...
...
Next Story

స్పామ్ కాల్స్ తక్కువగా ఉన్న టెలికాం నెట్‌వర్క్ ఇదే

అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల కట్టడికి ట్రాయ్ కఠిన చర్యలు చేపట్టింది. 2026 జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలతో పోలిస్తే రిలయన్స్ జియో నెట్‌వర్క్ నుంచి తక్కువ స్పామ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 1.24 లక్షలకు పైగా నంబర్లపై వేటు పడింది.

Published on: Nov 16, 2026, 15:03:04 IST
Advertisement

లోన్ కావాలా.. క్రెడిట్ కార్డు తీసుకుంటారా అంటూ రోజూ వచ్చే ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారాయి. ఈ అవాంఛిత వాణిజ్య కమ్యూనికేషన్ల (యూసీసీ) బెడదను అరికట్టేందుకు భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) నిఘాను ముమ్మరం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జులై–సెప్టెంబర్ 2026) సంబంధించిన గణాంకాలను ట్రాయ్ తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రధాన ప్రైవేట్ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో నెట్‌వర్క్ నుంచి వచ్చే స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లపై అతి తక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి.

స్పామ్ కాల్స్ తక్కువగా ఉన్న టెలికాం నెట్‌వర్క్ ఏది?
స్పామ్ కాల్స్ తక్కువగా ఉన్న టెలికాం నెట్‌వర్క్ ఏది?

2026 జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో టెలికాం ఆపరేటర్ల కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలు ఏకంగా 19.9 బిలియన్ల (1,990 కోట్లు) ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను అనుమానిత స్పామ్‌గా గుర్తించాయి. ఇందులో 18.28 బిలియన్ల (1,828 కోట్లు) కాల్స్, 1.62 బిలియన్ల (162 కోట్లు) ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా టెలికాం నెట్‌వర్క్‌ల నుంచి 714.01 బిలియన్ల (71,401 కోట్లు) అవుట్‌గోయింగ్ కాల్స్, 702.28 బిలియన్ల (70,228 కోట్లు) ఎస్ఎంఎస్‌లు వెళ్లాయి. వీటిపై ట్రాయ్‌కు మొత్తం 15.29 లక్షల (1.529 మిలియన్లు) ఫిర్యాదులు అందగా, అందులో 7.23 లక్షల ఫిర్యాదులను చర్యలకు అర్హమైనవిగా నిర్ధారించింది. సగటున ప్రతి 10 లక్షల అవుట్‌గోయింగ్ కాల్స్‌కు సుమారు 2.14 ఫిర్యాదులు నమోదయ్యాయి.

జియో వర్సెస్ ఎయిర్‌టెల్ వర్సెస్ వీఐ.. ఎవరిపై ఎన్ని ఫిర్యాదులు?

ట్రాయ్ త్రైమాసిక నివేదిక ప్రకారం.. 2026 సెప్టెంబర్ 30 నాటికి రిలయన్స్ జియోకు 527.25 మిలియన్ల (52.72 కోట్లు) క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. భారతీ ఎయిర్‌టెల్‌కు 506.7 మిలియన్లు (50.67 కోట్లు), వొడాఫోన్ ఐడియా (వీఐ)కు 200.88 మిలియన్ల (20.08 కోట్లు) సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మిగతా రెండు సంస్థలతో పోలిస్తే జియోకు అత్యధిక వినియోగదారులు ఉన్నప్పటికీ, ఆ నెట్‌వర్క్ నుంచి వెళ్లిన స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లపై కేవలం 2,93,716 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌పై 3,52,062 ఫిర్యాదులు రాగా, వొడాఫోన్ ఐడియాపై అత్యధికంగా 5,39,285 ఫిర్యాదులు నమోదయ్యాయి.

స్పామ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించిన వారిపై టెలికాం సంస్థలు కఠినంగా వ్యవహరించాయి. ఈ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ 7,889 టెలికాం వనరులను ఏడాది పాటు శాశ్వతంగా తొలగించగా, జియో 4,963, వొడాఫోన్ ఐడియా 355 కనెక్షన్లను నిలిపివేశాయి. నిబంధనలు అతిక్రమించిన సెండర్లను బ్లాక్‌లిస్ట్ చేయడంలో జియో ముందుంది. జియో 274 మంది సెండర్లను ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్ చేయగా, ఎయిర్‌టెల్ 85 మందిని, వొడాఫోన్ ఐడియా 9 మందిని బ్లాక్‌లిస్ట్ చేశాయి. అలాగే జియో 1,506 ఎస్ఎంఎస్ హెడర్లను బ్లాక్ చేయగా, ఎయిర్‌టెల్ 882, వొడాఫోన్ ఐడియా 770 హెడర్లను నిలిపివేశాయి.

మరోవైపు డు నాట్ డిస్టర్బ్ (డీఎన్‌డీ) సేవలను నమోదు చేసుకోవడంలో జియో వినియోగదారులు వెనుకబడ్డారు. సెప్టెంబర్ 30 నాటికి జియో సబ్‌స్క్రైబర్లలో కేవలం 10.7 శాతం మంది మాత్రమే డీఎన్‌డీ ప్రాధాన్యతలను నమోదు చేసుకున్నారు. ఎయిర్‌టెల్‌లో 17.2 శాతం, వొడాఫోన్ ఐడియాలో 32.7 శాతం మంది వినియోగదారులు డీఎన్‌డీని యాక్టివేట్ చేసుకున్నారు.

1.24 లక్షల కనెక్షన్లపై వేటు.. 374 మంది బ్లాక్‌లిస్ట్

దేశవ్యాప్తంగా స్పామ్ నియంత్రణ చర్యల్లో భాగంగా 2026-27 రెండో త్రైమాసికంలో 1,24,000 (1.24 లక్షలకు పైగా) టెలికాం వనరులపై ట్రాయ్ చర్యలు తీసుకుంది. తొలిసారి నిబంధనలు ఉల్లంఘించినందుకు మొబైల్ నంబర్లతో సహా మొత్తం 1,10,325 టెలికాం వనరులకు 15 రోజుల పాటు అవుట్‌గోయింగ్ సేవలను నిలిపివేసింది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన 13,777 కనెక్షన్లను ఏడాది పాటు తొలగించింది. వీటితో పాటు 3,725 ఎస్ఎంఎస్ హెడర్లను బ్లాక్ చేసి, 374 మంది సెండర్లను ఏడాది పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ కాలవ్యవధిలో వారు కొత్త టెలికాం కనెక్షన్లు పొందేందుకు వీలుండదు.

ట్రాయ్ డీఎన్‌డీ యాప్ కీలక పాత్ర.. ఏఐ నిఘా

స్పామ్ కాల్స్‌పై ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులు 'ట్రాయ్ డీఎన్‌డీ యాప్'ను ప్రధాన వేదికగా ఉపయోగించుకున్నారు. త్రైమాసికంలో అందిన మొత్తం ఫిర్యాదుల్లో 92.9 శాతం, అంటే 14.21 లక్షల ఫిర్యాదులు ఈ యాప్ ద్వారానే నమోదయ్యాయి. సెప్టెంబర్ 30 నాటికి ఈ యాప్ డౌన్‌లోడ్ల సంఖ్య 42.36 లక్షలకు చేరింది.

స్పామ్ సందేశాలు పంపుతున్నట్లు అనుమానం ఉన్న సంస్థలకు టెలికాం ఆపరేటర్లు 45.9 లక్షలకు పైగా హెచ్చరిక నోటిఫికేషన్లు జారీ చేశారు. 34,025 మంది అనుమానిత సెండర్లకు ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) ధ్రువీకరణ నిర్వహించగా, కేవైసీ ప్రక్రియలో విఫలమైన 9,977 కనెక్షన్లను తొలగించారు. ప్రమోషనల్ కాల్స్‌ను సాధారణ సర్వీస్, లావాదేవీల కాల్స్ నుంచి వినియోగదారులు సులభంగా గుర్తించేందుకు ట్రాయ్ ప్రత్యేక నంబరింగ్ సిరీస్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks