FD returns : సీనియస్​ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లను ఆఫర్​ చేస్తున్న టాప్​ బ్యాంకులు ఇవి..

భారతదేశంలోని కోట్లాది మందికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం కొన్ని బ్యాంకులు 8శాతం కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. టాప్ బ్యాంకుల వడ్డీ రేట్ల జాబితా ఇక్కడ చూడండి..

Published on: Apr 5, 2026, 10:45:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో పొదుపు చేయాలనుకునే వారికి, ముఖ్యంగా స్థిరమైన ఆదాయం కోరుకునే వృద్ధులకు 'ఫిక్స్‌డ్ డిపాజిట్లు' (ఎఫ్​డీ) దశాబ్దాలుగా నమ్మకమైన ఆయుధంగా ఉన్నాయి. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చే ఈ పథకాలు తక్కువ రిస్క్ కోరుకునే వారికి సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. మార్కెట్‌ను ఎప్పటికప్పుడు గమనించే సమయం లేని వారికి, ఒక నిర్ణీత కాలానికి డబ్బును దాచుకోవడానికి ఎఫ్‌డీలు చక్కగా ఉపయోగపడతాయి.

ఎఫ్​డీలపై వృద్ధులకు అధిక వడ్డీ రేట్లను ఇస్తున్న బ్యాంకులు ఇవి.. (HT_PRINT)
ఎఫ్​డీలపై వృద్ధులకు అధిక వడ్డీ రేట్లను ఇస్తున్న బ్యాంకులు ఇవి.. (HT_PRINT)

అయితే సాధారణ పౌరులతో పోలిస్తే, సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఎప్పుడూ కాస్త ఎక్కువ వడ్డీనే అందిస్తాయి. ప్రస్తుతం కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మూడు సంవత్సరాల లోపు కాలపరిమితి గల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై 8శాతం కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

ఎఫ్​డీలపై వృద్ధులకు అత్యధిక వడ్డీని అందిస్తున్న బ్యాంకులు..

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : 375 నుంచి 400 రోజుల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీని అందిస్తోంది. విశేషమేమిటంటే, ఈ వడ్డీ రేటు సాధారణ పౌరులకు కూడా వర్తిస్తుంది!

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : ఈ బ్యాంకులో రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8శాతం వడ్డీ లభిస్తుంది. దీని కాలపరిమితి రెండు ఏళ్ల (730 రోజులు) నుంచి మూడు ఏళ్ల (1,095 రోజులు) వరకు ఉంటుంది.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : మార్చి 29 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం, ఈ బ్యాంకులో 30 నెలల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు ఏకంగా 8.25% వడ్డీ లభిస్తోంది. అదే 5 ఏళ్ల కాలపరిమితికి 8.05% వడ్డీ ఇస్తున్నారు.

అయితే సాధారణంగా స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​ కాస్త రిస్కీగా చూస్తుంటారు. అయితే, రూ. 5లక్షల వరకు పెట్టుబడిపై ఆర్బీఐ గ్యారంటీ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

ప్రముఖ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు (2 నుంచి 3 ఏళ్ల కాలపరిమితికి)..

పెద్ద బ్యాంకుల్లో వడ్డీ రేట్లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, భద్రత దృష్ట్యా చాలా మంది వీటినే ఎంచుకుంటారు:

కోటక్ మహీంద్రా బ్యాంక్- 7.20 శాతం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 6.95 శాతం

ఐసీఐసీఐ బ్యాంక్ - 6.95 శాతం

యాక్సిస్ బ్యాంక్ - 6.95 శాతం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 6.90 శాతం

కెనరా బ్యాంక్ - 6.85 శాతం

పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 6.80 శాతం

స్వల్పకాలిక పెట్టుబడుల ద్వారా నిశ్చింతగా లాభాలు పొందాలనుకునే సీనియర్ సిటిజన్లు తమకు నచ్చిన బ్యాంకును ఎంచుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు-

1. సీనియర్ సిటిజన్లకు సాధారణ పౌరుల కంటే ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ ఎందుకు లభిస్తుంది?

వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం, ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు సాధారణంగా 0.50% నుంచి 0.75% వరకు అదనపు వడ్డీని అందిస్తాయి.

2. ఎఫ్‌డీ కాలపరిమితి ముగియక ముందే డబ్బు విత్ డ్రా చేస్తే ఏమవుతుంది?

మెచ్యూరిటీ కంటే ముందే డబ్బు తీసుకోవడాన్ని 'ప్రిమెచ్యూర్ విత్ డ్రాయల్' అంటారు; ఇలా చేసినప్పుడు బ్యాంకులు వర్తించే వడ్డీ రేటులో 0.5% నుంచి 1% వరకు జరిమానా విధిస్తాయి.

3. ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారా?

అవును, ఒక ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయం రూ. 40,000 (సీనియర్ సిటిజన్లకు రూ. 50,000) దాటితే బ్యాంకులు 10శాతం టీడీఎస్ కోత విధిస్తాయి; ఒకవేళ మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోతే ఫామ్ 15జీ/15హెచ్ సమర్పించి దీనిని నివారించవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More