Toyota Innova Hycross Facelift : టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- వేరియంట్లు, వాటి ఫీచర్లు..

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ ఎంపీవీ వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి.. 

Published on: Nov 27, 2026, 08:15:17 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఇటీవలే లాంచ్ అయిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ సేల్స్.. దేశీయ మార్కెట్లో మొదలయ్యాయి. ఫ్లెక్స్-ఫ్యూయల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ శ్రేణిని జీ-ఎస్ఎల్ఎఫ్, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు. పెట్రోల్ మోడల్ మాత్రం ఎంపిక చేసిన అప్‌గ్రేడ్‌లతో జీఎక్స్ వేరియంట్‌లోనే కొనసాగుతోంది. హైబ్రిడ్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలను రూ. 19.99 లక్షల నుంచి రూ. 31.99 లక్షల వరకు నిర్ణయించారు.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్​లిఫ్ట్..
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్​లిఫ్ట్..

ఈ నేపథ్యంలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఎంపీవీ వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్..

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్, హైబ్రిడ్ రెండు వెర్షన్లలోనూ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. జీఎక్స్ పెట్రోల్ మోడల్ 6,600 ఆర్‌పీఎం వద్ద 127 కేడబ్ల్యూ (సుమారు 170 బీహెచ్​పీ) పవర్​ని, 4,400-4,600 ఆర్‌పీఎం వద్ద 206 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది; సీక్వెన్షియల్ షిఫ్ట్‌తో కూడిన డైరెక్ట్ షిఫ్ట్ సీవీటీ గేర్‌బాక్స్ ఇందులో ఉంది.

ఐదో తరం స్ట్రాంగ్-హైబ్రిడ్ వ్యవస్థ గరిష్ఠంగా 147 కేడబ్ల్యూ (సుమారు 197 బీహెచ్​పీ) పవర్​ని అందిస్తుంది. ఇందులో ఇంజిన్ 188 ఎన్​ఎం టార్క్‌ను, ఎలక్ట్రిక్ మోటార్ 206 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. సీక్వెన్షియల్ షిఫ్ట్‌తో కూడిన ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్, 56-సెల్ లిథియం-అయాన్ బ్యాటరీతో పాటు ఈ ఇంజిన్ ఈ20-ఈ85 ఇథనాల్-పెట్రోల్ మిశ్రమాలకు మద్దతు ఇస్తుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు, వాటి ఫీచర్లు..

1.ఎంట్రీ లెవల్ జీ-ఎస్ఎల్ఎఫ్ హైబ్రిడ్-

రూ. 19.99 లక్షల ధరతో వచ్చే టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంట్రీ-లెవల్ జీ-ఎస్ఎల్ఎఫ్ హైబ్రిడ్ ఏడు, ఎనిమిది సీట్ల అమరికలలో లభిస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి ఈ వేరియంట్ ప్రధాన ప్రత్యేకత; ఇది అన్నింటిలో ప్రామాణికంగా ఉంటుంది.

205/65 టైర్లతో కూడిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, మాన్యువల్ ఏసీ ఇందులో ఉన్నాయి. క్యాబిన్‌లో నలుపు రంగు ఫాబ్రిక్ అప్​హోలిస్ట్రీ, 17.8 సెం.మీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, నాలుగు స్పీకర్లతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఆడియో సిస్టమ్ అమర్చారు. పుష్-బటన్ స్టార్ట్ ఉన్నప్పటికీ స్మార్ట్-ఎంట్రీ, రివర్స్ కెమెరా, టెలిమాటిక్స్, ఎస్ఓఎస్ ఈ-కాల్, పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ గ్రేడ్‌లో లేవు.

2. అదనపు సౌకర్యాలతో జీఎక్స్ వేరియంట్-

జీఎక్స్ హైబ్రిడ్ ధర ఏడు సీట్ల మోడల్‌కు రూ. 23.99 లక్షలు కాగా, ఎనిమిది సీట్ల మోడల్‌కు రూ. 24.04 లక్షలుగా ఉంది. ఇందులోనూ 8-అంగుళాల స్క్రీన్, 17.8 సెం.మీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, నాలుగు స్పీకర్ల ఆడియో సిస్టమ్, మాన్యువల్ ఏసీ కొనసాగుతాయి.

జీ-ఎస్ఎల్ఎఫ్‌తో పోలిస్తే జీఎక్స్‌లో స్మార్ట్ ఎంట్రీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, టెలిమాటిక్స్, ఎస్ఓఎస్ ఈ-కాల్ వంటి సౌకర్యాలను జోడించారు; 80 కిలోమీటర్ల వేగ పరిమితిని తొలగించారు. ఏడు సీట్ల వెర్షన్‌లో రెండో వరుసలో కెప్టెన్ సీట్లు, ఎనిమిది సీట్ల వెర్షన్‌లో స్ప్లిట్ బెంచ్ సీటుతో పాటు నలుపు ఫాబ్రిక్ అప్​హోలిస్ట్రీ ఇచ్చారు. పెట్రోల్ జీఎక్స్ ఏడు సీట్ల ధర రూ. 19.59 లక్షలు, ఎనిమిది సీట్ల ధర రూ. 19.64 లక్షలుగా ఉంది.

3. క్యాబిన్ అప్‌గ్రేడ్‌లతో వీఎక్స్, ఫుల్ సేఫ్టీతో జెడ్ఎక్స్-

క్యాబిన్ ఫీచర్లలో భారీ మార్పులతో వస్తున్న వీఎక్స్ హైబ్రిడ్ ధర ఏడు సీట్ల వెర్షన్‌కు రూ. 28.79 లక్షలు, ఎనిమిది సీట్ల వెర్షన్‌కు రూ. 28.84 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో 31.2 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అంతే పరిమాణంలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, ఆరు స్పీకర్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సదుపాయం కల్పించారు.

పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఫ్రంట్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ రియర్ బ్లోవర్ కంట్రోల్, వెనుక సన్‌షేడ్స్, పనోరమిక్ వ్యూ మానిటర్, క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్లు, టైర్-ప్రెజర్ మానిటరింగ్ వంటి ఫీచర్లు వీఎక్స్‌లో ఉన్నాయి. సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్-షిఫ్ట్ నాబ్, నీలి రంగు యాంబియంట్ లైటింగ్, చెస్ట్‌నట్-నలుపు ఫాబ్రిక్ అప్​హోలిస్ట్రీ క్యాబిన్ అందాన్ని పెంచుతాయి. అయితే టయోటా సేఫ్టీ సెన్స్ ఇందులో లేదు.

రూ. 31.99 లక్షల ధరతో వచ్చే జెడ్ఎక్స్ వేరియంట్‌లో డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ట్రేస్ అసిస్ట్, ప్రీ-కొలిజన్ అసిస్టెన్స్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఆటోమేటిక్ హై బీమ్‌లతో కూడిన పూర్తి స్థాయి అడాస్ 'టయోటా సేఫ్టీ సెన్స్' ప్యాకేజీని చేర్చారు. శ్రేణిలోని అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ముందు-వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ మౌంట్లు, అడ్జెస్టెబుల్ హెడ్ రెస్ట్రెంట్‌లను ప్రామాణికంగా అందించారు.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్- ఎవరికి ఏ వేరియంట్ సరిపోతుంది?

జీ-ఎస్ఎల్ఎఫ్ వేరియంట్‌లో గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి ఉండటంతో, ఇది ప్రైవేట్ కస్టమర్ల కంటే ఫ్లీట్ లేదా కమర్షియల్ అవసరాలకు ఉద్దేశించిన మోడల్‌గా స్పష్టమవుతోంది. ఎక్కువ సౌకర్యాలు, భద్రత కోరుకునే వారికి వీఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్లు మెరుగైన ఎంపికలుగా నిలుస్తాయి. పూర్తి అడాస్ భద్రతా ఫీచర్లు మాత్రం జెడ్ఎక్స్ వేరియంట్‌లోనే లభిస్తాయి.

మరి.. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్​లో మీరు ఏ వేరియంట్​ని కొంటున్నారు?

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.