్స్ అయిన ‘మోడల్ ఎస్’ సెడాన్, ‘మోడల్ ఎక్స్’ ఎస్‌యూవీల ఉత్పత్తిని నిలిపివేసింది. హ్యూమనాయిడ్ రోబోల తయారీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంపై మరింత దృష్టి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ తన ‘సైబర్‌క్యాబ్’ రోబోటాక్సీ ఉత్పత్తి కోసం సిద్ధమవుతోంది. దీనికి స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఉండవు, ఇది పూర్తిగా స్వయంప్రతిపత్తి తో నడుస్తుంది.

మనుషులు నడిపే కార్లే కావాలి!

గతంలో టెస్లా 25 వేల డాలర్లకే (సుమారు రూ. 21 లక్షలు) 'మోడల్ 2' కారును తెస్తామని ప్రకటించి, తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేసింది. ఆ తర్వాత.. కేవలం రోబోటాక్సీలపైనే ఫోకస్ పెడతామని మస్క్ చెప్పారు. అయితే, ప్రపంచ మార్కెట్లలో డ్రైవర్ లేని కార్ల కంటే, మనుషులు నడిపే కార్లకే ఇంకా క్రేజ్ ఎక్కువగా ఉందని టెస్లా గుర్తించినట్లు కనిపిస్తోంది. అందుకే, రోబోటాక్సీ టెక్నాలజీతో పాటు మనిషి నడిపే ఆప్షన్ ఉన్న హైబ్రిడ్ మోడల్స్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది. దీనివల్ల సేల్స్ పెరగడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. టెస్లా కొత్త బడ్జెట్ కారు ధర ఎంత ఉండవచ్చు?

ప్రస్తుతం అమెరికాలో మోడల్-3 ప్రారంభ ధర 37,000 డాలర్లు (సుమారు రూ. 34.31 లక్షలు). కొత్తగా రాబోయే ఎస్‌యూవీ ధర అంతకంటే తక్కువగా ఉంటుందని అంచనా.

2. ఈ కొత్త కారు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?

ఈ కారు ఉత్పత్తి ఈ ఏడాది ప్రారంభమయ్యే అవకాశం లేదు. 2026-27 నాటికి అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

3. టెస్లా ఏ మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేసింది?

టెస్లా తన ప్రీమియం మోడల్స్ అయిన మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్ల ఉత్పత్తిని అధికారికంగా నిలిపివేసింది.

4. కొత్త ఎస్‌యూవీలో రేంజ్ తక్కువగా ఉంటుందా?

అవును, ధరను తగ్గించడం కోసం ఇందులో చిన్న బ్యాటరీని వాడుతున్నట్లు సమాచారం. అందువల్ల మోడల్ వై లేదా మోడల్ 3 తో పోలిస్తే దీని రేంజ్ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More