...
...
Next Story

Toyota Glanza facelift : టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్- మైలేజ్, సేఫ్టీ అప్డేట్స్ ఇవే..

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించేందుకు టయోటా సిద్ధమైంది. అక్టోబర్ 14, 2026న గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. కొత్త జెడ్-సిరీస్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ అడాస్ సేఫ్టీ ఫీచర్లు, 33 కి.మీ పైగా మైలేజ్ ఇచ్చేలా ఈ కారును తీర్చిదిద్దారు. పూర్తి వివరాల్లోకి వెళితే.

Published on: Sep 13, 2026, 09:11:05 IST
Advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడల్ టయోటా గ్లాంజా సరికొత్త అవతారంలోకి మారనుంది. తన భాగస్వామ్య సంస్థ మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకొచ్చిన వెంటనే, టయోటా కూడా తన గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అక్టోబర్ 14, 2026న అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసింది. సరికొత్త డిజైన్, ఆధునిక రక్షణ ఫీచర్లు, కొత్త పవర్‌ఫుల్ ఇంజిన్‌తో రూపుదిద్దుకున్న ఈ కారు హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

టయోటా గ్లాంజా..
టయోటా గ్లాంజా..

పెరిగిన ఇంధన ధరల నేపథ్యంలో మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు ఇచ్చే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. టయోటా అందించే నమ్మకమైన సర్వీస్, మెరుగైన రీసేల్ వ్యాల్యూకి ఇక్కడి కస్టమర్లు ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సరికొత్త జెడ్-సిరీస్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) టెక్నాలజీతో రానుండటంతో కారు ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

స్పోర్టీ లుక్.. డిజైన్‌లో కీలక మార్పులు

టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్ తన బాడీ రూపాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, ముందు భాగంలో స్పష్టమైన మార్పులు చేశారు. వీ-షేప్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ పరిమాణాన్ని పెంచి, ముందు వైపు బంపర్‌ను మరింత స్పోర్టీగా డిజైన్ చేశారు. సరికొత్త ఎయిర్ ఇంటేక్స్, చతురస్రాకార ఫాగ్ లాంప్ హౌసింగ్స్ కారుకు ఒక ప్రీమియం విజిబిలిటీని తెచ్చిపెట్టాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్తగా రూపొందించిన 16-ఇంచుల అలాయ్ వీల్స్, వెనుక భాగంలో ఆకర్షణీయమైన సీ-షేప్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ కారు లుక్‌ను పెంచాయి.

ప్రీమియం ఇంటీరియర్.. లెవెల్-2 అడాస్ సేఫ్టీ

2026 టయోటా గ్లాంజ క్యాబిన్ లేఔట్‌లో ప్రధాన మార్పులు లేకపోయినా, సాంకేతిక సదుపాయాలను భారీగా పెంచారు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే 9-ఇంచుల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విండోల వద్ద వెంటిలేటెడ్ సీట్లు, యాక్టివ్ కూలింగ్ సదుపాయం ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను అమర్చారు.

ఇంతకుముందు ఉన్న 4-సిలిండర్, 1.2 లీటర్ కే-సిరీస్ ఇంజిన్ స్థానంలో ఇప్పుడు సరికొత్త 1.2 లీటర్, 3-సిలిండర్ జెడ్-సిరీస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఇది 81 బీహెచ్​పీ పవర్, 112.4 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

కంపెనీ ఫిటెడ్ సీఎన్జీ ఆప్షన్ కూడా ఈ టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్​లో అందుబాటులో ఉండనుంది. సీఎన్జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 70 బీహెచ్​పీ పవర్, 102 ఎన్​ఎం టార్క్‌ను అందిస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 24 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుండగా, సీఎన్జీ వెర్షన్ కిలో గ్రాముకు 33 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఈ కారు ఇంధన వ్యయాన్ని భారీగా తగ్గించనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks