...
...
Next Story

Tiger Woods : కారు క్రాష్​ కేసులో గోల్ఫ్​ లెజెండ్​ టైగర్​ వుడ్స్​ అరెస్ట్​- డ్రగ్స్​ తీసుకున్నారా?

గోల్ఫ్ లెజెండ్ టైగర్ వుడ్స్ ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదానికి గురై, డ్రైవింగ్ కేసులో అరెస్టయ్యారు. మద్యం సేవించలేదని తేలినా, డ్రగ్స్ ప్రభావం ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు.

Published on: Mar 28, 2026, 05:25:48 IST
Advertisement

ప్రపంచ గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా ఫ్లోరిడాలో శుక్రవారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన నివాసానికి సమీపంలో కారు వేగంగా నడుపుతూ ప్రమాదానికి గురవ్వడంతో, పోలీసులు ఆయనపై డ్రైవింగ్ అండర్ ఇన్​ఫ్లుయెన్స్ (డీయూఐ) కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

టైగర్​ వుడ్స్​.. (AFP)
టైగర్​ వుడ్స్​.. (AFP)

అయితే, ఫ్లోరిడా చట్టాల ప్రకారం ఎనిమిది గంటల నిర్బంధం తర్వాత ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.

టైగర్​ వుడ్స్​ అరెస్ట్​- అసలేం జరిగింది?

మార్టిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అందించిన వివరాల ప్రకారం.. జూపిటర్ ఐలాండ్​లోని తన ఇంటి సమీపంలో టైగర్ వుడ్స్ తన ల్యాండ్ రోవర్ కారులో వేగంగా వెళుతున్నారు. ఒక ట్రక్కును ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఆయన కారు ఆ ట్రక్కు వెనుక ఉన్న ట్రైలర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వుడ్స్ ప్రయాణిస్తున్న కారు పల్టీ కొపడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే వుడ్స్ స్వయంగా పక్క డోర్ నుంచి బయటకు రాగలిగారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో వుడ్స్‌కు గానీ, ఎదుటి వాహనదారుడికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు.

టైగర్​ వుడ్స్​ అరెస్ట్​- మద్యం కాదు.. మరేదైనా?

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. టైగర్​ వుడ్స్ ప్రవర్తనలో అసాధారణ మార్పులను గమనించారు! దీంతో ఆయన్ని వెంటనే మార్టిన్ కౌంటీ జైలుకు తరలించి పరీక్షలు నిర్వహించారు. బ్రీత్‌ అనలైజర్ పరీక్షలో ఆయన మద్యం సేవించలేదని తేలింది. అయితే, ఏదైనా మందులు లేదా డ్రగ్స్ ప్రభావం వల్ల ఆయన అదుపు తప్పి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే యూరిన్​ టెస్టు చేయాలని భావించారు. కానీ గోల్ఫ్​ లెజెండ్​ నిరాకరించారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో వుడ్స్ ఒంటరిగానే ఉన్నారని, ఆయన గర్ల్​ఫ్రెంట్​ వెనెస్సా ట్రంప్ (ట్రంప్​ జూనియర్​కి మాజీ భార్య) గానీ, ఆమె కుమార్తె గానీ అక్కడ లేరని అధికారులు స్పష్టం చేశారు.

టైగర్​ వుడ్స్​ అరెస్ట్​- డొనాల్డ్ ట్రంప్ స్పందన..

టైగర్ వుడ్స్‌కు అత్యంత సన్నిహితుడైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఘటనపై స్పందించారు. "నాకు చాలా బాధగా ఉంది. అక్కడ ప్రమాదం జరిగిందని, ఆయన కొంత ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలిసింది. వుడ్స్ నాకు అత్యంత ఆప్త మిత్రుడు. ఆయన అద్భుతమైన వ్యక్తి," అని ట్రంప్ పేర్కొన్నారు.

మరో వివాదం.. పాత జ్ఞాపకాలు..

టైగర్ వుడ్స్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు! 2017లో కూడా ఆయన డ్రైవింగ్ కేసులో అరెస్టయ్యారు. ఆ తర్వాత 2021లో జరిగిన ఒక ఘోర కారు ప్రమాదంలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే ఆయన మళ్లీ గోల్ఫ్ మైదానంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక 'మాస్టర్స్' టోర్నీలో ఆయన ఆడతారా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks